మనిషి మనుగడకు మూలస్తంభంగా నిలిచిన వాడు రైతు. నేలను దున్ని మట్టినుండి అన్నాన్ని బయటకు తీసిన తొలి శాస్త్రవేత్త రైతు. నాగటి చాళ్లలో దేశ భవితను చూపించిన తొలి దార్శనికుడు రైతు. తాను తింటూ పదిమందికి పెడుతూ అందరూ సుఖంగా బతకాలని కోరుకునే తొలి సమసమాజ సిద్ధాంతకర్త రైతు. దేశానికి అన్నంపెట్టె రైతును గౌరవంగా చూడాలని సాక్ష్యాత్తూ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పడం అందుకే. ఈ ఏడాది వ్యవసాయ బడ్జెట్‌లో రూ 48,340 కోట్లు కేటాయించి వ్యవసాయానికి పెద్దపీట వేసింది కూటమి ప్రభుత్వం. ఎన్నికల హామీలో భాగమైన అన్నదాత సుఖీభవ పథకం కోసం ఏటా రైతుకు రూ.20 వేల ఆర్థిక సాయం అందించేందుకు రూ.9,400 కోట్లు కేటాయించడం రైతులపట్ల చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగస్టు 2నుంచి ప్రారంభించి అన్నదాతకు అండగా నిలవ బోతున్నారు చంద్రబాబు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన విశిష్ట పథకం అన్నదాత సుఖీభవ. ఇది నేరుగా రైతు ఖాతాకు డబ్బు వేయడంవల్ల తక్షణ ఉపశమనం కలిగించడం, వ్యవసాయాన్ని లాభదాయకం చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే. రైతు కుటుంబాలకు తక్షణ ఆర్ధిక సాయం అందించడం, వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం ప్రధాన లక్ష్యం. ఈ పథకంతూ రైతుల సాగు ఖర్చులకు తక్షణ భరోసా కల్పించనున్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సుమారుగా 57 లక్షల రైతు కుటుంబాలకు ఏడాదికి రూ,20,000 ఆర్ధిక సాయం అందించనున్నారు.
అన్నదాత సుఖీభవ పథకం -రైతుకు ఆర్ధిక సహాయం మాత్రమే కాదు. గౌరవం, భరోసా ఇచ్చే పథకం. రైతు ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే చంద్రబాబు ధ్యేయం. సూపర్‌సిక్స్ హామీల్లో అత్యంత కీలకమైన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి రూ.20వేలను అర్హులైన రైతులకు ఇవ్వనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకొన్నది.అన్నదాత సుఖీభవ విశిష్ట పథకాన్ని ఆగస్టు 2 వ తేదీ నుండి అమలు చెయ్యనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌కు అనుసంధానంతో అమలు చెయ్యాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది..మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.7వేల వంతున నగదును రైతుల ఖాతాల్లో జమ చెయ్యనున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం పీఎం కిసాన్ పథ కం ద్వారా కేంద్రం ఏటా ఇచ్చే రూ.6వేలకు మరో రూ.7500 కలిపి రూ.13,500ను రైతు భరోసా పేరుతో ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.14వేలను ఇచ్చేందుకు అన్నదాత సుఖీభవ పథకం ప్రకటించింది. పీఎం కిసాన్‌తో అనుసంధానం చేసి కేంద్రం ద్వారా వచ్చే రూ.6వేలు కలిపి మొత్తం ఏడాదికి రూ.20వేలు ఇవ్వనున్నారు. కేంద్రం ఏడాదిలో మూడు విడతలుగా ఒక్కోసారి రూ.2వేల వంతున రైతుల ఖాతాల్లో జమ చేస్తుండగా. కూటమి ప్రభుత్వం కూడా రూ.14వేలను మూడు విడతలుగా అమలు చేసేందుకు ఆగస్టు 2నుంచి రైతులు ఖాతాల్లో జమ చేయనుంది. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం పెద్ద కసరత్తు చేసింది. వెబ్‌ల్యాండ్ ఆధారంగా మొత్తం రైతు కమతాలను గుర్తించి నిబంధనల ప్రకారం అర్హతను గుర్తించారు. ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు అకౌంట్లను ఈకేవైసీ చేయించారు. రైతు కష్టాన్ని అర్ధం చేసుకొని ఆర్ధిక సహాయం అందించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది కూటమి ప్రభుత్వం.
