టిడిపి అధికారంలోకి రాగానే యువ న్యాయవాదుల నైపుణ్యాభివృద్ధి కి చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో మంగళవారం పెనుగొండ నియోజకవర్గం పాలసముద్రం వద్ద శ్రీసత్యసాయి జిల్లా న్యాయవాదులు పాల్గొని లోకేష్ కు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ టిడిపి అధికారంలోకి రాగానే న్యాయస్థానాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయటం తో పాటు, న్యాయవాదులకు రాయితీపై ఇళ్ళ స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
హై కోర్టులో కప్పు కాఫీ దొరికే పరిస్థితి లేదని సాక్షాత్తు ఒక న్యాయమూర్తి తప్పు పట్టడం రాష్ట్రంలోని పరిస్థితికి దర్పణం పడుతుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక న్యాయవ్యవస్థ పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదుల న్యాయమైన డిమాండ్ లు అన్నింటినీ పరిష్కరించనున్నట్టు చెప్పారు.