- ఆవిర్భవించిన తొమ్మిది నెలల్లోనే అధికారం ఒక రికార్డు
- పలు సంస్కరణలకు నాంది పలికిన పార్టీ
- ఆటుపోట్లు ఎదుర్కొని పార్టీని నిలబెట్టిన చంద్రబాబు
- పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర
అనకాపల్లి (చైతన్యరథం): దివంగత ఎన్టీఆర్ 43 సంవత్సరాల క్రితం చిన్న వేదికలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నేడు మహా ప్రభంజనంలా మారి, తెలుగువారి కీర్తి పతాకగా నిలిచిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సయిజ్ శాఖల మంత్రి, అనకాపల్లి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనకాపల్లి టీడీపీ కార్యాలయంలో శనివారం టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం పార్టీ ఆవరణలో ఏర్పాటు చేసిన పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. నాది హ్యుమానిజం (మానవత్వం) అని ప్రకటించిన చరిత్ర ఎన్టీఆర్ సొంతం అన్నారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అని నినదించిన మహనీయుడు ఎన్టీఆర్. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం సొంతం చేసుకున్న ఘనత టీడీపీకి మాత్రమే సొంతం అని మంత్రి రవీంద్ర అన్నారు.
పలు సంస్కరణలు
అధికారంలోకి రాగానే సంక్షేమానికి పునాది వేసి, రూ. 2కే కిలో బియ్యం, అందరికీ ఇల్లు, పలు విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. బలహీన వర్గాల కోసం, మహిళల కోసం తొలిసారి ఆలోచించారు. మహిళలకు ఆస్తి హక్కు, విద్యా హక్కు కల్పించారు పార్టీ కార్యకర్తలను నిర్మాణాత్మకంగా మార్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుంది. క్రమం తప్పకుండా పార్టీకి సంస్థాగత ఎన్నికలు టీడీపీలో మాత్రమే జరుగుతున్నాయి. ఆ నిర్ణయాలకు అనుగుణంగా పనులు చేసేలా అడుగులు వేస్తున్నాం. కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన ఘనత టీడీపీది. కోటి సభ్యత్వాలతో రికార్డు సృష్టించామని మంత్రి రవీంద్ర అన్నారు.
పార్టీని నిలబెట్టిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు ఎన్నో కుట్రలు చేసినా.. చంద్రబాబు పోరాడి పార్టీని నిలబెట్టారు. విభజనతో రాష్ట్రం నష్టపోయినా.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో గత పాలకులు ప్రజల్ని విడదీసేందుకు ప్రయత్నించినా.. చంద్రబాబు ప్రజల్ని ఏకం చేశారు. ఫలితంగానే గతంలో ఎన్నడూ లేని మెజారిటీ కూటమి పార్టీలకు అందించారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెన్షన్ మొత్తాన్ని రూ.4000కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. ఇళ్ళ స్థలాల పేరుతో జగన్ దోచుకుంటే మనం అభివృద్ధి చేస్తున్నాం. భూ భక్షణ చట్టంతో ప్రజల భూముల్ని దోచుకోవడానికి జగన్ కుట్రలు చేస్తే… కూటమి ప్రభుత్వం దాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తుల్ని కాపాడిరది. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను నాడు జగన్ రెడ్డి నాశనం చేశాడు. కూటమి రాగానే మళ్లీ తెరిచాం. పేదరికం లేని రాష్ట్రం లక్ష్యంగా పీ 4 విధానానికి శ్రీకారం చుట్టాం. ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా ఇవ్వాలని.. డ్రామాలాడుతూ ప్రజలను జగన్‌రెడ్డి గాలికి వదిలేశారు. స్కాంలు బయటకు వస్తాయనే భయంతో అసెంబ్లీకి రాకుండా పారిపోయారు. నిన్నటి వరకు పార్టీలో ఉన్న విజయసాయి రెడ్డి మొత్తం కుంభకోణాలు బయట పెట్టాడు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్లమెంట్ సాక్షిగా జగన్ దోపిడీని వివరించారు. తప్పు చేసి నేడు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నాడు బూతులు మాట్లాడి.. నేడు వణుకుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుండి కూడా ఒక పారిశ్రామిక వేత్తను తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. టీడీపీ ప్రజలకు అండగా ఉంటుంది.. తెలుగు వారి ఖ్యాతిని కాపాడుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.