తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు అయినా ఇప్పటికీ నిత్య యవ్వనంగానే వున్నది. అందుకు ఏడుపదుల పైబడిన వయస్సులోనూ నవయువకుడిలా పార్టీని పరుగులు పెట్టిస్తున్న అధినేత చంద్రబాబు నాయుడు ఒక కారణమైతే, ప్రజాక్షేత్రంలో సరికొత్త రాజకీయానికి నాందిపలికి తెలుగుజాతి భవిష్యత్ కు భరోసా గా నిలిచిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో కారణం. దేశ రాజకీయ యవనికపై తెలుగుదేశం పార్టీని అజరామరం చేసేందుకు వారిరువురూ నిర్విరామ కృషి జరుపుతున్నారు. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలలో నే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగుజాతి ఒక్కసారిగా మేల్కొంది. తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తోనే తెలుగుజాతి ఔన్నత్యం పదికాలాల పాటు మనగలుగుతుందన్న భావన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తం అవుతున్నది.
తెలంగాణ లో తెలుగుదేశం కు స్థానమే లేదని హేళన చేసిన పార్టీలు, నాయకులకు పార్టీ శ్రేణులు గట్టిగానే బదులిచ్చాయి. ఖమ్మం లో జరిగిన సభ నుంచి హైదరాబాద్ లో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వరకు హాజరైన ప్రజాసమూహమే అందుకు సరైన సమాధానం. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అధికారపీఠానికి అడుగు దూరంలో నిలిచిన తెలుగుదేశం తెలంగాణ లోనూ అదే జోరు కనబరుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోనూ తెలంగాణతో పాటే ముందస్తు ఎన్నికలు జరగగలవన్న ఊహాగానాల నేపథ్యంలో పార్టీ శ్రేణులు సన్నద్ధంగా వున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఆ దిశగా మార్గనిర్దేశనం చేశారు. అధికార పార్టీ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు టిడిపి శ్రేణులతో పాటు సామాన్య ప్రజానీకం సైతం ఆతృతతో ఎదురుచూస్తున్న వాతావరణం కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే బాదుడే బాదుడు కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రజలలో అవగాహన కలిగించారు. అనంతరం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం పురివిప్పింది. తెలంగాణ లోనూ ప్రస్తుతం ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం కొనసాగుతున్నది. టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ లోని టిడిపి శ్రేణులు గడపగడపకూ వివరిస్తున్నాయి. ఇదే సమయంలో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ రెండు కార్యక్రమాలకు తెలంగాణలో అద్భుత స్పందన లభిస్తోంది. ఈ పరిణామంతో ఇప్పటివరకు అంతగా క్రియాశీలంగా లేని నాయకులు, కార్యకర్తలు సైతం పసుపు పతాక చేబూని ప్రజాక్షేత్రంలోకి అడుగిడారు. టిడిపి శ్రేణుల్లో పట్టుదల, పోరాట పటిమ రెండు రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.