- 14సార్లు డీఎస్సీ నిర్వహించిన ఘనత టీడీపీదే
- 1.96 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాం
- ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన పదో తరగతి ఉత్తీర్ణత శాతం
- బ్రాహ్మణ నిరుద్యోగ యువత డీఎస్సీ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
మంగళగిరి:విద్యతోనే వికాసం సాధ్యమని బలంగా నమ్మిన తెలుగుదేశం పార్టీ దశాబ్దాలుగా నిరుద్యోగుల కన్నీళ్లు తుడుస్తూ కొలువుల కల్పనకు పెద్దపీట వేస్తోందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ స్పష్టం చేశారు. నేడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ …రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో 14 సార్లు డీఎస్సీ నిర్వహించిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని, ఇప్పటివరకు సుమారు 1.96 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ కొలువులు అందించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిదని కొనియాడారు. విద్య ఉంటేనే వికాసం, కొలువులు ఉంటేనే ఉపాధి సాధ్యమని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతోందని తెలిపారు.
నారా లోకేష్ గారు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక ఫలితాలు కనిపిస్తున్నాయని బుచ్చి రాంప్రసాద్ పేర్కొన్నారు. గతంలో 72 శాతంగా ఉన్న ప్రభుత్వ బడుల పదో తరగతి ఉత్తీర్ణత శాతం నేడు ఏకంగా 76 నుంచి 78 శాతానికి పెరిగిందని వివరించారు. గత పాలకుల హయాంలో కార్పొరేట్ విద్యాసంస్థల ఫలితాలే ప్రముఖంగా ప్రచారమయ్యేవని, కానీ నేడు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని పత్రికల్లో ముఖచిత్రంగా రావడం విద్యావ్యవస్థలో వచ్చిన మార్పునకు నిదర్శనమన్నారు. విద్యార్థులే విద్యా వ్యవస్థకు పట్టుకొమ్మలని నమ్మిన మంత్రి లోకేష్ గారు ప్రభుత్వ బడులను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు.
చదువుతో పాటు విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. తల్లిదండ్రులను గౌరవించడం, గురువుల పాదపూజ చేయడం వంటి భారతీయ సనాతన సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ లోకేష్ గారు స్వయంగా ఆచరించి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని భాగస్వామిగా చేసుకొని విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, సంస్కారం, బాధ్యతాయుత ప్రవర్తనపై ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేశారని గుర్తుచేశారు. గత వైసీపీ పాలనలో విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాల బారిన పడే దౌర్భాగ్య పరిస్థితులు దాపురిస్తే, కూటమి ప్రభుత్వం ఆ దురాచారాలను అరికట్టి విద్యార్థుల్లో సంస్కారాన్ని, నైతిక విలువలను నేర్పుతోందని తెలిపారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి 25 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మంత్రి లోకేష్ పరిశ్రమలను రప్పిస్తూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని బ్రాహ్మణ నిరుద్యోగ యువత ప్రభుత్వం క్రమం తప్పకుండా విడుదల చేస్తున్న జాబ్ క్యాలెండర్, డీఎస్సీ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని బుచ్చి రాంప్రసాద్ ప్రత్యేక పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే బ్రాహ్మణ అభ్యర్థులకు అవసరమైన ఉచిత శిక్షణ తరగతులు, స్టడీ మెటీరియల్, సమగ్ర మార్గదర్శకత్వాన్ని బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువత తమకు కావాల్సిన సహాయ సహకారాల కోసం బ్రాహ్మణ కార్పొరేషన్ను సంప్రదించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు అర్హులైన బ్రాహ్మణ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సాధించేలా కార్పొరేషన్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని, అవసరమైన వారు బ్రాహ్మణ కార్పొరేషన న్ను సంప్రదించాలని ఆయన కోరారు.













