- మరో చారిత్రక ఘట్టం ఆవిష్కరణ
- సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలు,
- ప్రజాప్రతినిధుల భవనాలు సిద్ధం
- నేడు కాన్వాయ్‌తో ట్రయల్ రన్
- రేపు సీఎం చేతులమీదుగా ప్రారంభం
అమరావతి(చైతన్యరథం): రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో ఒక చారిత్రాత్మక ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. రాజధాని నగరానికి రాజమార్గంగా చెప్పుకుంటున్న సీడ్ యాక్సిస్ రోడ్డులోని అత్యంత కీలకమైన రెండో భాగం ఆగస్టు 13 నుంచి ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. ప్రతిష్టాత్మక సీడ్ యాక్సె స్ రోడ్డును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అదే రోజు స్టీల్ బ్రిడ్జిలు, ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు అంటే ఆగస్టు 12న బుధ వారం ముఖ్యమంత్రి కాన్వాయ్‌తో ఈ రహదారిపై అధికారికంగా ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం వీటికి తుది మెరుగులు దిద్దుతున్నారు. తొలుత విజయవాడ – మంగళగిరి రహదారిని సీడ్ యాక్సెస్ రోడ్డుతో అనుసంధానిం చేందుకు బకింగ్‌హాం కెనాల్, గుంటూరు ఛానళ్లపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను ముఖ్యమంత్రి మొదట ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల టవ ర్ల వద్దకు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యే కంగా నిర్మించిన 6 ఎమ్మెల్యే టవర్లు, 3 ఎమ్మెల్సీ టవర్లలో మొత్తం 207 అత్యాధునిక ప్లాట్లు సిద్ధం చేశారు. వాటి తాళాలను సీఆర్‌డీ ఏ అధికారులు సీఎంకు అందజేస్తారు. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ వర్షాకాల సమావేశాల సమయం లో ప్రజాప్రతినిధులకు ఈ ప్లాట్లను కేటాయించే అవకాశం ఉన్న ట్లు తెలుస్తుంది.
ఎక్కడ నుంచి యాక్సెస్ రోడ్డు ప్రారంభమవుతుంది
సీడ్ యాక్సెస్ రోడ్డు పరిధి మొత్తం 21.77 కిలోమీటర్లు. ఫేజ్-1 పొడవు 14.35 కిలోమీటర్లు. ఇది దొండపాడు నుంచి వెంకట పాలెం (మంతెన ఆశ్రమం) వరకు ఉంటుంది. ఇది ఇప్పటికే పూర్తి అయ్యి రాకపోకలు సాగుతున్నాయి. ఇక రెండో దశ 3.92 కిలోమీటర్ల పొడవు ఉన్న ఫేజ్-2 పనుల్లోని వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు జరిగిన నిర్మాణం. ఈ భాగమే ఆగస్టు 13న ప్రారంభమవుతుంది. మొదటి, రెండు దశలు కలిపి రాజధానిలోని దొండపాడు నుంచి విజయవాడ-మంగళగిరి రోడ్డు వరకు రెండు దశల్లో 18.270 కిలోమీటర్ల మేర 9 వరుసల రహదారిగా సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. రాజధానిలో ఉత్తరం నుంచి దక్షిణానికి నిర్మిస్తున్న 17 ఎన్ సిరీస్‌లోని ప్రతి రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డుతో అనుసంధానిస్తారు. మÖడో దశలో 3.50 కిలోమీటర్ల పొడవు ఉన్న ఫేజ్-3 ఉండవల్లి నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు రోడ్డు నిర్మాణం జరగాల్సి ఉంది. ఇంకా నిర్మాణం జరగాల్సిన ఈ రహదారిని ఎన్‌హెచ్ 16 జాతీయ రహ దారి మణిపాల్ ఆసుపత్రి వరకు విస్తరించనున్నారు. అత్యాధునిక మౌలికవసతులతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టులు ప్రజలకు వేగవంతమైన పరిపాలనను చేరవేసేందుకు దోహదపడతాయి. ఈ మేరకు ట్రయల్ రన్‌కు తుదిమెరుగులు చేస్తున్నారు. బకింగ్ హామ్ కెనాల్ వద్ద బ్యూటిఫికేషన్ పనులు, గుంటూరు ఛానెల్, కొండవీటి వాగులపై జరుగుతున్న పనులు తుది దశకు చేరాయి. పనులు పూర్తి చేసి సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
సీడ్ యాక్సెస్ రోడ్డు విశేషాలు
అమరావతి రాజధాని నగరంలో ‘ఈ3 రోడ్డు’గా పిలిచే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఎంతో కీలకమైన ప్రాజెక్టు. ఇది రాజధాని నగరం లోని ఉత్తరం నుంచి దక్షిణానికి ఉండే 17 ప్రధాన ‘ఎన’ సిరీస్ రోడ్లను ఒకదానితో ఒకటి అనుసంధానించే మార్గం. మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవునా ఈ రహదారి విస్తరించి ఉంది. దొండపాడు గ్రామం వద్ద ప్రారంభమయ్యే ఈ రహదారి రాయ పూడి, వేంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా సాగుతూ మణిపాల్ హాస్పిటల్స్ వద్ద జాతీయ రహదారి (ఎన్‌హెచ్ -16)లో కలుస్తుంది. ఈ రోడ్డుకు సంబంధించి రైట్ ఆఫ్ వే 60 మీటర్లుగా నిర్ణయించారు. ప్రస్తుతం 11 మీటర్ల వెడల్పుతో కూడి న క్యారేజ్ వేస్, సర్వీస్ రోడ్లు, సెంట్రల్ బీఆర్‌టీఎస్ కారిడార్‌తో నిర్మించారు.
మండు దశల్లో నిర్మాణం
60 మీటర్ల వెడల్పుతో నిర్మితమవుతున్న ఈ రహదారిని మూడు దశల్లో అభివృద్ధి చేశారు. ఫేజ్-1 పొడవు 14.35 కిలోమీటర్లు. ఇది దొండపాడు నుంచి వెంకటపాలెం (మంతెన ఆశ్రమం) వరకు ఉంటుంది. ఇది ఇప్పటికే పూర్తి అయ్యి రాకపోకలు సాగు తున్నాయి. రెండోది 3.92 కిలోమీటర్ల పొడవు ఉన్న ఫేజ్-2 వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు సాగుతుంది. ఈ భాగమే ఆగస్టు 13న ప్రారంభమవుతుంది. భూసేకరణ సమస్యలు, కోర్టు వ్యాజ్యాలను అధిగమించి ప్రభుత్వం ఈ పనులను యుద్ధప్రాతి పదికన పూర్తి చేసింది. 3.50 కిలోమీటర్ల పొడవు ఉన్న ఫేజ్-3 ఉండవల్లి నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు నిర్మి స్తున్నారు. ఇందులో ఒక భారీ ఎలివేటెడ్ కారిడార్ 320 మీటర్ల ఐకానిక్ కేబుల్ బ్రిడ్జిని నిర్మించాలని ప్రతిపాదించారు.
అత్యాధునిక మౌలికవసతులు
ఈ రహదారి నిర్మాణం ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపు దిద్దుకుంది. ఫేజ్-1, ఫేజ్-2లలో ఇరువైపులా 11 మీటర్ల క్యారే జ్‌వేలతో 9 లైన్ల రహదారిని సిద్ధం చేశారు. మధ్యలో ప్రత్యేక బీఆర్‌టీఎస్ కారిడార్, ఇరువైపులా 11 మీటర్ల విస్తీర్ణంతో సర్వీసు రోడ్లు ఉంటాయి. దొండపాడు నుంచి ఉండవల్లి ఇస్కాన్ టెంపుల్ కరకట్ట రోడ్డు వరకు ప్రజల రాకపోకల కోసం బీఆర్‌టీఎస్ మార్గా న్ని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహదారి ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ, భూగ ర్భంలో మంచినీటి సరఫరా పైప్‌లైన్లు, గ్యాస్ నెట్‌వర్క్, విద్యుత్ లైన్లు, సీవరేజ్ వ్యవస్థ, ఐసీటీ కేబుళ్లను అమర్చారు. ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లు, కాలినడక బాటలు, గ్రీనరీ బెల్ట్‌లను
సైతం ఏర్పాటు చేశారు.
సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఎందుకు ఇంత ప్రాధాన్యం?
విజయవాడ నుంచి అమరావతి సచివాలయానికి హైకోర్టుకు వెళ్లే వేల మంది ఇరుకైన కరకట్ట రహదారిపై ఆధారపడే వారు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు సమయం ఆదా అవుతుంది. దాదాపు అరగంట కలిసి వస్తుంది. విశాలమైన రహదారి కావ డంతో ప్రమాదాల భయం లేదు. ఈ కారిడార్ వెంబడి ఉన్న ఉండవల్లి, పెనుమాక, మందడం ప్రాంతాల్లో భూముల రేట్లు పెర గనున్నాయి. ఐటీ కంపెనీలు, మాల్స్ రానున్నాయి. సందర్శకుల తాకిడితో రద్దీ పెరగనుంది.
ప్రత్యేక ఆకర్షణగా స్టీల్ బ్రిడ్జిలు
ఈ రహదారిలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నవి ఉండవల్లి వద్ద నిర్మించిన భారీ స్టీల్ బ్రిడ్జిలు. వీటిని కూడా ఈ నెల 13న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 110 మీటర్ల పొడవుతో బకింగ్‌హామ్ కెనాల్‌పై ఒక స్టీల్ బ్రిడ్జి నిర్మించారు. రాజధానికి వరద ముప్పు లేకుండా చేసే కొండవీటి వాగుపై 280 మీటర్ల పొడవుతో మరో అధునాతన స్టీల్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని కేవలం ఒక రహదారిగానే కాకుండా ఒక పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణానది, కొండ వీటి వాగు అందాలను చూసేందుకు ఇక్కడ ప్రత్యేక వ్యూ పాయిం ట్లను ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ హితంగా ఉండేందుకు స్లైక్లింగ్ ట్రాక్‌లు, వాకింగ్ ట్రాక్‌లు, సుందరమైన ల్యాండ్ స్కేప్ గార్డెన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇక ఫేజ్-3 త్వరలోనే ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్‌గా మారి నేరుగా జాతీయ రహదారి-16కి అనుసంధానమవుతుంది. ఈ ముఖ్యమైన సీడ్ యాక్సెస్ రహదారి, స్టీల్ బ్రిడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్ టవర్లు ప్రారంభం కానుండటంతో రాజధాని అమరావతికి మరింత కొత్త శోభ చేకూరనుంది.















