- పట్టుదలకు, అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం
- వేలాదిమందికి ఉపాధి కల్పించిన కల్పవృక్షం
- తెలుగుభాష అభ్యున్నతికి ఎంతగానో కృషిచేసిన మహనీయుడు
- రామోజీకి టీడీపీ నేతల ఘన నివాళి
అమరావతి(చైతన్యరథం): అలుపెరగని కృషి, పట్టుదల, అంకితభావం, అకుంఠిత దీక్షకు రామోజీరావు పెట్టింది పేరని టీడీపీ నేతలు కొనియాడారు. వేలాదిమందికి ఉపాధి కల్పించిన కల్పవృక్షం రామోజీ అన్నారు. తెలుగుభాష అభ్యున్నతికి ఎంతోగానో కృషిచేసిన మహనీయుడు అని శ్లాఘించారు. ఆయన మృతి యావత్ తెలుగు ప్రజలు, పత్రికా రంగానికే తీరని లోటన్నారు.
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం రామోజీ చిత్రపటానికి నివాళులు అర్పించిన టీడీపీ నేతలు ఆయన సేవలను కొనియాడారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, నక్క ఆనంద్‌బాబు, బొండా ఉమామహేశ్వరరావు, శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్‌బాబు, దువ్వారపు రామారావు, శాసనసభ్యులు కొండ్రు మురళి, దాట్ల సుబ్బరాజు, ఎమ్మెస్ రాజు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, పార్టీ నాయకులు లింగారెడ్డి, ఏవి రమణ, ధారునాయక్, ఆనంద్ సూర్య, అఖిల్, హసన్ భాష, కృష్ణ, బుచ్చి రాంప్రసాద్, వద్దులూరి వెంకటేశ్వరరావు, శంకర్ నాయుడు, పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితరులు ఘన నివాళులు అర్పించారు.
చివరి శ్వాస వరకు సమాజ హితం కోసమే: అచ్చెన్నాయుడు
ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చెరుకూరి రామోజీరావు మృతి తనను వ్యక్తిగతంగా చాలా కలచివేసిందన్నారు. రామోజీరావు మరణంతో యావత్ తెలుగుజాతికి, దేశానికి తీరని నష్టం జరిగింది. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి, అసామాన్యమైన వ్యక్తిగా ఎదిగన ఘనత రామోజీరావుకే చెందుతుంది. నమ్మిన సిద్ధాంతం కోసం నిబద్ధతతో, అంకితభావంతో పనిచేసిన వ్యక్తి రామోజీ. ఎన్నో ఆటు పోట్లు, అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ నమ్మిన సిద్ధాంతాలను వదలకుండా చివరి శ్వాస వరకు సమాజం హితం కోసం పనిచేసిన వ్యక్తి రామోజీరావు. వ్యాపార రంగంలోగాని, పత్రికా రంగంలోగాని, సినీ రంగంలోగాని.. ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగానికే వన్నె తెచ్చారు. వ్యాపార రంగంలో, పత్రిక ఏర్పాటుతో లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన మహోన్నత వ్యక్తి. పత్రికల గురించి ఎవరికీ తెలియని రోజుల్లో ఈనాడు పత్రిక పెట్టడమే కాకుండా ఆ పేపరును తెల్లారుజామున ఐదు గంటలకే మారుమూల గ్రామాలకు పంపి తాజా వార్తలను తెలియజేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు. ఎన్నో టీవీలు, ఛానల్స్ వచ్చినా ఈటీవీని ఒక ప్రామాణికంగా, ఆదర్శంగా తీర్చి దిద్దారు. వైసీపీ పాలనలో ఆయనను అనేక ఇబ్బందులు పెట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిజాలను నిర్భయంగా రాసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్ర గౌరవాన్ని నిలబెట్టేందుకు రామోజీరావు కృషి చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో రామోజీరావు చిత్రపటాలు పెట్టి నివాళి అర్పించాలని నిర్ణయించాం. ఈ మేరకు రాష్ట్ర పార్టీ తరఫున ఆదేశాలు జారీచేశామని అచ్చెన్నాయుడు చెప్పారు.
రామోజీ సేవలు మరువలేనివి: వర్ల
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ 1936తో కృష్ణా జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి నేడు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న చెరుకూరి రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు అన్నారు.. పత్రికారంగంలోగాని, సినీరంగంలో గాని ఆయపేరు సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. మొదటినుండీ ఆధునిక భావాలతో ప్రపంచీకరణకు కృషి చేసిన మహానుభావుడు. ఈనాడు పత్రిక పత్రికారంగానికే తలమానికం. ఈనాడు మీడియా ద్వారా నిజాలను నిర్భయంగా ప్రసారం చేసి సమాజాన్ని చైతన్యం చేశారు. ఈనాడు ముందడుగు ద్వారా సమాచార హక్కు చట్టాన్ని సామాన్యులకు చేరువ చేశారు. సుజలాం, సుఫలాం అంటూ పరిశుభ్రత కోసం ఊరూవాడా చైతన్యం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. తెలుగుజాతికి ఆయన సేవలు మరువలేనిదని వర్ల కొనియాడారు.
తెలుగుజాతికి గర్వ కారణం: బొండా
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు జాతికి గర్వకారణమైన వ్యక్తి రామోజీరావు అన్నారు. ఎంతో చిన్న కుటుంబంలో పుట్టినా తన రెక్కల కష్టంతో పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి రామోజీరావు. విలువలకు పట్టంకట్టి, విలువలకు ప్రాధన్యతను ఇచ్చే ఈటీవీ, ఈనాడు పత్రికలను ఏర్పాటు చేసి తెలుగువారి ఖ్యాతిని దశదిశలా వ్యాపించిన వ్యక్తి నేడు లేకపోవడం తెలుగు జాతికి పూడ్చలేని లోటు. మా నాయకుడు చంద్రబాబు ఢల్లీినుండి హుటాహుటీన వచ్చి రామోజీ భౌతిక కాయానికి నివాళులర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలందరం ఘన నివాళి అర్పిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని బొండా కోరుకున్నారు.