గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక మంచి సంప్రదాయానికి నాంది పలికారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు సమిష్టిగా సమావేశమై రానున్న ఎన్నికలలో 17 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలలో విజయం సాధిస్తామని ప్రతిన బూనారు. అన్ని స్థానాలలో విజయపతాక ఎగురవేసి పార్టీ అధినేత చంద్రబాబు కు కానుకగా ఇస్తామని వారు వెల్లడించారు. జిల్లాలోని సీనియర్ నాయకులందరూ ఓకే చోట సమావేశం అయి పార్టీ గెలుపు పై ధీమా వ్యక్తం చేయటం, పార్టీ శ్రేణుల్లో మనోస్థైర్యం పెంపొందించేందుకు దోహదపడింది. ఇటీవలే పార్టీలో చేరిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ దిశగా చొరవ చూపటం పట్ల టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
పార్టీ లో చేరినక్షణం నుంచి కన్నా ఏ విధమైన అరమరికలు లేకుండా పార్టీలో అందరితో కలుపుకు పోయే రీతిలో వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా గుంటూరు జిల్లాలో కన్నా, రాయపాటి వర్గాలు దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్ధులు గా వున్నారు. ఒకే పార్టీలో వున్నప్పటికీ వారిరువురు మధ్య అంతగా సఖ్యత లేకపోవటం బహిరంగ రహస్యమే. రాష్ట్ర విభజన అనంతరం రాయపాటి టిడిపి లో చేరిపోయారు. కన్నా కాంగ్రెస్ లోనే కొనసాగి అనంతరం బిజేపి లో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు మాత్రమే రాష్ట్ర భవిష్యత్ కాపాడగలరు అనే ఉద్దేశంతో టిడిపి లో చేరారు.
రాష్ట్రంలోనే సీనియర్ నాయకులలో ఒకరైనప్పటికి టిడిపిలో ఒక సాధారణ కార్యకర్తగా, నిబద్ధత గల నాయకునిగా కన్నా వ్యవహరిస్తుండటం విశేషం. అంతేగాక ఇప్పటి వరకు వున్న రాజకీయ విభేదాలను పక్కన బెట్టి రాయపాటికి సైతం స్నేహ హస్తం అందించారు. తన ఇంటిలో జరిగిన నియోజకవర్గ టిడిపి ఇంచార్జీలు, జిల్లాకు చెందిన రాష్ట్ర నాయకులు, సన్నిహిత మిత్రులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి కన్నా స్వయంగా రాయపాటిని ఆహ్వానించారు. ఆరోగ్యం సహకరించ నందున తాను హాజరు కాలేక పోతున్నాను అని రాయపాటి సాంబశివరావు కన్నా కు ఫోన్ లో తెలిపారు. అయితే ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కన్నా ఇంటికి వెళ్లారు. రాయపాటికి కన్నా ఆత్మీయ స్వాగతం పలికారు. కొన్ని దశాబ్దాల తర్వాత వారిరువురి కలయిక పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
టిడిపి లో సీనియర్ నాయకులు సైతం ఏమాత్రం భేషజాలకు పోకుండా కన్నా పిలుపుకు స్పందించి ఆయన ఇంటికి సమావేశానికి వెళ్ళటం మంచి పరిణామంగా భావించవచ్చు. అంతమంది సీనియర్ నాయకులు ఓకే చోట సమావేశమై ఏవిధమైన అరమరికలు లేకుండా పార్టీ విజయం గురించి చర్చించుకోవడం, ఆ దిశగా కన్నా లక్ష్మీనారాయణ చొరవ తీసుకోవటం రానున్న ఎన్నికలకు పార్టీ ఏ స్థాయిలో సమాయత్తం అవుతుందనే విషయమై క్షేత్ర స్థాయికి బలమైన సంకేతం పంపినట్టయింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపుతున్న యువగళం పాదయాత్ర కు ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నదని సమావేశంలో నాయకులందరూ చర్చించారు.
ఒకవైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్ లు పార్టీ కోసం అహరహం శ్రమిస్తున్నారని, వారికి అందరూ బాసటగా నిలవాలని సమావేశంలో నిర్ణయించారు. కన్నాతో పాటు పార్టీలో చేరిన సీనియర్ నాయకులు తాళ్ళ వెంకటేష్ యాదవ్, అడపా నాగేంద్రం వంటి వారు సైతం, ఒక సాధారణ కార్యకర్తల తరహాలోనే టిడిపి నాయకులతో మమేకం అయ్యారు. టిడిపి నాయకులతో పాటు తనకు సన్నిహితులైన నగర ప్రముఖులను సైతం తన ఇంట జరిగిన ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించారు. మొత్తం మీద కన్నా ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశం టిడిపి శ్రేణులకు మంచి సందేశంతో పాటు ఆత్మస్థైర్యాన్ని పెంపొందింప చేసింది. ఈ పరిణామం రాజకీయాలతో సంబంధం లేని తటస్థ వర్గాలలో సైతం టిడిపి పట్ల సానుకూల చర్చకు దారితీసింది.