పార్టనర్ షిప్ సమ్మిట్‌లో పెట్టుబడులపై ఏపీ దృష్టి
ఆ మేరకు పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలకు సన్నద్ధం
45 దేశాల నుంచి 300మంది ప్రతినిధులు రాక..
డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్‌వల్లే రాష్ట్రానికి భారీ పరిశ్రమలు
నవంబర్‌లో పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ సన్నాహకాలపై మంత్రి లోకేష్ సమీక్ష
అమరావతి (చైతన్య రథం): ‘‘విశాఖపట్నంలో ఈనెల 14,15 తేదీల్లో పార్టనర్ షిప్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోన్నాం. సదస్సులో పెద్దఎత్తున పెట్టుబడి చర్చలు జరుగుతాయి. పారిశ్రామికవేత్తలతో పాటు పాలసీ మేకర్లు హాజరై రాబోయే పదేళ్లలో పారిశ్రామికరంగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అందులో భారత్, ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏమిటి? అనే అంశాలపై విస్తృతమైన చర్చలు జరుగుతాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల నారా లోకేష్ పేర్కొన్నారు. ఈనెల 14-15 తేదీల్లో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ `2025 సన్నాహక ఏర్పాట్లపై మంత్రి లోకేష్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎక్సైజ్, గనుల మంత్రి కొల్లు రవీంద్ర, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ… పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్, అశ్వనీ వైష్టవ్‌లాంటి కేంద్ర మంత్రులు హాజరు కానున్నారన్నారు. ‘‘ఇప్పటివరకు 45దేశాల నుంచి 300మంది వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు వస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. సమ్మిట్‌లో 12 మల్టీ లాటరల్ ఆర్గనైజేషన్స్, 72మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ పాల్గొంటారు. 48 స్పీకింగ్ సెషన్స్‌లో సెక్టార్లవారీగా వివిధ అంశాలపై విస్తృతంగా చర్చలు జరుపుతాం. ఈసారి పార్టనర్ షిప్ సమ్మిట్‌లో 410 ఎంవోయూలపై సంతకం చేయబోతున్నాం. వీటిద్వారా రూ.9.8లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5లక్షల ఉద్యోగావకాశాలు రాబోతున్నాయి’’ అని వెల్లడిరచారు.
యువగళంలోనే 20లక్షల ఉద్యోగాల హామీ
‘‘యువగళం పాదయాత్రలో రాష్ట్రవ్యాప్తంగా 3,132 కి.మీ.లు నడిచాను. పాదయాత్ర సమయంలో జీడి నెల్లూరు నియోజకవర్గం శివారులో మోహన అనే తల్లిని కలిశాను. బొండాలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఆమె భర్త మద్యానికి బలికాగా, కాయకష్టం చేసుకుని 30 ఏళ్లపాటు పిల్లలను పెంచి పెద్దచేసింది. తమ ఇద్దరి బిడ్డలకు ఉద్యోగాలిస్తే చాలని ఆ తల్లి కోరింది. హలో లోకేష్ కార్యక్రమంలో కూడా యువతకు ఉద్యోగాలు కల్పిస్తే సమాజంలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పాను. కూటమి ప్రభుత్వం వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడే హామీ ఇచ్చా. ఆ హామీని నెరవేర్చేందుకు మంత్రులందరం మిషన్ మోడ్‌లో పనిచేస్తున్నాం. కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులందరం కలసికట్టుగా పనిచేసి బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీలను తీసుకువచ్చాం. దీనివల్ల గత 16నెలల్లో రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు తరలివచ్చాయి. సరైన ఎకోసిస్టమ్ లేకపోవడంవల్లే రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని గుర్తించాం. తెలుగువారు ప్రపంచాన్ని శాసిస్తున్నా.. వారు స్థానికంగా పనిచేయకపోవడానికి అదే ప్రధాన కారణం. అందువల్లే పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంపై దృష్టిపెట్టాం. ఫలితంగా గత 16నెలల్లో 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు (రూ.10లక్షల కోట్లు) ఏపీకి వచ్చాయి. అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ ద్వారా రూ.1.5లక్షల కోట్లు, దేశచరిత్రలో అతిపెద్ద ఎఫ్‌డీఐ గూగుల్ 15 బిలియన్ డాలర్లు, నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ లక్ష కోట్లు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ 1.25లక్షల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. డొమెస్టిక్ ఇన్వెస్టిమెంట్‌లోనే కాకుండా ఎఫ్‌డీఐలలో కూడా ఏపీ నెం.1గా నిలుస్తూ ముందుకు సాగుతోంది’’ అని వివరించారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాల వల్లే పరిశ్రమల రాక
