- రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నేడు కౌంటింగ్
- ఓట్ట లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు
- పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా తమ విజయం ఖాయమని కూటమి అభ్యర్థుల ధీమా
- ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయని నమ్మకం
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో గత నెల 27న జరిగిన ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్ సోమవారం జరగనుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలోని రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి, గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. గుంటూరులోని ఏసీ కళాశాలలో ఓట్ల లెక్కింపు సిబ్బంది, సూపర్‌వైజర్లు, ఇన్ఛార్జ్‌లు, పర్యవేక్షణ అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఓట్ల లెక్కింపునకు 28 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. అదేవిధంగా ఉమ్మడిగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏలూరు సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జరగనుంది. అధికారులు అక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 28 టేబుళ్లను ఏర్పాటుచేయగా, 17 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలోని ట్రిపుల్-ఈ బిల్డింగ్ లో జరగనుంది.
గెలుపుపై కూటమి అభ్యర్థుల ధీమా
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు, గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖరం తమ గెలుపుపై గట్టి నమ్మకంతో ఉన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తోంది కాబట్టే పట్టభద్రులు తమకు ఘన విజయాన్ని అందించబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థులెవరనేది కాదు ప్రగతికి ఓటేయాలని తాము చేసిన విజ్ఞప్తికి పట్టభద్రులు సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన అభివృద్ధి పనులే తమకు అఖండ విజయాన్ని అందిస్తాయని అంటున్నారు.
భారీగా పోలింగ్..లెక్కింపులో జాప్యం
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు, సాధారణ ఓట్ల లెక్కింపునకు చాలా తేడా ఉంటుంది. ఓటర్లు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేశారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఏ అభ్యర్థికైనా మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లలో సగానికంటే ఎక్కువ వస్తే విజేతగా ప్రకటిస్తారు. అదెలాగంటే మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లు లక్ష అనుకుందాం.. వాటిలో గెలిచిన వారికి 50వేల ఒక ఓటు రావాలి. అంటే సగం కంటే ఒక్కటి ఎక్కువ అన్నమాట. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఏ అభ్యర్థి ఈ మార్కు చేరుకోకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ అవలంబిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల సంఖ్యను బట్టి అభ్యర్థుల ఆరోహణ క్రమంలో జాబితాను సిద్ధం చేస్తారు. ఈ జాబితాలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను గుర్తించి వరుసగా ఎలిమినేట్ చేస్తారు. జాబితాలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరో ఒకరు గెలుపు మార్కును చేరుకునే వరకు ఈ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఈసారి భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచిన నేపథ్యంలో లెక్కింపునకు ఎంత సమయం పడుతుందో చూడాలి.
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో 69.57 శాతం మేర భారీ పోలింగ్ నమోదయింది. ప్రధాన పోటీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్యనే నెలకొంది. ఈ నియోజకవర్గంలో 2019లో 50.95 శాతం శాతం పోలింగ్ నమోదుకాగా.. ఈసారి రికార్డు స్థాయిలో 69.57 శాతం ఓట్లు పోలయ్యాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 69.49 శాతం పోలింగ్ జరిగింది. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు మధ్యనే పోటీ ఉంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 92.40 శాతం పోలింగ్ నమోదయింది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో 6 లక్షల 62 వేల మంది పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్ నమోదైన నేపథ్యంలో లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో ఫలితం సాయంత్రానికి వెలువడే అవకాశం ఉంది.