- కార్యక్రమంలో తాను భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నాం
- సేవలోనే నిజమైన ఆనందం.. ఆ అదృష్టం కొందరికే దక్కుతుంది
- పేదల సంక్షేమం, ఆధ్యాత్మిక సేవకు ధనవంతులు ముందుకురావాలి
- శ్రీకృష్ణదేవరాయలు నుంచి జైన్ దంపతుల వరకు భక్తి పరంపర కొనసాగుతోంది
- చెన్నైకు చెందిన జైన్ దంపతులతో కలిసి మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- శ్రీవారికి రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు, వజ్రాభరణాల సమర్పించిన దాతలపై ప్రశంసలు
తిరుమల(చైతన్యరథం): డబ్బు, సంపద, హోదా ఎప్పటికీ శాశ్వతం కాదు… ఆధ్యాత్మికత, ధర్మం, సేవా భావమే మనిషికి అసలైన సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తాయని ముఖ్యమంత్రి చంద్ర బాబు పేర్కొన్నారు. ప్రపంచంలో ఎంతోమంది బిలియనీర్లు, ట్రిలియనీర్లు ఉన్నారని… కానీ సంపాదించిన సంపదను సద్విని యోగం చేసుకునే అదృష్టం కొందరికే దక్కుతుంది… ఆ కోవలోనే నిలిచి తమ దాతృత్వాన్ని చాటుకున్న చెన్నైకు చెందిన వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. గురువారం తిరుమల శ్రీవారికి చెన్నైకు చెందిన జైన్ దంపతులు రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు, వజ్రాభరణాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా పాల్గొన్నారు.
టీటీడీ అర్చకులు, అధి కారులు ఈ ఆభరణాలను స్వీకరించారు. అనంతరం దాతలైన జైన్ దంపతులతో కలిసి సీఎం చంద్రబాబు తిరుమలలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. తిరుమల పవిత్ర క్షేత్రంలో ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైందని, ఇందులో తాను భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రతి రోజూ శ్రీవారికి 120 కిలోల బంగారు ఆభరణాలు అలంకరిస్తా రని, దేవుని ఆదేశంతోనే 121 కిలోల బంగారు, వజ్రాభరణాలను సమర్పించామని జైన్ దంపతులు చెప్పడం వారి భక్తికి నిదర్శన మన్నారు. పూర్వం పల్లవ, చోళ, చేర, పాండ్య రాజులతో పాటు మైసూర్, మరాఠా రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారికి రత్నకిరీటం, పీతాంబరం సహా ఎన్నో ఆభరణాలు సమర్పించారని గుర్తుచేశారు. ఆనాటి శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి నేటి జైన్ దంపతుల వరకు స్వామివారిపై భక్తి విశ్వాసాలు పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు.
మానవ సేవే… మాధవ సేవ
దేవునిపై భక్తి ఉన్న ప్రతిఒక్కరూ మానవ సేవే మాధవ సేవ అనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం పనిచేసే వారే దేవునికి అత్యంత సన్నిహితంగా ఉంటారన్నారు. జైన్ దంపతుల తరహాలోనే ఇతర సంపన్నులు కూడా ముందుకు వచ్చి పేదల సంక్షేమం, సమాజ సేవ, ఆధ్యాత్మి క కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించాలని కోరా రు. భక్తులు సమర్పించే ప్రతి రూపాయిని టీటీడీ వారి సౌకర్యాలు, సేవలకే ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్రంలో టీటీడీ సహకారంతో 5 వేల దేవాలయాల నిర్మాణం చేపట్టబోతున్నామని, దేశంలోని అన్ని రాజధానులతో పాటు విదేశాల్లో హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని వెల్లడించారు. ఆల యం ఉన్న ప్రతిచోటా అన్నప్రసాదం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ‘ప్రాణదానం’ ద్వారా వైద్యసేవలు, ‘విద్యాదానం’ కింద ప్రత్యేక నిధితో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామని తెలి పారు. ఎల్నినో వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ‘వృక్షో గోవిందం’ పేరుతో పచ్చదనం పెంపు కార్యక్ర మాలు చేపడతామన్నారు. భవిష్యత్తులో తిరుమలకు నీటి ఎద్దడి అనే మాటే లేకుండా హంద్రీ-నీవా ద్వారా కళ్యాణి డ్యాంకు, సోమశిల ద్వారా బాలాజీ రిజర్వాయర్ కు నీటిని తరలిస్తామని, అవసరమైతే తిరుమలకు రెండో పైపులైన్ కూడా వేస్తామని స్పష్టం చేశారు. టెక్నాలజీ, నాలెడ్జ్ తో పాటు భగవంతుని కృప ఉండటం వల్లే రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రం, దేశం మరింత అభివృద్ధి చెందడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
నమ్ముకున్న వారికి శ్రీవారి అండ…రక్షణ
పూర్వకాలంలో దేవాలయాల మీద చాలా దాడులు జరిగా యి… కానీ వెంకటేశ్వరస్వామి దేవాలయం విషయంలో ఎవ్వరూ ఆ సాహసానికి ఒడిగట్టలేదని తెలిపారు. కొలిచిన వారికి, నమ్మిన వారికి శ్రీవారు రక్షణగా నిలుస్తారు… అది తన విషయంలో నిరూపితమైంది. ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే నాపై అలిపిరిలో దాడి. జరిగింది… స్వామి కృప వల్లే ఆ దాడిలో ఎవ్వరూ చనిపోలేదని చెప్పారు. వెంకటేశ్వర స్వామే ప్రాణభిక్ష పెట్టారు… పునర్జన్మనిచ్చారంటూ భావోద్వేగంతో నాటి ఘటనను గుర్తుచేసుకున్నారు. ప్రపంచం మొత్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో విశ్వాసం పెంపొందించేలా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.
