- పుట్టపర్తికి ప్రధాని మోదీ రాకపై సీఎం సమీక్ష
- రాష్ట్రపతి ముర్ము పర్యటనపైనా భద్రతా జాగ్రత్తలు
- మహాసమాధి దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు
- శతజయంతి వేడులపై సీపం చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): శ్రీ సత్యసాయి శత జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఈనెల 19న పుట్టపర్తికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రపతి సహా వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్న దృష్ట్యా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. సత్యసాయిబాబా జయంతి వేడుకల నిర్వహణపై సచివాలయంలో మంత్రులు, సీఎస్ విజయానంద్, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పుట్టపర్తికి ప్రముఖులు రానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, పట్టణాన్ని సుందరంగా అలంకరించాలని సీఎం సూచించారు. ఏర్పాట్ల పర్యవేక్షించేందుకు మంత్రుల కమిటీ పుట్టపర్తిలో పర్యటించాలని ఆదేశించారు. శ్రీ సత్యసాయి శత జయంత్యుత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయండి
సత్యసాయిబాబా మహాసమాధి దర్శన నిమిత్తం పుట్టపర్తి నిలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వచ్చే వాహనాలకు పార్కింగ్‌తోపాటు పట్టణంలో రాకపోకల ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. బాబా మహాసమాధి దర్శనానికి ఎంతమంది భక్తులు రావచ్చనేదానిపై అంచనా వేసి అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల కోసం అవసరమైన మేరకు ఆర్టీసీ బస్సులను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ముందుస్తు జాగ్రత్తగా మెడికల్ క్యాంపులు సైతం ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. పుట్టపర్తిలోని వేర్వేరు ప్రాంతాల్లో 10 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు సీఎంకు తెలియజేశారు. పారిశుద్ధ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
10 రోజులు.. 682 రైళ్లు
పుట్టపర్తికి వచ్చే భక్తులకు చిన్నపాటి ఇబ్బందీ తలెత్తకుండా చర్యలు చేపట్టినట్టు అధికారులు సీఎంకు వివరించారు. పారిశుద్ధ్యం నిర్వహణకు 250మంది సిబ్బంది, వచ్చే భక్తులకు తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు వంటి సదుపాయాలను కల్పిస్తున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. జయంతి వేడుకల నేపథ్యంలో 65 ప్రత్యేక రైళ్లతోపాటు ఈనెల 13నుంచి డిసెంబర్ 1వరకు 682 రైళ్లు పుట్టపర్తికి రైల్వే శాఖ నడుతోందని వివరించారు. పుట్టపర్తి బస్‌స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్‌కు రోజుకు 20 బస్సులు భక్తుల రవాణా కోసం ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వివరించారు. సమీక్షలో మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.















