- పార్టీలో ప్రతీ కార్యకర్తకూ న్యాయం జరగాలి
- అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలి
- నెలాఖరులోగా అన్ని పార్టీ, నామినేటెడ్ పదవులూ భర్తీ చేస్తాం
- ఇంఛార్జ్ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో జోనల్ కోఆర్డినేటర్లు సమన్వయం చేసుకోవాలి
- ప్రతిపక్షంలో ఉన్నప్పటి కంటే ఇంకా బలంగా పనిచేయాలి
- టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిశానిర్దేశం
అమరావతి (చైతన్యరథం): తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అధినేతలని, వారందరికీ న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్లదేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కోఆర్డినేటర్లతో నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి కార్యకర్తే అధినేత అనే టీడీపీ విధానం పక్కాగా అమలు కావాలని, ఆ దిశగా ప్రతీ కార్యకర్తకు పార్టీలో ప్రాధాన్యం ఉండేలా చూడాలని జోనల్ కోఆర్డినేటర్లకు లోకేష్ తేల్చి చెప్పారు. అధికారంలో ఉన్నామనే నిర్లక్ష్యం వద్దే వద్దని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత కసిగా పనిచేశారో, అంతకంటే ఎక్కువ పట్టుదలతో పనిచేసి కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరారు. ఇంఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక ఎన్నికలకు వ్యూహరచన చేయాలని జోనల్ కోఆర్డినేటర్లకు ఆదేశాలు ఇచ్చారు. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం ఇంఛార్జ్‌ల సమన్వయం ఎంతో కీలకం అని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి వెళ్లి పార్టీ వ్యవహారాలపై జోనల్ కోఆర్డినేటర్లు సమీక్షించాలని సూచించారు. ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు మద్య సమన్వయం పెంచే బాధ్యత జోనల్ కోఆర్డినేటర్లదేనని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించి, అర్జీలు తీసుకుని వారి స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. వైసీపీ ఐదేళ్లలో పెట్టిన అక్రమ కేసులపై సమీక్షించి చట్టపరంగా పరిష్కరిద్దామన్నారు. పెండిరగ్‌లో ఉన్న అన్ని పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు త్వరితగతిన భర్తీ చేస్తామని లోకేష్ చెప్పారు. జోనల్ కోఆర్డినేటర్లు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి నియోజకవర్గాలలో క్లస్టర్, యూనిట్, బూత్, కుటుంబ సాధికార సారథులతో సమావేశం నిర్వహించాలన్నారు. ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లు పెన్షన్ల పంపిణీ, గ్రీవెన్స్, క్యాడర్ మీటింగ్స్, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలలో తప్పని సరిగా పాల్గొనే విధంగా చూడాలన్నారు. వీటన్నింటిపైనా జోనల్ బాధ్యులు ఇచ్చిన నివేదికలను అధిష్టానం సమీక్షిస్తుందని తెలిపారు. ప్రమాద బీమా చెక్కులు తగిన సమయంలోనే బాధిత కుటుంబ సభ్యులకు అందజేయాలని కోరారు. పార్టీ డైరెక్షన్‌లోనే ప్రతి నాయకుడు పనిచేసే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో జోనల్ కోఆర్డినేటర్‌లు మంతెన సత్యనారాయణ రాజు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్, దామచర్ల సత్య, సుజయ్ కృష్ణ రంగారావు, దీపక్ రెడ్డి, కోవెలమూడి రవీంద్ర, వేపాడ చిరంజీవి రావు, మందలపు రవి, పెళ్లకూరు శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.












