- వాద్వానీ ఫౌండేషన్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
- సాంకేతికత సాయంతో పాలనా సామర్థ్యం మెరుగు
- పౌరసేవలు సులభతరం
- మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇరుపక్షాల నడుమ ఎంఓయూ
అమరావతి (చైతన్యరథం): పరిపాలనలో ఎమర్జింగ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వేగం సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వాద్వానీ ఫౌండేషన్ నడుమ అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లి నివాసంలో ఇరుపక్షాల ప్రతినిధులు శుక్రవారం ఒప్పందంపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో కృత్రిమ మేధ ఆధారిత సర్వీస్ డెలివరీ ట్రాన్స్‌ఫర్మేషన్, పాలసీ మేకింగ్, కెపాసిటీ బిల్డింగ్ ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), జనరేటివ్ ఏఐ, డ్రోన్లు, ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు వివిధ ప్రభుత్వ విధుల్లో సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది.
ఏపీ ప్రభుత్వం తరపున ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, వాద్వానీ ఫౌండేషన్ తరపున వాద్వానీ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ (డబ్ల్యుజీడీటీ) సీఈఓ ప్రకాశ్ కుమార్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పాలనా ఆవిష్కరణలకు ఒక బెంచ్ మార్కుగా మారనుంది. విధాన రూపకల్పన, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం కృత్రిమ మేధ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ద్వారా మెరుగైన పౌరసేవల పంపిణీకి తాజా ఒప్పందం మార్గం సుగమం చేస్తుంది.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఏఐ వినియోగం ద్వారా పౌరసేవలు, పాలనా సామర్థ్యాన్ని మెరుగుపరిచే క్రమంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉందని తెలిపారు. ఏఐ ఆధారిత పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను నిర్మించడానికి, సర్వీస్ డెలివరీని మెరుగుపరచడానికి, అధునాతన డిజిటల్ నైపుణ్యాలతో కూడిన శ్రామిక శక్తిని నిర్మించడానికి వాద్వానీ ఫౌండేషన్ సహకరిస్తుందని లోకేష్ చెప్పారు.
వాద్వానీ ఫౌండేషన్ డబ్ల్యుజీడీటీ సీఈఓ ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ… పాలనా పరివర్తనలో ఒక మార్గదర్శక దశను ఏఐ వినియోగంతో రూపొందించడమే ఈ ఒప్పందం లక్ష్యం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో నైపుణ్యాలు పెంపొందించి తద్వారా పౌరసేవలను మెరుగుపర్చేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
ఎంవోయూ ముఖ్యాంశాలు
1. డ్రైవింగ్ సర్వీస్ డెలివరీ ట్రాన్స్‌ఫర్మేషన్ – పాలనా ఫలితాలను మెరుగుపరచడానికి, సేవా సామర్థ్యాన్ని పెంచడం, డిజిటల్ అంతరాన్ని భర్తీచేయడానికి ఇప్పటికే ఉన్న అప్లికేషన్‌ల్లో ఏఐని ఇంటిగ్రేట్ చేయడం.
2. పాలసీల రూపకల్పనలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వినియోగం – డేటా విశ్లేషణ ద్వారా ఉత్పన్నమయ్యే లోతైన అంతర్‌దృష్టితో విధాన నిర్ణయాలను మెరుగుపర్చి తద్వారా పాలనలో సులభతర విధానాలను అమలుచేయడం.
3. ప్రోగ్రామ్‌లు, స్కీమ్‌ల సమీక్ష – ప్రస్తుతమున్న ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను ఆప్టిమైజ్ చేయడానికి ఏఐ, డిజిటల్ పరిష్కారాలను వర్తింపజేయడం, వాటిని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా పౌర కేంద్రీకృతంగా మార్చడం.
ప్రభుత్వ పాలనా సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో ఇది కీలకమైన ముందడుగు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యవస్థ పునర్నిర్మాణానికి ఈ నూతన విధానాలను అమలుచేస్తారు. పరిపాలనలో డిజిటల్ పరివర్తన కోసం ఏఐని ఉపయోగించుకోవడానికి అవసరమైన నైపుణ్యంతో ఏఐ బూట్ క్యాంప్ ప్రభుత్వ అధికారులను సన్నద్ధం చేస్తుంది. రాష్ట్రవ్యాప్త డిజిటల్ లెర్నింగ్ యాక్సెస్‌లో భాగంగా ఏఐ ఆధారిత ఆన్‌లైన్ కోర్సులు, అభ్యాస వనరులను ఈ నూతన విధానంలో ప్రభుత్వం వినియోగిస్తుంది. కృత్రిమ మేధ, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక విద్యను అన్ని స్థాయిల్లో ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులో ఉంచుతుంది. ఆంధ్రప్రదేశ్ పాలనా చట్రంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలను సమర్థవంతంగా స్వీకరించడం, ప్రభావాన్ని నిర్ధారించడానికి ఏపీ ప్రభుత్వం, వాద్వానీ ఫౌండేషన్ సంయుక్తంగా తమ నైపుణ్యం, వనరులను పెట్టుబడిగా పెడతాయి.