టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ కార్యక్రమాలను మరింత ఉధృతంగా, పారదర్శకంగా అమలుచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారని వలంటీర్ల ద్వారా జగన్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన చరిత్ర టిడిపిది అయితే, వాటిని రద్దు చేసిన చరిత్ర వైసీపీది అని లోకేష్ పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం అనంతపురం లో జరిగిన భారీ బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించారు. అనంతపురం విద్యావంతులకు పుట్టినిల్లు.
రాజకీయ చైతన్యానికి మారుపేరు అనంతపురం.
ఎస్కే యూనివర్సిటీ, సత్యసాయి యూనివర్సిటీ లను పోరాడి సాధించుకున్న చరిత్ర అనంతపురం ప్రజలది. ఎస్కే యూనివర్సిటీలో చదువుకున్న దళిత నేత దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఎదిగారు.
ఎస్కే యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పనిచేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ రాష్ట్రపతిగా ఎదిగారు. ఎస్కే యూనివర్సిటీ లో చదువుకున్న నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఎదిగారు. అంతటి ఘన చరిత్ర ఉన్న అనంతపురంలో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం అని లోకేష్ చెప్పారు. ఈ రోజు రాష్ట్ర ప్రజలను నేను కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నా.
జనం జగన్ కి 151 సీట్లు ఇచ్చింది ఎందుకు? నా తల్లి భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించడం కోసమా?
జనం జగన్ కి 151 సీట్లు ఇచ్చింది ఎందుకు? లోకేష్ పై ఎస్సి, ఎస్టీ, హత్యాయత్నం కేసులు పెట్టమనా?
జనం జగన్ కి 151 సీట్లు ఇచ్చింది ఎందుకు? టిడిపి నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపమనా?
రాష్ట్ర ప్రజలంతా ఒక్క సారి ఆలోచించండి మీరు ఓటు వేసింది ఎందుకు? జగన్ చేసింది ఏంటి? అని ప్రశ్నించారు.
నేను యువగళం పాదయాత్ర ప్రారంభించక ముందు జగన్ పొగరు పీక్స్ లో ఉంది. పోటుగాడిలా పాదయాత్ర ని అడ్డుకోవడానికి వచ్చాడు. నేను అప్పుడే చెప్పా సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర అని. అయినా వినలేదు. యూత్ కొట్టిన దెబ్బకి జగన్ అహంకారం తగ్గింది. చిన్న ఉదాహరణ చెబుతా మొన్నటి వరకూ సింహం సింగిల్ గా వస్తుంది. నా వెంట్రుక కూడా పీకలేరు అన్నాడు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసాడు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధించాడు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. సింగిల్ గా రండి అని అడుక్కుంటున్నాడు. అయ్యా మీ సీట్లు మీకే నన్ను ఒంటరిని చేసి పోకండి అని బ్రతిమాలుకుంటున్నాడు అని ఎద్దేవ చేశారు. నువ్వు రాజారెడ్డి రాజ్యాంగం పవర్ ఏంటో చూపించావ్. నేను అంబేద్కర్ గారి రాజ్యాంగం దమ్మెంటో చూపిస్తా. ఇది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా రాబోయే రోజుల్లో చూపిస్తాం అని హెచ్చరించారు.
ఎన్నికల ముందు జగన్ వేరు ఎన్నికల తరువాత జగన్ వేరు. ఎన్నికల ముందు నేల జగన్. ఎన్నికల తరువాత గాలి జగన్. నేల జగన్ పాదయాత్ర చేసి ముద్దులు పెట్టాడు. గాలి జగన్ స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతూ ప్రజల్ని హింస పెడుతున్నాడు అని లోకేష్ విమర్శించారు. గాలి జగన్ గారికి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు అని హెచ్చరించారు. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్.
100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం గా జగన్ ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించొచ్చు అని చెప్పారు. టెన్త్ ఫైయిల్ గాలి జగన్ అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యాడు కానీ మూడు రంగాల్లో ఆయన దేశంలోనే నంబర్1 అవి ఏంటో తెలుసా? అప్పులు, గంజాయి, పెట్రోల్,డీజిల్ ధరలు. 12 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అడుక్కునే పొజిషన్ కి తెచ్చాడు. గంజాయి ఎక్స్ పోర్ట్ లో గాలి జగన్ నంబర్ 1. ఆఖరికి తిరుమల లో కూడా గంజాయి అమ్మేస్తున్నాడు గాలి జగన్. ఏకంగా గురజాల లో గంజాయి పండిస్తున్నారు వైసిపి నాయకులు. జగన్ పాలనలో రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. జగన్ గిట్టుబాటు ధర ఇస్తున్న ఏకైక పంట గంజాయి అని ఆరోపించారు. ఇక పెట్రోల్, డీజిల్ ధరల్లో గాలి జగన్ దేశంలోనే నంబర్1. పక్క రాష్ట్రం కర్ణాటక కంటే ఏపీలో పెట్రోల్, డీజిల్ ధర 12 రూపాయలు ఎక్కువ అని వివరించారు.
