- చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం జగన్ రెడ్డి నైజం
- 85 శాతం హామీలపై మడమ తిప్పటం నిజం కాదా
- మద్యనిషేధం చేస్తానని, జే బ్రాండ్స్‌తో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు
- పేదల ద్రోహి జగన్ రెడ్డి బిడ్డకాదు, క్యాన్సర్ గడ్డ
- ధరలు, ఛార్జీలు, పన్నులు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం
- రాజధాని పేరుతో విశాఖను ఊడ్చేశారు
అమరావతి: భీమిలి సభలో అబద్ధాలు అలవోకగా వల్లెవేసిన జగన్‌రెడ్డి ఆత్మస్తుతి, పరనిందకు పాల్పడ్డాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు విమర్శించారు. ఎన్నికలకు ముందు దాదాపు 730 హామీలిచ్చిన జగన్‌రెడ్డి, అధికారంలోకి వచ్చాక అందులో 85 శాతం హామీలపై మాట తప్పి మడమ తిప్పాడు.. పైగా 99 శాతం హామీలు అమలు చేశానని సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నాడని ఒక ప్రకటనలో కళావెంకట్రావు దుయ్యబట్టారు. మద్య నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతానని, విద్యుత్ ఛార్జీలు పెంచబోనని, 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని, వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని, అంగన్వాడీలకు తెలంగాణ కంటే రూ.1000 ఎక్కువ జీతమిస్తానని, కాంట్రాక్టు ఉద్యోగుల్ని పర్మినెంట్ చేస్తానని, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచబోనని, ప్రత్యేక హోదా సాధిస్తానని ఇచ్చిన హామీలను జగన్‌రెడ్డి తుంగలో తొక్కిన విషయం జగనం మర్చిపోలేదన్నారు. అంతే కాకుండా చంద్రబాబు హయాంలో ప్రజలకు ఉపయోగపడిన అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, పసుపు కుంకుమ, విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, పండుగ కానుకలు, చంద్రన్న బీమా లాంటి దాదాపు 130 పథకాలు రద్దు చేసిన పేదల ద్రోహి జగన్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సబ్ ప్లాన్ నిధులు రూ.1.14 లక్షల కోట్లు దారి మళ్లించి సామాజిక న్యాయానికి గొంతు కోసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. వాహన మిత్ర పేరుతో డ్రైవర్‌కు ఏడాదికి రూ.10 వేలు ఇచ్చి రెండో వైపు పెట్రోల్, డీజిల్ ధరల పెంచి, గ్రీన్ ట్యాక్స్, పోలీస్ జరిమానాలు పెంచి, మద్యం రేట్లు 3 రెట్లు పెంచి లక్ష కొట్టేస్తున్నది వాస్తవం. ఎడమ చేత్తో గోరంత ఇస్తూ కుడి చేత్తో కొండంత కొట్టేస్తున్నాడు. నవరత్నాలు నవమోసాలయ్యాయని కళావెంకట్రావు ధ్వజమెత్తారు.
నాసిరకం మద్యంతో జనం ప్రాణాలు తీస్తున్నదెవరు?
జే బ్రాండ్లతో నాసిరకమైన మద్యాన్ని అమ్మి 35 లక్షల మంది ఆరోగ్యాన్ని పాడు చేశారు. అందులో 30 వేల మంది ప్రాణాలు తీసి, మహిళల మాంగల్యాలు మంట కలిపింది నిజం కాదా? రూ. 1200 కోట్ల బకాయిలతో ఆరోగ్యశ్రీ వైద్యాన్ని పేదలకు దూరం చేయలేదా? ధరలు, ఛార్జీలు, పన్నులు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై 56 నెలల పాలనలో రూ.8 లక్షల చొప్పున భారం మోపింది నిజం కాదా? రూ.12 వేల కోట్ల పంచాయతీ నిధులు దారి మళ్లించి గ్రామాల్ని నాశనం చేసింది నిజం కాదా? రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో ఉందంటే ఆ పాపం నీది కాదా? ఉపాధి కూలీల సొమ్ము కాజేసింది నీవు కాదా? చంద్రబాబు హయాంలో విద్యుత్ కొరత లేని రాష్ట్రంలో కరెంటు కోతలు తెచ్చింది జగన్ రెడ్డి కాదా అని కళావెంకట్రావు నిలదీశారు.
ప్రజలు అమాయకులు కాదు
ఫీజు రీయింబర్స్‌మెంట్ చంద్రబాబు 16 లక్షల మందికి ఇస్తే దాన్ని 8 లక్షల మందికి తగ్గించింది నీవు కాదా? ఉపాధ్యాయ నియామకాలు చేయకుండా విద్యా ప్రమాణాల్లో ఏపీని 3వ స్థానం నుండి 19వ స్థానానికి దిగజార్చింది నీవు కాదా? పెట్రోల్ డీజిల్ ధరలు దేశం మొత్తమ్మీద ఏపీలో అధికంగా ఉన్నది నిజం కాదా? అంగన్వాడీలకు చంద్రబాబు రూ.6,300 పెంచితే నీవు పెంచింది కేవలం రూ.1000 మాత్రమే కాదా? హామీ ప్రకారం తెలంగాణ వలే జీతాలు అడిగిన అంగన్వాడీ మహిళలపై దాడులు చేసింది అందరూ చూడలేదా? మోసాలకు, అబద్దాలకు, దుర్మార్గాలకు బ్రాండ్ అంబాసిడర్ నీవు కాదా జగన్ రెడ్డీ? నీవు బిడ్డవి కాదు క్యాన్సర్ గడ్డవి. బాబాయి వివేకానందరెడ్డిని గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపిన దుర్యోధన, దుశ్శాసనులకు రక్షణ కల్పిస్తున్న జగన్ రెడ్డి పులివెందులలో కూడా ఓడిపోక తప్పదు. నీ అబద్ధాల్ని ఎదుటివారికి అంటకట్టి చెప్పిన అబద్ధాన్నే వందసార్లు చెబితే నమ్మేందుకు ఆంధ్రా జనం అమాయకులు కాదని కళావెంకట్రావు అన్నారు.
ఉత్తరాంధ్రను దోచేశారు
విశాఖ రాజధాని పేరుతో జగన్‌రెడ్డి, అతని ముఠా ఉత్తరాంధ్ర మొత్తాన్ని దోచేశారు. విశాఖలో రూ.40 వేల కోట్ల విలువైన భూములు కబ్జా చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు అని లేకుండా విలువైన స్థలాలు, ఆస్తులన్నింటినీ స్వాహా చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని నాశనం చేసిన జగన్ రెడ్డి ఉత్తరాంధ్ర ద్రోహి కాదా అని కళావెంకట్రావు ప్రశ్నించారు.