- వ్యత్యాసాన్ని బేరీజు వేసుకుంటున్న జనం
- బాధ్యతలు చేపట్టకముందే విద్యాశాఖ ప్రక్షాళనకు లోకేష్ రూట్‌మ్యాప్
అమరావతి(చైతన్యరథం): అనునిత్యం ప్రజల కోసం పరితపించే నాయకుడు ఒకవైపు… కూల్చివేతలు, విధ్వంసంతో పాలన ప్రారంభించిన నేత మరో వైపు… యువనేత లోకేష్, మాజీ సీఎం జగన్ నడుమ స్పష్టమైన వ్యత్యాసాన్ని రాష్ట్రప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించాక ప్రజావేదిక కూల్చివేతతో కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారు నాటి ముఖ్యమంత్రి జగన్. ప్రజలకు సేవ చేయాలంటే కేవలం అధికారం మాత్రమే సరిపోదు…మంచి చేయాలన్న మనసు కూడా ఉండాలి. సచివాలయంలో బాధ్యతలు చేపట్టకముందే పేద విద్యార్థుల కష్టాల గురించి ఆలోచించారు యువనేత నారా లోకేష్. ఈనెల 15వతేదీన తన నివాసంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన తొలి సమీక్షలో ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వడం లేదని తెలుసుకున్న మంత్రి లోకేష్… పుస్తకాల్లేకుండా విద్యార్థులు ఎలా చదువు కొనసాగిస్తారని ప్రశ్నిస్తూ తక్షణమే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పాటు బ్యాగులు కూడా అందించాలని ఆదేశించారు.
ఇందుకోసం రూ.33కోట్లు ఖర్చవుతుందని అధికారులు తెలుపగా, ఎంత ఖర్చయినా పర్వాలేదు, విద్యార్థులకు తక్షణమే పుస్తకాలు, కిట్స్ అందించాలని అన్నారు. ఈ మేరకు 3రోజుల్లోనే జిఓ నెం.28ని విడుదల చేసి, త్వరలో పుస్తకాల పంపిణీకి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ కారణంగా యువత జీవితాలు నాశనమవుతున్న విషయాన్ని యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రత్యక్షంగా చూసిన లోకేష్…పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో గంజాయి, డ్రగ్స్ వాడకంపై ఉక్కుపాదం మోపేలా విద్యా, పోలీసు శాఖల ఉన్నతాధికారులతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సర్కారీ స్కూళ్లలో మౌలిక సదుపాయాలకు గత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నిలిపివేయగా, ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని లోకేష్ ఆదేశించారు. ఉపాధ్యాయులకు అనవసరమైన పనిభారాన్ని తగ్గించి కేవలం బోధనపై మాత్రమే దృష్టిసారించి విలువలతో కూడిన విద్య అందించేలా చర్యలు చేపడుతున్నారు.
గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా తయారైన మధ్యాహ్న భోజన పథకాన్ని సమూల ప్రక్షాళన చేసి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పోషకాహారాన్ని అందించాలని నిర్ణయించారు. సరస్వతీ నిలయాలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలను జగన్ పాలనలో నీచరాజకీయాలకు నిలయంగా మార్చారు. ఐదేళ్లలో భ్రష్టుపట్టిన యూనివర్సిటీలను సమూలంగా ప్రక్షాళన చేసి, జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లో పైకి తీసుకువెళ్లడానికి మంత్రి లోకేష్ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్‌కి సంబంధించి ఏళ్ల తరబడి పెండిరగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకొని సాధ్యమైనంత త్వరగా ఖాళీలను భర్తీచేయడానికి కసరత్తు చేస్తున్నారు.
గతప్రభుత్వ హయాంలో మూసేసిన స్కూళ్లను తెరిపించి పేద విద్యార్థులకు విద్యను దగ్గర చేయాలని సంకల్పించారు. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను వన్ టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా పరిష్కరించి కాలేజీల్లో నిలచిపోయిన సర్టిఫికెట్లను విద్యార్థులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మనసుంటే మార్గం లేకపోదన్న నానుడిని నిజం చేస్తూ బాధ్యతలు స్వీకరించకముందే విద్యాశాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. అనుకున్న పని పూర్తయ్యేవరకు వెంటపడటం లోకేష్ నైజం. ఈ విషయాన్ని పసిగట్టిన అధికారులు ఆయన ఆలోచనలకు తగ్గట్లుగా సకాలంలో పనులు పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.