- 9 గంటలపాలు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణ
- టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు
తిరుపతి (చైతన్యరథం): తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో సుప్రీంకోర్టు నియమించిన సిట్ అధికారులు కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసి, విచారణకు పిలవడంతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని మంగళవారం సిట్ విచారించింది. కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించిన కాంట్రాక్టు వ్యవహారంలో ధర్మారెడ్డి పాత్ర ఏమిటని సిట్ అధికారులు ప్రశ్నించారు. దాదాపు తొమ్మిది గంటలపాటు సాగిన విచారణలో ధర్మారెడ్డి సహకరించలేదని సమాచారం. ధర్మారెడ్డిని బుధవారం కూడా సిట్ విచారించే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాబాయ్, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఈనెల 13వ తేదీ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో లడ్డూ తయారీకి బోలే బాబా డెయిరీ నుంచి సరఫరా అయిన నెయ్యి రసాయనాలతో తయారు చేసిందని దర్యాప్తు బృందం ఇప్పటికే నిర్ధారించింది.
దీంతో ఈ వ్యవహారంలో ఆయన పాత్ర, నిర్ణయాలపై సిట్ లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే తాను లక్నోకు వెళ్తున్నందున 15వ తేదీన విచారణకు హాజరవుతానని సిట్‌కు సుబ్బారెడ్డి సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని 2024 ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ సమయంలో అన్ని వేళ్లు వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వైపు చూపించాయి. ఆ సమయంలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టీ చంద్రబాబు టీటీడీ ప్రతిష్ట మంట గలుపుతున్నారని, అటువంటి కల్తీకి ఆస్కారం లేదని ప్రకటించారు. తమ చిన్నాన్న ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకునే గొప్ప ఆధ్యాత్మిక వేత్త అని.. ఆయన ’’ సూపర్ స్వామి’’ అని తన చిన్నాన్నను సమర్థించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయనకు సిట్ నోటీసులు ఇవ్వడంతో వైసీపీలో కలకలం రేగింది.












