టిడిపి అధికారంలోకి వచ్చాక ఆటోకార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం నంద్యాల సాయిబాబా నగర్ ఆర్చి వద్ద సిఐటియు అనుబంధ ఆటో డ్రైవర్ల సంఘం నాయుకలు యువనేత లోకేష్ ను కలసి వినతిపత్రం సమర్పించారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి రూ.1,000కోట్లు నిధులు కేటాయించి, ఖర్చు చేయాలి.
ప్రైవేటు ఫైనాన్స్ ల అధిక వడ్డీ ఆగడాలను అరికట్టాలి. ఈ చలానాల పేరుతో ఆర్టీఓ, పోలీసు అధికారుల వేధింపులను ఆపాలి. భారీ చలానాలు, జరిమానాలు తగ్గించాలి. పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ ట్యాక్సు తగ్గించాలి. అర్హులైన ఆటో డ్రైవర్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ప్రభుత్వమే ఇళ్లు నిర్మించాలి. జీఓ-21ను పూర్తిగా రద్దు చేయాలి.పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలి, 55ఏళ్లు దాటిన ప్రతి ఆటో డ్రైవర్ కు రూ.6వేలు పెన్షన్ ఇవ్వాలి. ఆటోస్టాండ్లకు ప్రభుత్వమే స్థలాలు ఏర్పాటు చేయాలి.
డ్రైవర్ కి సున్నా వడ్డీకే ఆటో కొనుగోలుకు బ్యాంకు లోన్ ఇచ్చే ఏర్పాటు చేయాలి అని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆటోడ్రైవర్లను సైతం వదలకుండా జలగలా రక్తం పీలుస్తున్నారు.కేవలం కొంతమందికి రూ.10వేలు ఇస్తూ… ఫైన్ల రూపంలో ఐదారు రెట్లు లాగేస్తున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలను అదుపు చేసి, ఆటోల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు అందజేస్తాం. ఆటోస్టాండ్లకు స్థలాలు కేటాయించి, ఎలక్ట్రిక్ ఆటోలకు రీచార్జి స్టేషన్లు ఏర్పాటుచేస్తాం. ఇళ్లులేని ఆటోకార్మికులందరికీ ఇళ్ళస్థలాలు మంజూరు చేస్తాం అని హామీ ఇచ్చారు.