- అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం
- మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లకు సరఫరా
- పెరుగుతున్న ధరలను నియంత్రించాలి
- అధికారులతో మంత్రి అత్యవసర సమీక్ష
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో టమాటా, ఉల్లి ధరల పెరుగుదల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. టమాటా, ఉల్లి ధరల పెరుగుదల అంశంపై వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఉద్యాన శాఖ కార్యదర్శి అహ్మద్ బాబు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత, సంబంధిత అధికారులతో సోమవారం సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతుల నుంచి నేరుగా టమాటా, ఉల్లి సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. 1.35 లక్షల కిలోల టమాటా, 21 వేల కిలోల ఉల్లి రైతుల నుంచి సేకరించి వాటిని రైతు బజార్లకు సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా సాధారణ ధరలకే టమాటా, ఉల్లి విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. రైతు బజార్లలో కూరగాయలు విక్రయించే ధరల పట్టిక తప్పని సరిగా ఏర్పాటు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు.