అమరావతి, చైతన్యరథం: ఖరీఫ్ పంట కాలం ప్రారంభమై కురుస్తున్న వర్షాలకు నారుమళ్ళు, విత్తనాలు నాటడం తదితర వ్యవసాయ పనులు సాగుతున్న దృష్ట్యా వ్యవసాయ శాఖ సిబ్బంది వారి సేవలను మరింత విసృతపరచి రైతులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కె.అచ్చెన్నాయుడు ఆదేశించారు. ప్రత్యేక వ్యవసాయకమీషనర్, ఆంధ్రప్రదేశ్ వారి కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో సంబంధిత కార్యాచరణ ప్రణాళిక అమలు తదితర పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. విత్తనపంపిణీ విధానము, అందుబాటులో ఉన్న విత్తనాలు, విత్తనప్రణాళికల అంశముపై మంత్రి అడిగిన వాటికి వ్యవసాయ శాఖ ప్రత్యేక వ్యవసాయకమీషనర్ చేవూరు హరికిరణ్ సమాధానం తెలుపుతూ సబ్సిడీ విత్తనపంపిణీ ‘‘డి- కృషి యాప్’’ ద్వారా చేపడుతున్నామని, సకాలంలో తగు పరిమాణం లో వర్షపాతం నమోదుకావడం ద్వారా రాయలసీమ జిల్లాలలో పచ్చిరొట్ట విత్తనాలను ముఖ్యంగా పిల్లిపెసర, జనుము కావాలని, అందుకు బడ్జెట్ అవసరమని వివరించారు.
ఈ విషయమై మంత్రి స్పందిస్తూ రైతులకు ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వం నుండి రావలసిన బకాయిల కొరకు ప్రతిపాదనలను సిద్దం చేసి పంపవలసినదిగా తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులు కోరుకున్న అన్ని రకముల విత్తనాలు మరియు ఎరువులు ఎటువంటి కొరత రాకుండా సరఫరా చేయాలని ఆదేశించారు. వ్యవసాయ రుణ ప్రణాళికలో కౌలు రైతుల గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుత ప్రభుత్వం కౌలు రైతుల శ్రేయస్సు కోసం చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నదని తెలియచేసారు. కౌలు రైతుల ఎంపిక, వాటి ఎంపిక మార్గదర్సకాలు సంబంధిత చట్టాలు పంపమన్నారు. ప్రధానమంత్రి వ్యవసాయ పంటల బీమా, వ్యవసాయ యాంత్రీకరణ తదితర కార్యక్రమాలపై జరిగిన చర్చలో తగు సూచనలిస్తూ సంస్థాగతంగా విధానాలపై మార్పులు చేసి, మరింత బలోపేతం చేయాలన్నారు. కేంద్రప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యతనిస్తున్న మట్టినమూనాల సేకరణ, విశ్లేషణ మరియు అపరాల సాగు పంటలపై దృష్టి కేంద్రీకరించి ఉత్పత్తి పెంచాలని అధికారులను అచ్చెన్నాయుడు కోరారు.