తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సంక్షేమానికి సరికొత్త కోణం ఆవిష్కృతమయింది. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా సంక్షేమం అమలు జరిపిన ఘనత టిడిపికే దక్కుతుంది. సంక్షేమ ప్రదాతగా నాడు ఎన్టీఆర్ నేడు చంద్రబాబు నాయుడులు ప్రజాహృదయాలలో చిరస్థానం పొందారు.
సంక్షేమం అంటే తాయిలాలు పంచి చేతులు దులుపుకోవడమేనా? కొన్ని రాజకీయ పార్టీలు సంక్షేమానికి, తాయిలాల పంపిణీకి మధ్య గీతని చేరిపేసాయి. దీంతో సంక్షేమం పరిధి కుంచించుకు పోయింది. జీవన స్థితిగతులలో మార్పులు తీసుకు రావలసిన సంక్షేమం ఎన్నికలలో ఓట్లు కురిపించే తాయిలంగా కుంచించుకు పోయింది. సంక్షేమం పేరుతో ప్రభుత్వం చేపడుతున్న పథకాలు కేవలం ప్రచారానికే పరిమితం అవుతున్నాయి. అత్యధిక శాతం అనర్హుల జేబుల్లోకి చేరి కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతున్నది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ప్రవేశపెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, వంటి పథకాలు అప్పటి పరిస్థితుల్లో ప్రజల కనీస అవసరాలు తీర్చాయి. తెలుగు గ్రామీణ క్రాంతిపథం పేరుతో అమలు జరిపిన కార్యక్రమాలు ప్రజల మౌలిక అవసరాలు భర్తీ చేశాయి. మండల కమిషన్ సిఫార్సుల అమలు ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించటం వారిని పాలనలో భాగస్వామ్యం కల్పించేందుకు దోహదపడింది. కేవలం 50 రూపాయలకే హార్సు పవర్ విద్యుత్ అందించటం ద్వారా నిత్యం కరువు కాటకాలతో దయనీయ స్థితిలో వుండే మెట్టప్రాంతాలు జలకళ సంతరించుకున్నాయి. ఆ పథకం రైతాంగ జీవన వికాసానికి దోహద పడటమే గాక, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంపుకు ఉపకరించింది.
మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించటం ద్వారా మహిళా సాధికారతకు సార్థకత చేకూరింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి నిధులు కేటాయించటం ఆయా వర్గాల ఆర్థిక ఎదుగుదలకు దోహదపడింది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విదేశీ విద్య అభ్యసించేందుకు పలుకార్పొరేషన్ ల ద్వారా ఆర్థిక సహకారం అందించటం వారి జీవన ప్రమాణ స్థాయి పెరిగేందుకు తోడ్బడింది. రాష్ట్రంలో ప్రతిఒక్కరి జీవన ప్రమాణ స్థాయికి ఉపకరించే ఎన్నో సంక్షేమ పథకాలను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవంతంగా అమలుజరిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆ తరహా సంక్షేమ కార్యక్రమాలు అమలుజరుగుతున్న దాఖలాలు లేవు. సంక్షేమం పేరుతో అమలు జరుపుతున్న పథకాలు అన్నీ జనాకర్షణ కే పరిమితం అవుతూ ప్రచారార్భాటాలకే ఉపయోగపడుతున్నాయి. అంతేగాక సంక్షేమం పేరుతో ప్రభుత్వం చేస్తున్న మోసం బట్టబయలవుతోంది. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందే దిశగా సంక్షేమ పథకాలు అమలు జరుగాలంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తోనే సాధ్యం అవుతుంది అనే అభిప్రాయం ఇప్పుడిప్పుడే ప్రజానీకంలో వ్యక్తం అవుతున్నది. ఇది కేవలం జనాభిప్రాయమే కాదు. చరిత్ర చెబుతున్న వాస్తవం.