- క్రెడిట్ చోరీకి గొడ్డలి పార్టీ ఎగబడుతోంది..
- ఐదేళ్లలో ఒక్క ఇటుకా పేర్చని జగన్.. సీమ ద్రోహి
- వైఎస్ ఫ్యామిలీ దోపిడీ చరిత్ర ప్రజలకు తెలీంది కాదు..
- రాయలసీమ అభివృద్ధికి కూటమి చిత్తశుద్ధితో కృషి
- టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్
మంగళగిరి (చైతన్య రథం): రాయలసీమ ప్రజల దశాబ్దాల కల అయిన కడప ఉక్కు కర్మాగారం నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం కార్యరూపంలోకి తీసుకెళ్తుందని, గతంలో శంకుస్థాపనలకే పరిమితమైన ఈ ప్రాజెక్టును ఇప్పుడు నిర్మాణ దశలోకి తీసుకువెళ్లడం ద్వారా రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ తెలిపారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, రాయలసీమ ప్రజల సెంటిమెంట్‌తో కోట్లు దండుకున్న జగన్ మోహన్ రెడ్డికి ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని దుయ్యబట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “రాయలసీమలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. తాగునీరు లేదు, సాగునీరు లేదు. ప్రధాన జీవనోపాధి అయిన పశుపోషణకు కూడా మేత లేక ప్రజలు వలసల బాట పట్టేవారు. ఆకలి కడుపులతో, పొట్ట చేత పట్టుకుని ఏదొక ఊరెళ్లి కూలి పని చేసుకొని బతుకుదామనే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితులను మార్చాలని సంకల్పించిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయనకి రాయలసీమ ప్రాంతం అంటే అపారమైన ప్రేమ ఉండేది. అక్కడి ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగు గంగా, వెలిగొండ వంటి అనేక సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు కూడా రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రధాన అవరోధంగా ఉన్నాయని గుర్తించారు. రాయలసీమను పరిశ్రమల కేంద్రంగా మార్చి యువతకు ఉపాధి కల్పిస్తే ఫ్యాక్షనిజం నుంచి యువతను దూరం చేయవచ్చని కృషి చేసిన వ్యక్తి చంద్రబాబు. రాయలసీమలో ఉక్కు కర్మాగారం నిర్మించి యువతకు ఉపాధి కల్పించాలని ఆకాంక్షించారు” అని అన్నారు.
ఉక్కు కర్మాగారం పేరుతో వైఎస్ ఫ్యామిలీ దోపిడీ పర్వం
“2007లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కడప స్టీల్ ప్లాంట్‌కు బ్రాహ్మణీ స్టీల్ పేరుతో శంకుస్థాపన చేశారు. బ్రాహ్మణీ స్టీల్స్‌కు భూములు కేటాయించారు. అయితే ప్లాంట్‌కు అవసరమైన ముడిసరుకు పేరుతో బళ్లారిలోని ఐరన్ ఓర్ గనులను గాలి జనార్దన్ రెడ్డికి కేటాయించారు. ఆ రోజు కడపలో ఇచ్చిన దాదాపు పది వేల ఎకరాల భూములు ఇప్పటికీ వివాదాల్లోనే ఉన్నాయి. సీబీఐ కేసులు కూడా నడుస్తున్నాయి. బళ్లారిలో ఐరన్ ఓర్ పేరుతో అక్కడి ఖనిజ సంపదను విదేశాలకు తరలించి వేల కోట్లు సంపాదించారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేటాయించిన 4 వేల ఎకరాలను తాకట్టు పెట్టారు. అక్కడ ఐరన్ ఓర్‌ను దోచుకున్నారు. రెడ్ గోల్డ్ ఎంటర్‌ప్రైజెస్, ఆరఆర్ ఎంటర్‌ప్రైజెస్ వంటి కంపెనీల ద్వారా వేల కోట్ల రూపాయలు తీసుకుని, అందులో రూ.74 కోట్లను సాక్షి సంస్థలకు మళ్లించి సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఏర్పాటు చేసిన చరిత్ర జగన్ మోహన్ రెడ్డిదే. వైఎస్ ఫ్యామిలీ కోట్లు అయితే దండుకున్నారు కానీ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఒక తట్ట మట్టి కూడా పోయలేదు. ముడిసరుకు లేదు, ఫీజిబిలిటీ లేదు అంటూ సెయిల్ (SAIL) అభ్యంతరాలు వ్యక్తం చేసినా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2018 డిసెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు” అని తెలిపారు.
