- టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 70వ రోజు ప్రజాదర్బార్
- మంత్రిని కలిసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు
- ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించిన మంత్రి
- నాలుగు గంటల పాటు దాదాపు 4వేల మందిని పైగా కలిసి సమస్యలు తెలుసుకున్న మంత్రి
అమరావతి (చైతన్యరథం); మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం 70వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ను కలిసి సమస్యలు విన్నవించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వారి నుంచి వినతులు స్వీకరించారు. నాలుగు గంటల పాటు దాదాపు 4 వేలమందిని పైగా కలిసి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రతి విజ్ఞప్తిని పరిశీలించి సిబ్బందికి అప్పటికప్పుడే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంత్రి లోకేష్కి వచ్చిన విజ్ఞప్తుల్లో కొన్నింటిని చూస్తే.. వైసీపీ పాలనలో అక్రమ కేసులతో పాటు ఆస్తులు లాగేసుకున్నారు
టీడీపీ కార్యకర్తనైన తనపై వైసీపీ పాలనలో అక్రమ కేసులు నమోదు చేయడంతో పాటు ఆ పార్టీ నేతల ప్రోద్బలంతో తన భూమిని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, విచారించి తగిన న్యాయం చేయాలని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బుడ్డేపుపేట గ్రామానికి చెందిన దనపాన హరికృష్ణ మంత్రి లోకేషు కలిసి విజ్ఞప్తి చేశారు. విచారించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
తనకు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూమిని తప్పుడు పత్రాలతో కబ్జా చేసేందుకు వైసీపీ కార్యకర్త అన్నలదాసు జోసెఫ్ యత్నిస్తున్నారని, విచారించి తగిన న్యాయం చేయాలని గుంటూరు జిల్లా కాకుమాను గ్రామానికి చెందిన మెరిగల రవిబాబు విజ్ఞప్తి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
టీడీపీ సానుభూతిపరుడిననే కక్షతో అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్న తనను వైసీపీ హయాంలో విధుల నుంచి తొలగించారని, తిరిగి తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఉల్లిద్ర రవి విన్నవించారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలోని పారామెడికల్ విభాగంలో ఖాళీగా ఉన్న హెల్త్ అసిస్టెంట్ మేల్ పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని అన్ ఎంప్లాయిస్ పారా మెడికల్ హెల్త్ అసిస్టెంట్(మేల్)అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. టీడీపీ పాలనలో ఎంపీహెచ్ఎ మేల్ పోస్టులను భర్తీ చేశారని, గత కొన్నేళ్లుగా హెల్త్ అసిస్టెంట్ మేల్ పోస్టులకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
శ్రీశైలం ఐటీడీఏ (పేటీజీ) చెంచు ప్రాజెక్ట్ కార్యాలయం పరిధిలోని ప్రకాశం జిల్లా అటవీ ప్రాంతంలోని గిరిజన చెంచు, ఆదివాసి గూడేల్లో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నూతన పాఠశాలల మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలని నల్లమల గిరిజన చెంచు (పీటీజీ) సంక్షేమ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఏపీ జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కమ్స్ లో పనిచేస్తున్న సుమారు 23,500 మంది కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్ర రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. వేతన సవరణ చేయడంతో పాటు ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడి తీవ్ర అనారోగ్యం పాలైన తనకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్యసాయం అందించి ఆదుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం కన్నికాపురం గ్రామానికి చెందిన కె.ప్రకాశ్ బాబు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో సైన్స్, ఆర్ట్స్, ఒకేషనల్ కోర్సులతో కూడిన ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతానికి చెందిన బి.ఎమ్ కిషోర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదివేందుకు విద్యార్థులు సుదూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలో విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన గరిమెళ్ల అనిల్ కుమార్..మంత్రి లోకేష్ను కలిసి ఫిర్యాదు చేశారు. విజయవాడ-విసన్నపేట ఆర్ అండ్ బీ రోడ్డును ఆక్రమించి ఆక్రమణదారులు భారీ కట్టడాలు నిర్మిస్తున్నారని, అక్రమ నిర్మాణాలు తొలగించాలని అధికారులకు పలుమార్లు ఫిర్యాదుచేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.












