విజయవాడ (చైతన్య రథం): విజయవాడ ఐటీఐ కాలేజ్ రోడ్డులో నూతనంగా నిర్మించిన వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా హాస్పిటల్ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాలు, మంత్రోచ్ఛారణల మధ్య వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, వీఐపీ, ఏసీ జనరల్ వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చిన సౌకర్యాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి లోకేష్‌ను ఆసుపత్రి నిర్వాహకులు ప్రత్యేక జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. అందరితో కలిసి మంత్రి ఫోటోలు దిగారు. కార్యక్రమంలో వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎండీ జి లక్ష్మీకుమార్, సీఈవో కె సుధాకర్‌తో పాటు ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్), మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
	    	
 