ప్రతి ఏటా జాబ్ నోటిఫికేషన్
గాలి జగన్ యువత ఆశలను గాల్లో కలిపేసాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. ఖైదీలకు 2 వేల రూపాయల మెస్ ఛార్జీలు ఇస్తుంటే, విద్యార్థులకు మాత్రం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు అని లోకేష్ వెల్లడించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చారు. గాలి జగన్ మహిళల జీవితాలను తాకట్టు పెడుతున్నాడు.
మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25వేల కోట్లు అప్పు తెచ్చాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు అని వివరించారు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని వెల్లడించారు. గాలి జగన్ రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసాడు.
జగన్ పరిపాలన లో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. అవి ఏంటో తెలుసా గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు. మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు అని హెచ్చరించారు.
ఉద్యోగులను మోసం చేశారు
గాలి జగన్ ఉద్యోగస్తులను కూడా దెబ్బేసాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు అని లోకేష్ విమర్శించారు. బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు గాలి జగన్. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం అని వెల్లడించారు.
రంజాన్ శుభాకాంక్షలు
మైనార్టీ సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీలను వైసిపి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు.
జగన్ రెడ్డి సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు. పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది.
కర్నూలులో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లికి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది అని ఆరోపించారు. టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీతో పొత్తు ఉన్నా మైనార్టీలపై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు అని చెప్పారు.
రాయలసీమకు ద్రోహం
గాలి జగన్ రాయలసీమ బిడ్డ అంటాడు కానీ ఆయన రాయలసీమ కు పట్టిన క్యాన్సర్ గడ్డ. అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ రైతులకు టిడిపి హయాంలో ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసాడు జగన్ రెడ్డి. ఎస్సి,ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ, మిగిలిన వారికి 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం.
హంద్రీనీవా, గాలేరు నగరి ఇలా టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. జగన్ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు. రిలయన్స్, అమరరాజా, జాకీ వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు అని ఆరోపించారు.
అవినీతి ‘ అనంతం ‘
ఇప్పటి వరకూ తిరిగిన నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే కి ఒక పేరు మాత్రమే పెట్టాను. కానీ ఇక్కడ ప్రజల కోరిక మేరకు మూడు పేర్లు పెట్టక తప్పడం లేదు. మీ ఎమ్మెల్యే గారి పేరు అనంత వెంకటరామిరెడ్డి. ఆయన అవినీతి అనంతం. ఆయన్ని ఇక్కడ ముద్దుగా చేతగాని ఎమ్మెల్యే, కమిషన్ ఎమ్మెల్యే, 9 నంబర్స్ ఎమ్మెల్యే అంటారట అని లోకేష్ విమర్శించారు. ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేదు కాబట్టి చేతగాని ఎమ్మెల్యే, ప్రతి దాంట్లో కమిషన్ తీసుకుంటాడు కాబట్టి కమిషన్ ఎమ్మెల్యే, ఇక ఎవరు వెళ్లి సహాయం చెయ్యమని అడిగినా తన ఫోన్లో 9 నంబర్లు కొట్టి ఫోన్ మాట్లాడినట్టు నటిస్తాడు అంట అందుకే 9 నంబర్స్ ఎమ్మెల్యే.
అనంతపురం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని గాలి జగన్ హామీ ఇచ్చారు. అయితే నాలుగేళ్లు గడిచిన దాని ఊసే ఎత్తడం లేదు. ఎమ్మెల్యే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సాధిస్తామని చెప్పారు. కానీ ఉన్న డ్రైనేజీలో మురుగు కూడా తీయడం చేతకావడం లేదు. అందుకే ఆయన్ను చేతకాని ఎమ్మెల్యే అంటారు అని వివరించారు. మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచి రెగ్యులైజేషన్ చేస్తామని గతంలో గాలి హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రెగులరైజేషన్ మాట దేవుడెరుగు. ఉన్న జీతాలను కూడా కట్ చేశాడు. రిస్క్ అలవిన్సులు, హెల్త్ అలవెన్సులు ఆపేసాడు. పిఎఫ్ డబ్బులు చెల్లించడం లేదు. ఆఖరికి రోడ్లు ఊడ్చడానికి చీపుర్లు కూడా ఇవ్వడం లేదు. పారిశుద్ధ కార్మికులు సొంత డబ్బులు పెట్టి చీపుర్లు, సేఫ్టీ పరికరాలు కొనాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంగల్ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్ వరకు అర్బన్ లింక్ రోడ్డును టిడిపి హయాంలోనే మంజూరు చేయించాం. అప్పట్లో కేంద్రమంత్రి గడ్కరీకి ఒప్పించి రోడ్డు శాంక్షన్ చేయించాం.
