- అంతర్జాతీయ బృందం ప్రశంసలు
- కుప్పంలో పలు క్షేత్రాల సందర్శన
కుప్పం (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆగ్రో ఎకాలజీ, వాతావరణ, ఆహారం, ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలను చూపుతున్నారని అంతర్జాతీయ వ్యవసాయ ప్రతినిధులు ప్రశంసించారు. ప్రకృతి వ్యవసాయ విధానాలపై అధ్యయనం చేస్తున్న 20 దేశాలకు చెందిన 51 మంది అంతర్జాతీయ ప్రతినిధులు శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించి వేర్వేరు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, ఆహార భద్రత, ఆరోగ్యం, తదితర అనేక సవాళ్ళకు సమాధానంగా రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ విధానాలు అమలు చేయడం ప్రశంసనీయమని అంతర్జాతీయ ప్రతినిధుల బృందం పేర్కొంది. రైతు సాధికార సంస్థ ద్వారా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం రూపొందించిన సార్వత్రిక సూత్రాలు ప్రపంచంలో మరెక్కడా చూడలేదని తెలిపింది. ఈ సూత్రాలు అనేక సవాళ్లను అధిగమించేలా ఉన్నాయని, ఇవి ప్రపంచానికి ఎంతో అవసరమని అంతర్జాతీయ ప్రతినిధులు తెలిపారు. చిన్న స్థాయి రైతుల కోసం ఇది గొప్ప అనుభవ మార్పిడి సమావేశమని పేర్కొన్నారు. పనామా, బ్రెజిల్, గాంబియా, దక్షిణ కొరియా, ఇండోనేషియా, నెదర్లాండ్స్, తదితర దేశాల నుంచి ఆగ్రో ఎకాలజీ నిపుణులు, పరిశోధకులు, రైతు నాయకులు, వ్యవసాయ నిపుణులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.
అంతకు ముందు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో రైతు సాధికార సంస్థ సీనియర్ అధికారులు ప్రకృతి వ్యవసాయం కోసం అమలు చేస్తున్న తొమ్మిది సూత్రాలను అంతర్జాతీయ బృందానికి వివరించారు. అనంతరం మూడు బృందాలుగా విడిపోయిన అంతర్జాతీయ ప్రతినిధులు కుప్పం మండలంలోని సీగలపల్లి, అంకిరెడ్డిపల్లి, సింగా సముద్రం, జీడిమాకులపల్లి గ్రామాల్లో పర్యటించి వేర్వేరు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. క్షేత్ర పర్యటనల్లో భాగంగా రైతు సాధికార సంస్థ అధికారులు బీజామృతం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, విత్తన గుళికల తయారీని డెమో పద్ధతిలో ప్రదర్శించారు.
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన అంతర్జాతీయ బృందం వ్యవసాయ సూత్రాలు, వనరుల వినియోగం గురించి అవగాహన చేసుకోవడంతో పాటు రసాయనిక వ్యవసాయ క్షేత్రాలను కూడా పరిశీలించి రెండిరటికీ మధ్య గల తేడాలను పరిశీలించింది.
ప్రకృతి వ్యవసాయ రైతులు జీ కృష్ణ మూర్తి, కె.ఎం. వెంకటరమణ, జి.వి. సత్యనారాయణ, ఎం. మురుగేష్, ఆర్. హనుమంత కుమార్ అనుసరిస్తున్న ఏ గ్రేడ్ మోడల్స్, రైతులకు ఏడాది పొడవునా ఆదాయం కల్పించే నమూనా, షేడ్‌నెట్ కూరగాయలు, సూర్యమండలం, కాంపాక్ట్ బ్లాక్ మోడళ్లను బృంద సభ్యులు సందర్శించారు.
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం అమలులో విశిష్టతను ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని బృంద సభ్యులు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ విధానం అమలులో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించేందుకు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సహించేందుకు కూడా ఈ పర్యటన ఉపకరిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ ముని రత్నం, ఏపీసీఎన్‌ఎఫ్ రీజనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ చక్రాల చంద్రశేఖర్ మునిరత్నం, జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ మురళీకృష్ణ, జిల్లా మేనేజర్ వాసు, రైతు సాధికార సంస్థ అధికారులు రాము, భాగ్యలక్ష్మి, సురేష్, జిల్లా స్థాయి మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.