- 142 పీహెచ్‌సీలకు 227 మంది నియామకం
- డీఎంఈ ఆసుపత్రులకు 30 మంది ట్యూటర్లు
- వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వుల జారీ
అమరావతి(చైతన్యరథం): ప్రభుత్వ వైద్య సేవలు అందించడం లో కీలక పాత్ర వహించే సెకండరీ ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరత తీర్చే విధంగా 227 మంది పీజీ పూర్తి చేసిన వైద్యులు విధు ల్లో చేరనున్నారు. ఇన్‌సర్వీస్ అభ్యర్థులుగా 12 సబ్జెక్టుల్లో పీజీ పూర్తి చేసిన 227 మందిని 142 సెకండరీ ఆసుపత్రుల్లో వైద్య ఆరోగ్య శాఖ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రులు, సబ్జెక్టుల వారీగా ఈ తాజా పోస్టింగ్ వివరాలను సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్‌బాబు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ పద్మావతి…వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు వివరించారు. వీరిలో 100 పీహెచ్‌సీల్లో 155 మంది స్పెషలిస్ట్ వైద్యులు త్వరలో విధు ల్లో చేరనున్నారు. 33 ఏరియా ఆసుపత్రుల్లో 60 మంది, 7 జిల్లా ఆసుపత్రుల్లో 10 మంది, 2 ఎంసీహెచ్ ఆసుపత్రుల్లో ఇద్దరు స్పెషలిష్ట్ వైద్యులకు కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇచ్చారు. మొత్తం 227 మందిలో 35 మంది చొప్పున గైనకాలజిస్టులు, జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్‌లు, 30 మంది జనరల్ సర్జరీ వైద్యులు, 26 మంది మత్తు వైద్యులు, 25 మంది పిల్లల వైద్య నిపుణులు, 18 మంది ఎముకల వైద్యులు, 17 మంది రేడియా లజిస్టులు, 15 మంది కంటి వైద్య నిపుణులు, 9 మంది ఈ ఎన్‌టీ స్పెషలిస్టులు సెకండరీ ఆసుపత్రుల్లో సేవలు అందించనున్నారు.
సెకండరీ ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్‌ల కొరత తీర్చే దిశగా జరిగిన పోస్టింగ్‌లపై మంత్రి సత్యకుమార్ హర్షం వ్యక్తం చేశారు. మొత్తం 243 సెకండరీ ఆసుపత్రులుండగా 142 ఆసుపత్రుల్లో 227 మంది స్పెషలిస్టులు నియమితులయ్యా రు. అత్యధికంగా గూడూరు ఏరియా ఆసుపత్రికి నలుగురు స్పెషలిస్టులను కేటాయించారు. వీరిలో పిల్లల వైద్యుడు, రేడియా లజిస్ట్, చర్మవ్యాధి నిపుణుడు, పాథాలజిస్ట్ ఉన్నారు. 7 సీహెస్‌సీ లు, 6 ఏరియా ఆసుపత్రుల్లో ముగ్గురు చొప్పున స్పెషలిస్టులను నియమించారు. 31 సీహెచ్‌సీలకు ఇద్దరు చొప్పున మరో 13 ఏరియా ఆసుపత్రులకు ఇద్దరేసి, 3 జిల్లా ఆసుపత్రులకు ఇద్దరు చొప్పున స్పెషలిస్టులను నియమించారు. మరో 97 ఆసుపత్రుల కు ఒక్కరేసి నిపుణులను కేటాయించారు. 2022-23లో ఇన్ సర్వీసు డాక్టర్లుగా వివిధ పీజీ కోర్సుల్లో చేరిన మొత్తం 257 మంది పీహెచ్‌సీ డాక్టర్లు తాజాగా పీజీ కోర్సులు పూర్తి చేయగా వారిలో 227 మందిని సెకండరీ ఆసుపత్రుల్లో నియమించారు. తగు ఖాళీలు లేనందున మిగిలిన 30 మందిని డీఎంఈ ఆసు పత్రుల్లో ట్యూటర్లుగా నియమించారు.















