- ఓబుళాపురం మైనింగ్ కేసులో తుది తీర్పు
- ఐదుగురిని దోషులుగా ప్రకటించిన నాంపల్లి సీబీఐ కోర్టు
- నలుగురికి ఏడేళ్లు, అప్పటి గనులశాఖ డైరెక్టర్ రాజగోపాల్‌కు అదనంగా మరో నాలుగేళ్లు జైలు శిక్ష
- ఓఎంసీకి రూ.2లక్షల జరిమానా
హైదరాబాద్: ఓబుళాపురం గనుల్లో ఇనుప ఖనిజాన్ని అడ్డగోలుగా దోచుకున్న వ్యవహారంలో గాలి జనార్ధన్ రెడ్డి పాపం పండిరది. ఆయనను దోషిగా ఖరారు చేస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు మంగళవారం తుది తీర్పు చెప్పింది. గాలి జనార్ధన్ రెడ్డికి ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించారు. 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్, ఓబుళాపురం మైనింగ్ కంపెనీని దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి సహా నలుగురికి ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అలాగే, దోషులకు రూ.10వేలు చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకు రూ.2 లక్షలు జరిమానా విధించింది. ఈ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి ఉపశమనం లభించింది. ఆమెతో పాటు అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంను సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. జైలుశిక్ష పడిన గాలి జనార్ధన్‌రెడ్డి సహా నలుగురినీ చంచల్‌గూడ జైలుకి తరలించారు.
రాజగోపాల్‌కు అదనంగా మరో నాలుగేళ్లు
ఈ కేసులో వీడీ రాజగోపాల్‌కు అదనంగా మరో నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌గా ఉన్నందున అవినీతి నిరోధక చట్టం కింద ఆయనకు అదనపు శిక్షను ఖరారు చేసింది. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడినందున మొత్తంగా 11 ఏళ్ల పాటు అతడికి జైలు శిక్ష పడిరది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో అనంతపురం జిల్లా పరిధి కర్ణాటక సరిహద్దులోని డీ హీరేహాల్ మండలంలోని ఓబుళాపురంలో ఉక్కు గనులను గాలి జనార్థన్ రెడ్డి కంపెనీగా తెర ముందుకు వచ్చిన ఓఎంసీకి కేటాయించారు. నాడు తనకు కేటాయించిన పరిధిని అతిక్రమించిన గాలి.. పరిసర ప్రాంతాలను యథేచ్ఛగా తవ్వేశారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. కర్ణాటక, అనంతపురం సరిహద్దుల్లో ఐరన్ ఓర్‌ను ఇష్టం వచ్చినట్లుగా తవ్వేసి ఎగుమతి చేసుకున్నారు. రాష్ట్ర సరిహద్దులు కూడా చెరిపేశారు. అందులో భాగంగా గుట్టల్లో ఉన్న ఓ ఆలయాన్ని కూడా గాలి అనుచరులు ధ్వంసం చేశారన్న ఆరోపణలూ వచ్చాయి. అప్పట్లో ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. ఈ దశలోనే హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించారు. ఆ తర్వాత ఓఎంసీ అక్రమాలపై రోశయ్య హయాంలో కేసు నమోదు కాగా గనుల కేటాయింపులను రద్దు చేశారు. 2009లో సీబీఐ ఈ కుంభకోణంపై దర్యాప్తు ప్రారంభించింది. అప్పటి సీబీఐ జేడీ లక్ష్మినారాయణ.. గాలి జనార్ధన్ రెడ్డిని బళ్లారి నుంచి అరెస్టు చేసి తీసుకు వచ్చారు.
నాటి నుంచి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ 2011లో తొలి చార్జీషీట్‌ను నాంపల్లి సీబీఐ కోర్టులో దాఖలు చేసింది. ఈ క్రమంలో గాలితో పాటు శ్రీలక్ష్మి, వీడీ రాజగోపాల్ తదితరులు అరెస్టు కాగా.. ఆ తర్వాత చాలా కాలానికి వారు బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు 219 మంది సాక్షులను విచారించింది. 3,400 డాక్యుమెంట్లను పరిశీలించింది. అంతిమంగా మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసు నుంచి గనుల దోపిడీ జరిగిన సమయంలో మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి బయటపడ్డారు. ఆమెను నిర్దోషిగా కోర్టు స్పష్టం చేసింది. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందం కూడా నిర్దోషిగా బయట పడ్డారు. మరో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని గతంలోనే హైకోర్టు డిశ్చార్జ్ చేసింది. తుది తీర్పు సందర్భంగా గాలి జనార్ధన్ రెడ్డి తనకు చాలా కంపెనీలు ఉన్నాయని తనపై ఆధారపడి వేల మంది ఉన్నారని తన శిక్ష రద్దు చేయాలని జడ్జిని వేడుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. కాగా ఈ కేసులో బెయిల్ కోసం జడ్దిలకు లంచాలు ఇచ్చి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కేసులు ఇంకా గాలి జనార్ధన్ రెడ్డిపై పెండిరగ్ లో ఉన్నాయి