‘‘ఆంధ్రప్రదేశ్ లో అవలంభిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్లే కంపెనీలు తమ పెట్టుబడులకు ఏపీని ఎంచుకుంటున్నాయి. పక్కరాష్ట్రాలు కూడా పోటీపడి ఇన్సెంటివ్స్ ఇస్తున్నా ఏపీ వైపు మొగ్గుచూపడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలే కారణం. టీసీఎస్, ప్రీమియర్ ఎనర్జీ, రెన్యూపవర్‌వంటి భారీ కంపెనీలు అందువల్లే క్యూకట్టాయి. ఏపీలో అద్భుతమైన సీ కోస్ట్ లైన్ ఉంది. గ్రాండ్ కానియన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన గండికోట ఉంది. సమర్థవంతమైన టాలెంట్ పూల్, పోర్టు లాజిస్టిక్ లింకేజి ఉంది. ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహిస్తున్నాం. పర్యాటక రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఏపీకి భారీఎత్తున పెట్టుబడులు రావడానికి మూడు ప్రధాన కారణాలున్నాయి. అందులో మొదటిది అనుభవం కలిగిన సమర్థ నాయకత్వమున్న ఏకైక రాష్ట్రం. చంద్రబాబులాంటి అనుభవం కలిగిన నేత మరే రాష్ట్రంలో లేరు. ఆయనకు నిరూపితమైన ట్రాక్ రికార్డు ఉంది. 1995లో ఆయన సీఎం అయిన దగ్గరనుండి ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఐఎస్‌బీ, సత్యం, కియావంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఆయన నేతృత్వంలోనే వచ్చాయి. చంద్రబాబు విజనరీ లీడర్ షిప్‌వల్లే పారిశ్రామిక ప్రగతి సాధ్యమైంది. గతంలో శంషాబాద్‌కు 5వేల ఎకరాలు ఎందుకు? అని ఎగతాళి చేశారు. ఈరోజు తెలంగాణ ఆదాయంలో 12శాతం ఆదాయం ఎయిర్ పోర్టువల్లే వస్తోంది. అటువంటి విజనరీ లీడర్ షిప్ ఈరోజు ఏపీకే సొంతం. 2వది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు మనకు మాత్రమే ఉంది. కేంద్రంలో ప్రధాని మోడీజీ, రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. వారి సమన్వయం వల్లే గూగుల్ లాంటి భారీ పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది. మోదీతోపాటు కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్ సహకరించారు. ఎన్‌ఎండీసీ స్లరీ పైప్ లైన్‌కు కేంద్రం అనుమతించడంతో ఆర్సెలర్ మిట్టల్ సంస్థ రాష్ట్రంలో లక్షన్నర కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. 3వది రాష్ట్రంలో అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు. దీనివల్లే పెద్దఎత్తున పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి’’ అని లోకేష్ వివరించారు.
అభివృద్ధి వికేంద్రీకరణే మా లక్ష్యం
‘‘రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి వికేంద్రీకరణ. క్లస్టర్ బేస్డ్ అభివృద్ధిపై దృష్టిసారించాం. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే మా ధ్యేయం. అందుకు అనుగుణంగానే అనంతపురం, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, ప్రకాశం జిల్లాలో సీబీజీ, నెల్లూరులో డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్, అమరావతిలో క్యాంటమ్ కంప్యూటింగ్, ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా, రిఫైనరీ, ఉత్తరాంధ్రలో ఫార్మా, మెడికల్ డివైస్, స్టీల్ సిటీ, డేటా సిటీలు ఏర్పాటవుతున్నాయి. ఇందుకు తగ్గట్లుగా ఆయా ప్రాంతాల్లో ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం. గూగుల్ గిగావాట్ డేటా సెంటర్, సిఫీ సంస్థ 500 మెగావాట్ల డాటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. మా టార్గెట్ రాష్ట్రంలో 6 గిగావాట్ల డాటా సెంటర్లు ఏర్పాటు చేయడం. అందుకు అవసరమైన గ్రీన్ ఎనర్జీ, ఎకో సిస్టమ్ తీసుకురావాల్సి ఉంది. వర్టికల్, హారిజంటల్ ఇంటిగ్రేషన్‌కు ప్రాధాన్యత నిస్తున్నాం. ఆస్ట్రేలియాకి వెళ్లివచ్చాక నాలుగు విదేశీ వర్సిటీలతో చర్చలు జరుపుతున్నాం. ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా పరిశోధనలకు జేమ్స్ కుక్ యూనివర్సిటీతో, స్పోర్ట్స్ అభివృద్ధికి గ్రిఫిత్ వర్సిటీతో చర్చలు జరుపుతున్నాం. సోలార్ సెల్, క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి కూడా ఇతర వర్సిటీలతో మాట్లాడుతున్నాం. ఈసారి మరింత వేగంగా అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యం. పార్టనర్ షిప్ సమ్మిట్‌లో 2.7లక్షల కోట్ల పెట్టుబడులు, 2.5లక్షల ఉద్యోగాలు కల్పించే సంస్థలకు భూమిపూజ చేయబోతున్నాం. ఈ సమ్మిట్ కేవలం ఒప్పందాల కోసమే కాదు.. ఏపీ యువత ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యం. ప్రముఖమైన అన్ని సెక్టార్లలో లీడర్‌షిప్ కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ డేటా సంస్థలు ఏపీకి వస్తున్నాయి, స్టీల్, అల్యూమినియం, ఏఐ, ఆగ్రిటెక్, డ్రోన్ తదితర అన్నిరంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలపాలన్నదే మా ధ్యేయం. విశాఖపట్నంలో నిర్వహించే కార్యక్రమాన్ని మేం త్రీవే పార్టనర్ షిప్‌గా భావిస్తున్నాం. ప్రభుత్వం, ప్రజలు, పారిశ్రామిక సంస్థలు కలిసికట్టుగా ముందుకు సాగితేనే ఆంధ్రప్రదేశ్ అగ్రపథాన పయనిస్తుంది. నిన్న కూడా ముంబయిలో అనేకమంది పారిశ్రామికవేత్తలను కలిశాను. ఇప్పుడు ప్రతిఒక్కరూ ఏపీవైపు చూస్తున్నారు. అయినా మేం సంతృప్తి చెందడం లేదు. అన్నిరంగాల్లో ఏపీని నెం.1 చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
	    	
 