అట్లాగే రైతు పచ్చగా ఉంటేనే దేశం, రాష్ట్రం పచ్చగా ఉంటుందనేది సీఎం చంద్రబాబు నమ్మకం. అందుకే నేడు వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు తగ్గించి, దిగుబడులు పెంచేందుకు అత్యాధునిక వ్యవసాయ ఆవిష్కరణకు కృషి చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి సాగు రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఏఐ ద్వారా వ్యవసాయంలో ఖర్చులు తగ్గించి రైతులు ఆదాయాన్ని పెంచాలని ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చి లాభసాటి వ్యవసాయమే ధ్యేయంగా పనిచేస్తున్నారు చంద్రబాబు. వ్యవసాయరంగంలో సాంకేతిక విప్లవం సృష్టించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తునారు. వ్యవసాయ రంగం వినూత్న ఆలోచనలు, ఆధునిక పరిజ్ఞానం కోసం ఎదురు చూస్తోంది. పంటల ఉత్పత్తికి అవసరమైన ఖర్చును తగ్గించుకునేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తున్నారు. ఉత్పత్తి ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచే అత్యాధునిక వ్యవసాయం ఆవిష్కృతం కాబోతుంది ఆంధ్రప్రదేశ్‌లో. అన్ని రంగాలపైనా కృత్రిమ మేథ చూపుతున్న ప్రభావం సంక్షోభంలోవున్న వ్యవసాయ రంగంపైనా గణనీయంగా చూపబోతుంది. గిరాకీ ఆధారంగా సాగు పద్ధతుల మార్పు మొదలుకొని, విలువ ఆధారిత ఉత్పత్తులు, అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా ఎగుమతుల పెంపునకు ఎంతగానో ఉపకరిస్తుంది.
వ్యవసాయం వాణిజ్య దిశగా పయనిస్తోన్న తరుణంలో ఏఐ వినియోగం రైతులకు ఎంతో అవసరం. మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకుని సాగు ఎలా చేయాలి? పంటలకు ఏ పరిమాణంలో నీటిని అందించాలి? ఏ వనరులను వినియోగించి ఖర్చు తగ్గించుకోవచ్చు.
అధిక దిగుబడులు ఎలా సాధించవచ్చనే వివరాలతో ప్రెసిషన్ ఫార్మింగ్ చేసేందుకు ఏఐ ఉపకరిస్తుంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర వ్యవసాయ యాంత్రీకరణ చాలా తక్కువ. ఇప్పుడు చిన్న చిన్న ఏఐ ఆధారిత పరికరాలు, ఆటోమేటిక్ మెకనైజేషన్ అందుబాటులోకి వస్తున్నాయి. చిన్న కమతాల్లోనూ ఇవి మానవరహితంగా విత్తనాలు చల్లడం, కోతలు, ప్రాసెసింగ్ చేయడంతోపాటు విలువ ఆధారిత వస్తువులు ఎలా తయారు చేయవచ్చో సూచించనున్నాయి. వీటివల్ల కూలీల సమస్యను అధిగమించవచ్చు. ఏఐ ద్వారా ఇక్రిశాట్ పరిధిలోని పంటలకు సంబంధించిన తెగుళ్లు, ఇతర సమస్యలను సులభంగా తెలుసుకోవచ్చు. ఏఐ ఆధారంగా మార్కెటింగ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటుకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉంటుంది. మార్కెట్ డిమాండ్ ఆధారంగా పంటల సాగుపెంచేలా ఉపయోగపడుతుంది. గుర్తింపు ఉన్న పంటలకు బ్లాక్ చైన్ టెక్నాలజీని అనుసంధానించే విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ఏఐ ఆధారంగా అంతర్జాతీయస్థాయిలో రైతులకు ఎప్పుడు ఏరకం పంటకు మంచి ధర వస్తుందో తెలుసుకోవచ్చు. మార్కెట్లో భవిష్యత్తులో ఏపంట ఉత్పత్తులకు ఎక్కడ గిరాకీ ఉంది? ఎంతమేర సాగు చేయాలనే అంశాలను అంచనావేసే విధానాలు అందుబాటులోకి రానున్నాయి. ఏదేమైనా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ విశిష్ట పథకాన్ని ఆగస్టు 2నుండి అమలు చెయ్యబోతున్నందుకు రైతులోకం ప్రభుత్వానికి కృత్ఞతలు తెలియచేస్తోంది.
`నీరుకొండ ప్రసాద్