- ఓట్ల లెక్కింపు అంశంలో జోక్యానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరణ
- వైసీపీ వేసిన ఎస్ఎల్పీని తోసిపుచ్చిన వైనం
- ఇప్పటికే తిరస్కరించిన ఏపీ హైకోర్టు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (వైసీపీ)కి సుప్రీంకోర్టు సైతం గట్టి షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన మార్గదర్శకాలను సవాల్ చేస్తూ వైసీపీ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇదే వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఇప్పటికే వైసీపీ పిటిషన్‌ను తిరస్కరించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రతి అంశం మీద కోర్ట్ మెట్లు ఎక్కడం న్యాయస్థానాలతో మొట్టికాయలు తినడం సర్వ సాధారణంగా మారిపోయింది. హై కోర్టు కాదంటే ఇక్కడ తిన్న మొట్టికాయిలు సరిపోలేదంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టడం ఆనవాయితీగా మారింది. ఈ క్రమంలోనే సోమవారం మరోసారి సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురయింది.
పోస్టల్ బ్యాలెట్ల ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించిన ‘ఫాం-13ఏ’ పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి ఆ అధికారి పేరు, హోదా, అధికారిక ముద్ర (సీలు) లేకున్నా ఆ ఓట్లు చెల్లుబాటవుతాయంటూ మే 30న ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై వైసీపీ తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలంటూ రిట్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వైసీపీ వాదనలను తిరస్కరిస్తూ జూన్ 1న తీర్పు వెలువరించింది.
హైకోర్టులో వాదనల సందర్భంగా ఎన్నికల సంఘం (ఈసీ) తరఫు న్యాయవాది వాదిస్తూ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఒకవేళ పిటిషనర్‌కు ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఫలితాల తరువాత ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించారు. ఈసీ వాదనతో జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది.
అయితే హైకోర్టు తమ వాదనను పట్టించుకోలేదంటూ వైసీపీ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు ఈ కేసులో హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేసిన విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ.. సుప్రీంకోర్టులో కేవియట్ వేశారు. తీర్పు వెలువరించే ముందు తన వాదనలు కూడా వినాలని కోరారు. అయితే వైసీపీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.