- దేశానికే ఆదర్శంగా ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు
- ఆయన స్ఫూర్తితో సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా చంద్రబాబు పాలన
- యువనేత లోకేష్ యువగళం పాదయాత్రతోనే కూటమికి అధికారం
- టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు
పాలకొల్లు (చైతన్యరథం): తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లో అధికారంలోకి తీసుకువచ్చిన స్వర్గీయ నందమూరి తారక రామారావు దేశానికే ఆదర్శనీయులు అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కొనియాడారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని గాంధీ బొమ్మల సెంటరులో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి రామానాయుడు ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ హాస్పిటల్‌లో రోగులకు, సిబ్బందికి పండ్లు, రొట్టెలు, పాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలుగుజాతికి పెద్ద పండుగలైన సంక్రాంతి, క్రిస్ట్‌మస్, రంజాన్ స్థాయిలో తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ పండుగ వేడుకలు రాష్ట్రంతో పాటు తెలుగువారు ఉన్న ప్రతిచోట ఘనంగా జరుగుతున్నాయన్నారు. నాడు ఎన్టీఆర్ అమలు జరిపిన సంక్షేమ పథకాలు నేడు ప్రపంచమంతా ఆదర్శంగా నిలిచాయని, నిరుపేదలు ఆర్ధికంగా ఎదిగి సమాజంలో గౌరవంగా జీవించే అవకాశం కలిగిందని అన్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు ఏర్పాటుచేసి చైర్మన్‌గా వ్యవహరించిన అన్న ఎన్టీఆర్ దేశానికే ఆదర్శనీయులు అయ్యారని మంత్రి రామానాయుడు అన్నారు.
సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్
ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు, సంస్కరణలతో ప్రజాపాలన సాగిస్తున్నారన్నారు. చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిపోయేలా అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. రెండు రూపాయలు కిలో బియ్యం, వెనుకబడిన తరగతులకు రాజకీయ రిజర్వేషన్లు, పక్కాఇండ్లు, పింఛన్లు, దీపం పథకం, డ్వాక్రా సంఘాలు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, తదితర సంస్కరణలు అమలు చేసిన ఘనత టీడీపీదేనన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు విజన్ 2020 అంటే ఆ రోజు ప్రతిపక్ష నాయకులు హేళన చేశారని. ఆ విజన్ నేడు సాకారమై సైబరాబాద్ రూపంలో కళ్లముందు నిలిచిందన్నారు. పక్క రాష్ట్రాలకు వెళ్ళనవసరం లేకుండా లక్షలాది యువతీ, యువకులు సాఫ్ట్‌వేర్ రంగంలో లక్షలాది రూపాయల వేతనాలతో సైబరాబాద్‌లో రాణిస్తున్నారన్నారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా కోటి సభ్యత్వాల నమోదుతో టీడీపీ రికార్డు సష్టించిందన్నారు. కార్యకర్తలకు బీమా పథకం వర్తింప చేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారానే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, రాష్ట్ర యువతీ యువకుల భవిషత్తు కోసం నిరంతరం ఆలోచనలు చేసే వ్యక్తి లోకేష్ అన్నారు. సమాజమే దేవాలయం`ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో పేదలు, బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల సంక్షేమ పథకాలకు నాంది పలికిన ప్రజాపార్టీ టీడీపీ అన్నారు. చంద్రబాబు ఆనాడు విజన్ 2020తో ప్రగతి సాధించారని, నేడు విజన్ 2047 లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని మంత్రి రామానాయుడు అన్నారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ సభ్యుడు అంగర రామ్మోహన్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.ఓ రవికుమార్, వైద్యాధికారులు, నాయకులు గండేటి వెంకటేశ్వర రావు, పెచ్చేట్టి బాబు, ఉన్నమట్ల కబర్థి, కోడి విజయభాస్కర్, జక్కంపూడి కుమార్, కర్నేని రోజారమణి, కర్నేని గౌరునాయుడు, మామిడిశెట్టి పెద్దిరాజు, పాలవలస తులసీరావు, ధనాని సూర్యప్రకాష్, బందెల భాస్కరరావు, పాముల రజినీకుమార్, షేక్ శిలార్, సల్మాన్ భాజీ, మల్లంపల్లి పకీరుబాబు,వట్టం గణేష్, బోనం నాని, చినమిల్లి గణపతిరావు, అందే కోటివీరభద్రం, పీతల శ్రీనివాసు, హాస్పిటల్ సిబ్బంది, రోగులు వారి బంధువులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.