- అభివృద్ధి, సంక్షేమం జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత క్యాడర్‌దే
- పనిచేయని వారి పదవులు ఊడతాయని అధినేత హెచ్చరించారు
- ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం
- టీడీపీ క్లస్టర్, యూనిట్ ఇన్‌ఛార్జిలతో నారా లోకేష్
- కాఫీ కబుర్లు సమావేశంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): మనం చేసిన అభివృద్ధి- సంక్షేమం ప్రజలకు వివరించండి. అహంకారం వీడి సత్ప్రవర్తన, మంచి మాటలతో ప్రజల మనస్సులు గెలవండి. ప్రజలే మనల్ని మళ్లీ మళ్లీ గెలిపిస్తారని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లి నివాసంలో టిడిపి క్లస్టర్, యూనిట్ ఇన్‌ఛార్జిలతో నిర్వహించిన కాఫీ కబుర్లు కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… “తెలుగుదేశం పార్టీ లీడర్లు, క్యాడర్ సమన్వయం చేసుకుంటూ అనునిత్యం ప్రజలతో మమేకం కావడం ముఖ్యం. గత ఎన్నికల్లో గొడ్డలి పార్టీ 151నుంచి 11 సీట్లకు దిగజారడానికి వారి అహంకారమే కారణం. ఎట్టి పరిస్థితుల్లో అహంకారం, దర్పం ప్రదర్శించకుండా ప్రజలతో గౌరవప్రదమైన భాషలో మాట్లాడి వారి మనసులు గెలవండి” అని సూచించారు.
అభివృద్ధి, సంక్షేమంలో మనమే ఫస్ట్
“ప్రస్తుతం దేశంలో రూ.4వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. తల్లికి వందనం పథకం కింద చదువుకునే పిల్లలందరికీ రూ.15వేల చొప్పున ఇస్తున్న రాష్ట్రం కూడా మనదే. ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను అమలు చేస్తున్నాం. ఆటోడ్రైవర్ల సేవలో, మత్స్యకార భరోసావంటి పథకాలను ఇస్తున్నాం. పోలవరం పూర్తి కావస్తోంది. అభివృద్ధి జోరుగా సాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం” అని లోకేష్ పేర్కొన్నారు.
సానుకూల దృక్పథమే గెలుపు సూత్రం
“నెగిటివ్ ఆలోచనలు వద్దు. సానుకూల దృక్పథంతో పనిచేయడంలో అధినేత చంద్రబాబును ప్రతి ఒక్క కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. తాజాగా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచిన ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని క్యాడర్ పనిచేయాలి. పార్టీలో శిక్షణాతరగతులు నిరంతరం కొనసాగుతాయి. ఏడాదిలో 300రోజులపాటు మండల, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జిలకు తరగతులు నిర్వహిస్తాం. తెలుగుదేశం పార్టీ ఆరు శాసనాల్లో `కార్యకర్తే అధినేత ఒకటి. చంద్రబాబు వద్ద ఇప్పుడు కోటరీలు లేవు. సామాన్య కార్యకర్త సైతం నేరుగా ఆయనను కలసి సమస్యలు చెప్పుకునే అవకాశముంది. ప్రతివారం అధినేత చంద్రబాబు, నేను కేంద్ర కార్యాలయంలో క్యాడర్‌కు అందుబాటులో ఉంటాం. మై టీడీపీ యాప్‌లో టాప్-10 క్యాడర్‌తో ప్రతి మూడు నెలలకోసారి కలుస్తా. రాజకీయ పార్టీల చరిత్రలో ఇదివరకెన్నడూ లేనివిధంగా మండల పార్టీ అధ్యక్షురాలు, క్లస్టర్ ఇన్‌చార్జిలకు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించాం. ప్రతి నాయకుడి పనితీరును అధినేత చంద్రబాబు ప్రతి మూడునెలలకోసారి సమీక్షిస్తారు. పనిచేయకపోతే పదవులు పోతాయని నిర్మొహమాటంగా మాతో చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ పనిచేయాలి” అది లోకేష్ దిశానిర్దేశం చేశారు.
టీడీపీలో వ్యక్తులు కాదు… పార్టీ శాశ్వతం
“తెలుగుదేశంలో వ్యక్తులు శాశ్వతం కాదు. పార్టీ శాశ్వతం. పార్టీలో ఈరోజు నాకు ఎవరితో విభేదాలు లేవు. సమస్య ఉన్నవారిని పిలిచి వ్యక్తిగతంగా మాట్లాడి పరిష్కరిస్తున్నా. ఏవైనా సమస్యలుంటే అంతర్గత వేదికలపై మాట్లాడి పరిష్కరించుకోవాలి. ప్రజల్లో పార్టీ ఇమేజ్ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు సుమారు 50 నియోజకవర్గాల్లో పర్యటించి, కార్యకర్తలను కలుసుకున్నా. 2027లోగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తా. పార్టీ కేడర్‌పై పెట్టిన 80శాతం అక్రమ కేసులు ఇప్పటికే తొలగించాం. మిగిలినవి కూడా తీసేస్తాం. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తాం. వివిధ కారణాలతో నాయకత్వంపై అలిగి ఇంట్లో పడుకోవడంవల్ల అంతిమంగా పార్టీ నష్టపోతుంది” అని స్పష్టం చేశారు.
పనిచేసేవారికి సముచిత స్థానం
“పార్టీ అధినేత చంద్రబాబు, నేను పర్యటనలకు మా సొంత వాహనాలు వినియోగిస్తున్నాం. వ్యక్తిగత విదేశీ పర్యటనలు మా సొమ్ముతోనే వెళ్తున్నాం. మేం జవాబుదారీగా ఉంటున్నాం. కానీ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారి ఫేక్ ప్రచారాన్ని మనం వాస్తవ సమాచారంతో వెంటనే తిప్పికొట్టాలి. సోషల్ మీడియాలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియనంతగా ఫేక్ ప్రచారం జరుగుతున్న సమయంలో ప్రతి కార్యకర్త అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు వివిధ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినపుడు గౌరవంగా వ్యవహరించాలని ఆదేశాలిస్తాం. దీర్ఘకాలంగా అధికారంలో కొనసాగేందుకు బిజెపి అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేస్తున్నాం. మన పార్టీలో మై టీడీపీ యాప్ మాదిరిగానే బిజెపిలో సరళ్ యాప్ ఉంది. కేంద్రమంత్రి నుంచి సామాన్య కార్యకర్త వరకూ వారు చేసే రోజువారీ పనిని అందులో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పనిచేసే ప్రతీ ఒక్కరినీ గుర్తించి సముచిత స్థానం కల్పిస్తాం” అని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్ భరోసా ఇచ్చారు.
















