- పకడ్బందీ పారిశుద్ధ్య పనులకు మొబైల్ బృందాలు
- రోడ్ల పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోండి
- తాగునీటి సరఫరాకు ఇబ్బందివుంటే ప్రత్యామ్నాయ చర్యలు
- తుపాను అనంతర కార్యచరణపై డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్
అమరావతి (చైతన్య రథం): ‘మొంథా తుపానును సమర్థంగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు తుపాను అనంతర చర్యలు అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖలు యుద్ధప్రాతిపదికన పని చేయాలి. పటిష్టమైన ప్రణాళికతో, సమన్వయంతో ముందుకెళ్లాలి. తుపాను, భారీ వర్షాలుతగ్గాక గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య, తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశముంది. ఎక్కడా ఇబ్బందులు లేకుండా దీనిని సమర్థవంతంగా పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉంద’ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. తుపాను ప్రభావం తీవ్రంగావున్న గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ కార్యక్రమాలు మొదలుపెట్టాలన్నారు. తుపాను ప్రభావంవల్ల పాడైన రోడ్లను ప్రాధాన్యం ప్రకారం మరమ్మతు చేయాలన్నారు. మొంథా తుపాను అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలను తక్షణమే మొదలుపెట్టాలని సూచించారు. మొంథా తుపానుకు 1583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు.
శానిటేషన్ సిబ్బందిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకున్నామన్నారు. 38చోట్ల రోడ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయని, మరో 125చోట్ల రహదారులకు గుంతలు ఏర్పడ్డాయన్నారు. రక్షిత తాగునీటి పథకాల ట్యాంకులు దగ్గర క్లోరినేషన్ ప్రక్రియ చేస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “తాగునీటిని అందించే పథకాలకు, నీటి సరఫరాకు ఏమైనా ఇబ్బందులుంటే ప్రత్యామ్నాయం చూడాలని, తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. “గ్రామాల్లో మొబైల్ శానిటేషన్ బృందాలను సిద్ధంగా ఉంచండి. 21,055 మంది పారిశుద్ధ్య సిబ్బందిని బృందాలుగా ఏర్పాటుచేసి పారిశుద్ధ్య మెరుగుదలకు చర్యలు చేపట్టండి. వాన నీరు నిలిచిన ప్రాంతాల్లో నీటిని బయటకు పంపే చర్యలు తీసుకోవాలి. తాగునీరు కలుషితం కాకుండా, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ తరుణంలో దోమలవల్ల వచ్చే వ్యాధులు పెరుగుతాయి. వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకొని గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా అరికట్టాలి. మూడు, నాలుగు రోజులపాటు పారిశుద్ధ్య నిర్వహణపై పూర్తిగా దృష్టి సారించండి. మళ్లీ సాధారణ పరిస్థితి వచ్చేవరకు గ్రామాల్లో నిరంతరం పారిశుద్ధ్య మెరుగుదలకు చర్యలు తీసుకోవాలి. దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టాలి” అని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.












