- నాడు పెన్షన్ల పేరుతో వైసీపీ దారుణంగా దగా చేసింది
- ఎన్టీఆర్ పింఛనును బలోపేతం చేసింది చంద్రబాబే
- గొడ్డలి పార్టీ హయాంలో లక్షలాదిమందికి అన్యాయం
- రాష్ట్రంలో 62 లక్షలమందికి పింఛన్ల పంపిణీ
- ప్రతి నెలా రూ.2.7 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
- టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్
మంగళగిరి (చైతన్య రథం): గత వైసీపీ ప్రభుత్వం పింఛన్ల పేరిట ప్రజలను మోసం చేసిందని, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుని లబ్ధిదారులకు న్యాయం చేస్తోందని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ పేర్కొన్నారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో సామాజిక పింఛన్ల చరిత్ర, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు చేసిన పెంపుదల, గత ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను అప్పసాని వివరించారు.
ఎన్టీఆర్‌తో ప్రారంభమైన సామాజిక భద్రత
సామాజిక పెన్షన్లకు దేశంలోనే ఆద్యుడిగా నిలిచింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావేనని అప్పసాని రాజేష్ గుర్తు చేశారు. వృద్ధాప్యం కుటుంబాలకు భారంగా మారకూడదనే ఉద్దేశంతో నెలకు రూ.30 చొప్పున వృద్ధాప్య పింఛను ప్రారంభించారన్నారు. కుటుంబ యజమానిని కోల్పోయిన వితంతువులకూ భరోసా కల్పించేందుకు వితంతు పింఛను ప్రవేశపెట్టారన్నారు. అప్పటినుంచి సామాజిక బాధ్యతగా భావిస్తూ తెలుగుదేశం పార్టీ పెన్షన్ వ్యవస్థను నిరంతరం బలోపేతం చేస్తూ వచ్చిందన్నారు. 1995నుంచి 2004 మధ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రూ.30 పెన్షన్‌ను రూ.75కు పెంచారని గుర్తు చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం దానిని రూ.200కు పెంచిందని, రాష్ట్ర విభజన అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు అప్పటివరకు ఉన్న రూ.200 పెన్షన్‌ను ఒకేసారి రూ.1000కు పెంచి దేశంలోనే రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. అనంతరం అదే పదవీకాలంలో మరోసారి పెంచి రూ.2000కు చేర్చారని గుర్తు చేశారు. వికలాంగుల పెన్షన్‌ను రూ.500నుంచి రూ.1500కు, తర్వాత రూ.3000కు పెంచారన్నారు. ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, చేనేత కార్మికులు, కళాకారులు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు తదితర అనేక వర్గాలకు కొత్త పెన్షన్లు ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
జగన్ హామీ ఇచ్చి మాట తప్పారు
2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌రెడ్డి అధికారంలోకి వస్తే పెన్షన్‌ను రూ.3000కు పెంచుతానని హామీ ఇచ్చారని అప్పసాని రాజేష్ గుర్తు చేశారు. ప్రజలు ఒకేసారి పెంపు ఉంటుందని ఆశించినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని మార్చి ప్రతి ఏడాది రూ.250 చొప్పున నాలుగు విడతల్లో పెంచే విధానాన్ని అవలంబించారని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రజల్లో పెంచిన అంచనాలను అధికారంలోకి వచ్చిన తర్వాత దెబ్బతీశారని ఆరోపించారు. కరోనా రెండో దశ సమయంలో ప్రజలు ఇంటివద్దే ఉండాల్సిన పరిస్థితుల్లో విద్యుత్ వినియోగం పెరిగిందని, ఆ పరిస్థితిని సాకుగా చూపిస్తూ 300 యూనిట్లకుపైగా విద్యుత్ వినియోగించిన కుటుంబాల పేరుతో సుమారు ఏడు లక్షల పెన్షన్లను గత ప్రభుత్వం తొలగించిందని గుర్తు చేశారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. తెలుగుదేశం హయాంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా తదుపరి నెలల్లో కలిపి పొందే అవకాశం ఉండేదని గుర్తుచేస్తూ.. వైసీపీ ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేసి.. సంబంధిత నెలలో తీసుకోని పెన్షన్ మొత్తాన్ని పూర్తిగా రద్దు చేసే విధానాన్ని అమలు చేసిందని దుయ్యబట్టారు. వాలంటీర్ వ్యవస్థ పేరుతో ప్రచారం చేసుకున్నప్పటికీ, లబ్ధిదారులకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు.
19 రోజుల్లో హామీ అమలు చేసిన కూటమి ప్రభుత్వం
2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల హామీని అమలు చేసిందని ఆయన తెలిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన 19 రోజుల్లోనే వృద్ధాప్య, వితంతు పెన్షన్లను రూ.3000 నుంచి రూ.4000కు పెంచడమే కాకుండా, ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలను కూడా కలిపి ఒక్కో లబ్ధిదారునికి రూ.7000 చెల్లించిందని పేర్కొన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులకు రూ.4000 చొప్పున పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. వికలాంగులకు రూ.6000, 85 శాతం కంటే ఎక్కువ వైకల్యంతో మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేల పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. కిడ్నీ డయాలసిస్ రోగులకు రూ.10 వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ప్రతి నెల రూ.2700 కోట్లకు పైగా పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న సామాజిక పెన్షన్ల ద్వారా సుమారు 62 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని అప్పసాని రాజేష్ తెలిపారు. గత రెండు సంవత్సరాల్లోనే రూ.68,597 కోట్లను పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం వ్యయం చేసిందన్నారు. ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం నుంచే సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందజేయడం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.
కొత్త పెన్షన్ల మంజూరుకు సిద్ధం :
కొత్త వితంతు పెన్షన్లు, 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అర్హులైన వృద్ధులకు పెన్షన్ల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారని రాజేష్ స్పష్టం చేశారు. వచ్చే నెలనుంచి మరో రెండు లక్షల వరకు కొత్త వితంతు పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు.
ఎన్టీఆర్ భరోసా ప్రజలకు ఆత్మవిశ్వాసం
సామాజిక పెన్షన్‌ను ఒక సంక్షేమ పథకంగా మాత్రమే కాకుండా సమాజంపట్ల ప్రభుత్వ బాధ్యతగా తెలుగుదేశం భావిస్తోందని అప్పసాని రాజేష్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వేల కోట్ల రూపాయలు వెచ్చించి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. ప్రతి నెల అందుతున్న “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ వల్ల లబ్ధిదారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని, వృద్ధాప్యం, వైకల్యం, ఒంటరితనం వారికి భారంగా కాకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
















