- కబ్జా నుండి భూమిని విడిపించాలంటూ బాధితుల విన్నపం
- రాష్ట్ర వ్యాప్తంగా పలు సమస్యలపై తరలివచ్చిన జనం
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో అర్జీలు స్వీకరించిన ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, సీడ్స్ చైర్మన్ మన్నే సుబ్బారెడ్డి
అమరావతి (చైతన్యరథం): మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పలు సమస్యలపై బాధితులు తరలివచ్చి వినతి పత్రాలు అందజేశారు. భూ కబ్జాలతో పాటు వివిధ సమస్యలపై తరలివచ్చిన బాధితుల నుండి ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఏపీ సీడ్స్ చైర్మన్ మన్నే సుబ్బారెడ్డి అర్జీలు స్వీకరించి వారి సమస్యలపై అధికార్లతో ఫోన్లలో మాట్లాడి వెంటనే అర్జీ దారుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
` నంద్యాల జిల్లా డోన్ మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన కామగానికుంట్ల శేషారెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. తనకు తన నానమ్మ గిఫ్ట్ డీడ్ కింద కొంత భూమి ఇచ్చిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రోద్బలంతో కావాలనే ఆ భూమి ఆన్‌లైన్ రికార్డుల నుండి తమ పేరును తొలగించి ఇబ్బంది పెట్టారని.. దయ చేసి తమ భూ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
సబ్ డివిజన్ కాకపోయినా సబ్ డివిజన్ అయినట్లు చూపించి తన భూమిని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుచరులు ఆక్రమించుకున్నారని.. వారి నుండి తమ భూమిని విడిపించాలని నంద్యాల జిల్లా బేతంచర్లకు చెందిన ఈ ప్రేమ్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
ఏలూరు జిల్లా మండవల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన సంధ్యారాణి అనే మహిళ అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తన అన్న తనకు కానుకగా ఇచ్చిన ఇంటిని గ్రామ సర్పంచ్ సురేష్ బాబు ఆక్రమించుకున్నాడని.. అతని నుండి తమ ఇంటిని విడిపించాలని విజ్ఞప్తి చేశారు.
నెల్లూరు జిల్లా ఆల్లూరు మండలం ఆది రాఘవపురం గ్రామానికి చెందిన సీతారావమ్మ విజ్ఞప్తి చేస్తూ.. తన భర్త చనిపోయాడని.. ఆయన తరువాత తనకు వారసత్వంగా రావాల్సిన భూమిని తన పేరుమీదకు మార్చాలని కోరారు.
అనంతపురం రూరల్ మండలం రాజీవ్ కాలనీలో ఉండే కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించిన భూమిని కొనకొండ్ల వెంకటేష్, రమణ, తదితరులు ఆక్రమించుకొన్నారని.. వారి నుండి ఆశ్రమ స్థలాన్ని విడిపించాలని కె. నాగేంద్రాచారి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం బనగానపల్లె గ్రామానికి చెందిన మంచినీళ్ల రత్నమ్మ గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి.. గతంలో తనకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని.. దాన్ని జిల్లా పరిషత్ పాఠశాల నిర్మాణానికి తీసుకోవాలని కోరారు.
కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం నాయనోరి పల్లె గ్రామానికి చెందిన శ్మశాన వాటికను పులివెందులకు చెందిన విశ్వనాథ్ రెడ్డి కబ్జా చేసి తమను బెదిరిస్తున్నాడని. అతనిపై చర్యలు తీసుకొని శ్మశాన వాటికను కబ్జానుండి విడిపించాలని గ్రామానికి చెందిన వ్యక్తులు కోరారు.
తన పేరుమీద ఉన్న బండల ఫ్యాక్టరీని వైసీపీ నేతలు ఆక్రమించుకున్నారని..గత ఐదు సంవత్సరాలుగా వారిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని.. అధికారులు తమ సమస్యను పరిష్కరించేలా చూడాలని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలానికి చెందిన సుబ్బలక్ష్మమ్మ కోరారు.
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామానికి చెందిన బత్తుల వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నెంబర్ 313/1 లో తమకు 1.97 సెంట్ల భూమి ఉందని.. కాని ఆన్‌లైన్ లో 88 సెంట్లు మాత్రమే నమోదు చేశారని.. దాన్ని సరిచేయాలని విజ్ఞప్తి చేశారు.