- విమానయాన రంగంలో నైపుణ్య అభివృద్ధికి కర్నూలు విమానాశ్రయంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు
- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
కర్నూలు (చైతన్యరథం): పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కృషిచేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశు సంవర్ధక, డైరీ అభివృద్ధి, మత్స్య శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 50 ఎంఎస్‌ఎంఈ పార్కులకు ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి ముఖ్యమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా కర్నూలు ఎయిర్ పోర్ట్‌లో ఏర్పాటు చేస్తున్న ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కర్నూలు ఎయిర్పోర్ట్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఆంధ్ర ప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం సృష్టించి, అనువైన పాలసీలను అమలుచేయడం వల్ల పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని తెలిపారు. కర్నూలు ఎయిర్పోర్ట్‌లో మెల్‌స్టార్ ఏవియేషన్స్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో ఏర్పాటు కానున్న ఈ సంస్థ ద్వారా ణGజA ఆమోదిత.. కమర్షియల్ పైలట్ లైసెన్స్, ప్రైవేట్ పైలట్ లైసెన్స్, మల్టీ ఇంజన్ రేటింగ్, ఇన్స్ట్రుమెంట్ రేటింగ్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తారన్నారు. మొదటి దశలో రెండు ఎకరాల్లో రూ.100 కోట్లతో ఏర్పాటవుతున్న ఈ సంస్థ.. విమానయాన రంగంలో నైపుణ్య అభివృద్ధికి దోహద పడటమే కాకుండా, రాష్ట్రం పైలట్ శిక్షణలో ప్రముఖ కేంద్రంగా తయారు కానుందని మంత్రి తెలిపారు. ఈ సంస్థ ద్వారా మొదటి దశలో వంద మందికి ప్రత్యక్షంగా, 250 పరోక్షంగా ఉపాధి లభించనుందని, రెండవ దశలో మరింత విస్తరించేందుకు ప్రణాళికలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది జూలై నాటికి నిర్మాణాలు పూర్తి చేసి వంద మందికి శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. కర్నూలు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి శర వేగంగా సాగుతోందని తెలిపారు. ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్ ద్వారా అనేక పరిశ్రమలు, డ్రోన్ సిటీ లాంటి ప్రాజెక్టులు రావడం వల్ల యువతకు విరివిగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. కర్నూలు ఎయిర్పోర్ట్‌లో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం వల్ల పైలట్ ట్రైనింగ్ కోసం విదేశాలకు వెళ్ళే అవసరం తగ్గుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందని తెలిపారు. ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు వల్ల విమానయాన రంగ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెల్ స్టార్ ఏవియేషన్స్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ కశ్యప్, సెట్కూరు సీఈఓ డా.వేణు గోపాల్, కర్నూలు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ విద్యా సాగర్, డిఐఓ ప్రవీణ్ రెడ్డి, డీఈ అమృత్ తదితరులు పాల్గొన్నారు.