భక్తుల విరాళాలు, ఆదాయాన్ని వెల్లడించడం, భక్తులు ఇచ్చిన విరాళాలను వారి సౌకర్యాలు.. సేవలకే ఖర్చు పెడుతున్నారని తెలిపారు. తిరుమల కొండపై పచ్చదనం విరాజిల్లుతోందని… దేవుని పవిత్రత కాపాడే విషయంలో రాజీ పడవద్దని టీటీడీకి విజ్ఞప్తి చేశారు. గో-సంరక్షణ, వేద పరిరక్షణకు ప్రాధాన్యమి వ్వాలని… దీనికి టీటీడీ నాందీ పలకాలని సూచించారు. శ్రీవారి దేవాలయాన్ని ఆదర్శంగా… పవిత్రతకు మారుపేరుగా తీర్చిదిద్దా లని సూచించారు. శ్రీవారి సేవకులను మరింత ప్రొత్సహించాలని తెలిపారు. ఎక్కడికక్కడ శ్రీవారి దేవాలయాలు నిర్మించాలి… అక్కడ ప్రశాంత, పవిత్ర వాతావరణం ఉండేలా చూడాలని నిర్దేశించారు. దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీవారి దేవాలయాలను నిర్మిస్తామ ని… విదేశాల్లో కూడా హిందువులు ఎక్కువగా ఉన్న చోట వెంకటే శ్వర స్వామి దేవాలయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
బంగారు ఆభరణాల వివరాలు
వర్ధమాన్ జైన్ దంపతులు రూ.207.6 కోట్ల విలువైన 121 కిలో బంగారు ఆభరణాలను శ్రీవారికి సమర్పించారు. శ్రీవారి కోసం 46 రకాల వేర్వేరు బంగారు ఆభరణాలను తయారు చే యించి కానుకగా అందించారు. అందజేసిన వాటిలో శ్రీవారి ఆభరణాలుగా 106 కిలోల బంగారం, శ్రీ పద్మావతీ అమ్మవారికి 15 కిలోల బరువైన వస్త్రం ఉన్నాయి.
మొత్తం ఆభరణాలలో బంగారు పాద కవచములు-3, బంగారు అందెలు -3, బంగారు పాకడాలు, బంగారు తులసి పాత్ర హారం, బంగారు అష్టోత్తర కాసుల మాల, బంగారు చతుర్భుజ లక్ష్మీ హారం, బంగారు పులిగోరు, బంగారు అశ్వథ పాత్ర హారం, బంగారు సాదా వడ్డాణం, బంగారు గంటల మొలతాడు, బంగారు సూర్యకటారి, బంగారు కౌస్తుభం, బంగారు శ్రీవత్సం, బంగారు మోచేయి, బంగారు కటి హస్తం, బంగారు నాగాభరణ వడ్డాణం, బంగారు గోపు, బంగారు ఐదు పేటల కంఠీలు 5, బంగారు చంద్రవంకీ కంఠి, బంగారు వైకుంఠ హస్తం, బంగారు కటి హస్తం, బంగారు నాగాభరణ కడియాలు 4, బంగారు భుజ కీర్తులు 3, బంగారు సాలిగ్రామ హారములు-3, బంగారు కమలం తరహా సాలిగ్రామాలు 3, బంగారు మోపుగల యజ్ఞోప వీతం, బంగారు శంఖ కవచం, బంగారు చక్ర కవచం, బంగారు కిటీపు ముఖపట్టి, బంగారు కిరీటం, 2,427 కేరట్ల బరువున్న నీలాలు, పుష్యరాగం, కెంపులు, పచ్చలతో శ్రీవత్సం పతకం, 238.2 కేరట్ల బరువున్న వజ్రాలను పొదిగిన ఆభరణాలు ఉన్నాయి.



















