రాష్ట్రంలో రైతులను జగన్ నట్టేటా ముంచారని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సాగు తగ్గితే వ్యవసాయంలో వృద్ధి ఎలా పెరుగుతుందో జగన్ సమాధానం చెప్పాలన్నారు. ఏటా 12 లక్షల టన్నుల మేర ఆహార ధాన్యాల దిగుబడులు పెరిగాయని రైతు భరోసా విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడడం ప్రజల్ని మోసం చేయడమే అన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో సాగు దిగుబడి తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫుడ్ గ్రెయిన్స్ గురించి సీఎం మాట్లాడుతూ ఆహార ధాన్యాలు 4 సంవత్సరాల్లో సంవత్సరానికి 12 లక్షల టన్నులు అధికంగా ఉత్పత్తి అయిందని తప్పుడు ప్రకటన చేశారన్నారు. అగ్రికల్చర్ సెక్టారు ఈ నాలుగు సంవత్సరాల్లో ఇబ్బంది పడటమే కాకుండా కష్టాలు, నష్టాల్లో నడుస్తోందని, రైతుకి గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు.
రైతు వ్యవసాయం చేసుకునే పరిస్థితుల్లో లేకుండా చేశారని మండిపడ్డారు. ఖరీఫ్, రబీ క్రాప్ హాలిడేస్ కూడా ఇచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి రైతుల మెప్పు పొందాలనే ఆలోచనతో 4 సంవత్సరాల్లో సంవత్సరానికి 12 లక్షల టన్నులు అధికంగా ఉత్పత్తి అయిందని తప్పుడు ప్రకటన చేశారని దుయ్యబట్టారు. 2017-18లో ఉత్పత్తి 167 లక్షల టన్నులు ఉంది. 2019-20లో 185 లక్షల టన్నులు ఉంది. 2022-23 సంవత్సరంలో 169 లక్షల టన్నులు ఉందన్నారు. 2019-20లో 175 లక్షల టన్నులు ఉంది. 175 లక్షల టన్నుల నుంచి 169 లక్షల టన్నులకు పడిపోతే సీఎం పెరిగిందని చెప్పడంలో ఎంత యదార్థముందో మనకు అర్థమవుతోందన్నారు. వ్యవసాయ రంగ విషయంలో జగన్మోహన్ రెడ్డి నిజాలు మాట్లాడటంలేదని స్పష్టమవుతోందన్నారు.
గ్రోత్ రేటు 2017-18లో 14.98 శాతం ఉంది. 2019-20లో 8.51 శాతం ఉంది. 2022-23లో 4.54 శాతం ఉంది. అగ్రికల్చర్ అలాయిడ్ గ్రోత్ 2018-19లో 14.98 శాతం ఉంటే ఉంటే 2022-23 సంవత్సరం వచ్చే నాటికి 4.54కు పడిపోయిందన్నారు. కాస్ట్ అండ్ ప్రైజెస్ లో ఇంత దారుణగా అగ్రికల్చర్ అలాయిడ్ గ్రోత్ పడిపోతే అగ్రికల్చర్ సెక్టార్ ఏ విధంగా పెరిగినట్లో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఏ పంటకు మద్దతు ధర దక్కడంలేదు. పంట నష్టపోతే ఇన్ పుట్ సబ్సిడీ సరిగా ఇవ్వడంలేదు. వర్షాలు బాగా పడ్డాయిగానీ ప్రొడక్షన్ మాత్రం దెబ్బతింది. ప్రొడక్టివిటీ లేదు. పండిన ధాన్యానికి సరైన ధర లేదు. రైతులు పండిరచిన పంటను మిల్లర్సు, అధికారుల కలిసి దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మిల్లర్లు, అధికారులు రైతులతో ఇష్టమొచ్చినట్లు ఆడుకుంటున్నారు. రైతు పూర్తిగా కష్టాల్లో మునిగిపోయాడు. ఈ విషయం గ్రామీణ ప్రాంతాల్లో స్ఫష్టంగా తెలుస్తోంది. కొత్త కొత్త సిస్టమ్స్ పెట్టి రైతుల్ని నలిపేస్తున్నారు. ఇవి నేను చెప్పిన లెక్కలు కావు. సోషియో ఎకానమిక్ సర్వే లెక్కలు. ఆగ్రో ఎకానమి దెబ్బతినడంవల్ల దాదాపు 73 శాతం పాపులేషన్ లో ఆదాయాలు లేవు. రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. జగన్ చెప్పేవన్నీ సత్యదూరమైనవని తేటతెల్లమవుతోందని’’ ఆయన తెలిపారు.