జగన్‌రెడ్డిది నయవంచన.. నమ్మక ద్రోహం
“కడపలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించి యువతకు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి 2019 డిసెంబర్ 20న మరోసారి శంకుస్థాపన చేశాడు. మూడు సంవత్సరాల్లో ఫ్యాక్టరీ పూర్తవుతుందని, స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి మూడేళ్లపాటు ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. ఒక్క ఫ్యాక్టరీ భవనం నిర్మించలేదు. కనీసం ఒక కాంపౌండ్ వాల్ కూడా నిర్మించలేదు. మూడేళ్ల తర్వాత 2023 ఫిబ్రవరిలో సున్నపురాళ్లపల్లె వద్ద మరోసారి శంకుస్థాపన చేశారు. ఒకే ప్రాజెక్టుకు రెండుసార్లు శంకుస్థాపన చేసి ప్రజలను మోసం చేయాలని చూశాడు. ఐదేళ్లలో రెండుసార్లు శంకుస్థాపనలు చేసి కనీసం ప్రహారీ గోడ కూడా కట్టని రాయలసీమ ద్రోహి జగన్ మోహన్ రెడ్డి. తండ్రి ఒకసారి, తనయుడు రెండుసార్లు శంకుస్థాపనలు చేసి రాయలసీమ ప్రజలను ముచ్చటగా మూడుసార్లు మోసం చేయాలని ప్రయత్నించిన గొడ్డలి పార్టీ నేడు నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది. దశాబ్దాల పాటు జగన్‌ను, అతని తండ్రిని నమ్మి, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చేసిన కడప జిల్లా ప్రజలపై కనీస కృతజ్ఞత కూడా లేకుండా వారి ఆశలను వమ్ము చేసి కోట్లు దండుకున్నారు. ప్రజల సెంటిమెంట్‌ను రాజకీయంగా ఉపయోగించుకున్నారు కానీ వారి ఉక్కు కర్మాగారం ఆకాంక్షను మాత్రం సాకారం చేయలేదు. జగన్‌కు కృతజ్ఞత అనేది ఉంటే సీమ ప్రజలకు మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలి. దశాబ్దాలుగా ఆదరించిన ఈ ప్రాంత ప్రజలకు నిజం చెప్పండి” అని డిమాండ్ చేశారు.
రాయలసీమపై జగన్ రెడ్డి కపట ప్రేమ
“రాయలసీమ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఎవరిది? నిజంగా ఈ ప్రాంతంపై ప్రేమ ఉంటే, గత ఐదేళ్లలో రాయలసీమ కోసం ఏమి చేశారో ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రజల దీర్ఘకాల పోరాటాల ఫలితంగా సాధించబడిందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కడప ఉక్కు పరిశ్రమ విషయంలో గత ప్రభుత్వం చేసింది పోరాటం కాదు.. శంకుస్థాపనల పేరుతో ప్రచారం, భూముల కేటాయింపుల పేరుతో దోపిడీలు, ఐరన్ ఓర్ పేరుతో అవినీతి. ఐదేళ్ల పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా కాలం గడిపింది. కూటమి ప్రభుత్వం మాత్రం కడప ఉక్కు పరిశ్రమను రాయలసీమ హక్కుగా భావించి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణ పనులను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి, వచ్చే ఎన్నికలకు ముందే ప్రజలకు అంకితం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఐదేళ్లపాటు పనులు ప్రారంభించలేకపోయిన వారు, ఇప్పుడు నిర్మాణం మొదలైతే దానికి కూడా తమదే క్రెడిట్ అని చెప్పుకోవడం ఆశ్చర్యకరం. శవం ఎక్కడ కనబడితే అక్కడ వాలే రాబందుల్లా, క్రెడిట్ చోరీ కోసం ఎగబడేవారు కూడా గొడ్డలి పార్టీ నేతలే. ఇదే ధోరణి గతంలో కూడా కనిపించింది. కియా పరిశ్రమ వచ్చినా, అనంతపురం అభివృద్ధి జరిగినా, అన్నింటికీ తమదే క్రెడిట్ అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కడప ఉక్కు పరిశ్రమ విషయంలో కూడా అదే రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు. రాయలసీమకు తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తీసుకురావడంలో ఏ ప్రభుత్వం కృషి చేసిందో ప్రజలకు స్పష్టంగా తెలుసు. కియా, హీరో వంటి పరిశ్రమలు, కొత్త పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి చంద్రబాబు నాయకత్వంలో రాయలసీమ అభివృద్ధికి బలమైన పునాది వేశాయి. అందుకే రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడే ముందు, గత ఐదేళ్లలో ఎందుకు హామీలు నెరవేర్చలేకపోయారో, ఎందుకు కడప ఉక్కు పరిశ్రమను ముందుకు తీసుకెళ్లలేకపోయారో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. రాయలసీమకు జగన్ చేసింది ఒక్కటే… దోచుకోవడం. ప్రాజెక్టుల ముసుగులో దోపిడీ చేయడం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉక్కు నిర్మాణానికి కూటమి చర్యలు
“మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేశాం. అందులో భాగంగా నేడు కడపలో ఉక్కు కర్మాగారం పనులను పునఃప్రారంభించాం. ఫ్యాక్టరీకి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాం. మైలవరం డ్యామ్ నుంచి 2 టీఎంసీల పారిశ్రామిక నీటి కేటాయింపు చేశాం. రూ.40 కోట్ల వ్యయంతో జాతీయ రహదారి నుంచి స్టీల్ ప్లాంట్ వరకు 12 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని చేపట్టాం. కాంపౌండ్ వాల్ నిర్మాణం, 220 కేవీ విద్యుత్ సరఫరా, అంతర్గత రహదారులు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేసి నిర్మాణ పనులు ప్రారంభించాం. 2019లో జగన్ చేసింది శంకుస్థాపన మాత్రమే… నేడు మేము చేస్తున్నది నిర్మాణం. ఈ రెండింటి మధ్య తేడాను రాయలసీమ ప్రజలు స్పష్టంగా గుర్తించారు. మాకు క్రెడిట్ అవసరం లేదు. మాకు కావాల్సింది రాయలసీమ అభివృద్ధి… రాయలసీమ యువతకు ఉద్యోగాలు… ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో మార్పు” అని అన్నారు.
