అర్బన్ లింక్ రోడ్డు నిర్మాణాన్ని స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తన జేబు నింపుకోవడం కోసం ఉపయోగించుకున్నారు. రోడ్డు కాంట్రాక్టర్ నుంచి 10 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నారు. దీంతోపాటు రోడ్డు విస్తరణలో తమకు అనుకూలంగా ఉండే వారి ఇళ్లు, షాపులు పోకుండా రోడ్డును అష్టవంకరలు తిప్పారు. సప్తగిరి సర్కిల్ వద్ద రోడ్డును పరిశీలిస్తే ఒకే దగ్గర నాలుగైదు వంకరలు తిరిగింది. ఇదంతా తమ అనుచరులు తమ నాయకుల ఆస్తులు పోకుండా ఉండడం కోసం ఎమ్మెల్యే చేసిన అరాచకం. ఇదే కాకుండా రోడ్డు విస్తరణలో షాపులు ఇల్లు పోకుండా ఉండడం కోసం యజమానుల నుంచి కోట్లల్లో వసూలు చేశారు. ఈయన అరాచకాలపై ఓ రిటైర్డ్ ఏఎస్పి సీఎం జగన్ కు లేఖ కూడా రాసారు అని వివరించారు.
గతేడాది అనంతపురం నగరాన్ని వరదలు ముంచెత్తాయి. రెండు వేల ఇల్లు నీట మునిగాయి. దీనికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? నగరం మధ్యలో వెళ్లే వాగులు వంకల్ని వైకాపా నాయకులు కబ్జా చేసి ఇళ్లు కట్టేశారు. 40 అడుగులు ఉండాల్సిన నడిమి వంక 10 అడుగులకు కుదించుకుపోయింది. దీనివల్ల వరదలు వంకను రెండు వైపులా ఉన్న కాలనీలను ముంచెత్తింది.
భవిష్యత్తులో ఇలాంటి వరదలు వస్తాయని ముందే ఊహించి టిడిపి హయాంలో నడిమి వంకకు రెండువైపులా రక్షణ గోడ నిర్మాణాన్ని చేపట్టాం. సగం పనులు పూర్తయ్యాయి. అప్పట్లో రక్షణ గోడ పూర్తి కాకుండా ఈ వైకాపా నాయకులు అడ్డుపడ్డారు. ఇప్పుడు తీరా వరదలు వచ్చి ఊరంతా మునిగిపోయిన తర్వాత ఇప్పుడు రక్షణ కూడా నిర్మిస్తామని కబుర్లు చెబుతున్నారు. రక్షణ గోడ నిర్మాణానికి 45 కోట్లు కేటాయిస్తామని గాలి జగన్ చెప్పి ఆరు నెలలు పూర్తయినా ఇప్పటివరకు పనులు మొదలు పెట్టలేదు అని చెప్పారు. అనంతపురం నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తానని 10 ఏళ్ల క్రితం ఈ వెంకట్రామిరెడ్డి హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. రింగ్ రోడ్డు ఎక్కడ కట్టాడో కనిపించడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో లేబర్ కాంట్రాక్టర్ నుండి ప్రతి నెలా ఐదు లక్షల ముడుపులు తీసుకుంటున్నాడు కమిషన్ ఎమ్మెల్యే. టిడిపి హయాంలో 6 వేల టిడ్కొ ఇళ్ళు నిర్మాణం చేపట్టాం. వాటిని పూర్తి చేసి లబ్దిదారులకు ఇవ్వకుండా వేధిస్తున్నారు మీ కమిషన్ ఎమ్మెల్యే అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
టిడిపి హయాంలోనే అభివృద్ధి
అనంతపురం టిడిపి హయాంలో మాత్రమే అభివృద్ధి చెందింది. 91 కోట్లతో పైపులైను, 11 రిజర్వాయర్లు నిర్మాణం చేసి మరో 20 ఏళ్ళు అనంతపురం నగరానికి నీటి సమస్య లేకుండా చేసాం.
సంజీవరెడ్డి స్టేడియం ని అభివృద్ధి చేసాం.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేసింది టిడిపి.
నగరంలో పేదలకు ఇళ్ళు కట్టింది, రోడ్లు వేసింది, మొక్కలు నాటింది కూడా టిడిపి హయాంలోనే అని లోకేష్ వివరించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసి సిటీ ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తాం.
టిడిపి అధికారంలోకి రాగానే 12 వేల టిడ్కొ ఇళ్ళు పంపిణి చేస్తాం.
కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం.
గుత్తి రోడ్ లోని డంపింగ్ యార్డ్ ను మరో ప్రాంతానికి తరలిస్తాం.
నగరంలో రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు.