అమరావతి: నాలుగున్నరేళ్ల జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన రాష్ట్రప్రజలకు శాపంలా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారిందని శనివారం ఒక ప్రకటనలో లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ సమీపాన విజయపురి సౌత్ కమ్యూనిటీ ఆసుపత్రి ప్రాంగణంలో చెట్లకింద రోగుల దుస్థితి జగన్ చేతగాని పాలనకు అద్దం పడుతోంది. నల్లమల అటవీప్రాంతంలో గిరిజన తాండాల ప్రజలకు ఏకైక దిక్కుగా ఉన్న ఈ ధర్మాసుపత్రిలో మూడేళ్లుగా చెట్లకిందే వైద్యసేవలు అందిస్తున్నారంటే ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి. రాష్ట్ర వైద్య, ఆరోగ్యమంత్రి సొంతజిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలాంటి మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు ఇక ఆ దేవుడే దిక్కు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఆక్సిజన్ సరఫరా వైఫల్యం కారణంగా కళ్లెదుటే వేలాదిమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం కళ్లారా చూశాం. జగన్ దివాలాకోరు పాలన పుణ్యమా అని కర్నూలు, అనంతపురం వంటి బోధనాసుపత్రుల్లోనే దూది, గాజుగుడ్డ సైతం అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు కళ్లెదుట కన్పిస్తుంటే రాజుగారి వంటిమీద దేవతావస్త్రాల మాదిరిగా తమ హయాంలో వైద్య, ఆరోగ్యరంగం వెలిగిపోతుందని, జగనన్న సురక్ష పేరుతో ఇళ్లవద్దకే వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రిని పిచ్చోడుగాక మరేమనాలని లోకేష్ ప్రశ్నించారు. చెట్లుకింద వైద్యం అంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను లోకేష్ తన ప్రకటనకు జత చేశారు.