తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయన సొంత నియోజకవర్గం పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్ బాషాతో పాటు మరో 11 మంది మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబు ఆధ్వర్యంలో చైర్మన్, కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. అనంతరం అలీమ్ బాషా మాట్లాడుతూ పెద్దిరెడ్డి ఇలాకాలో పదవి మాత్రమే ఉంటుందని, అధికారం మాత్రం ఉండదన్నారు. పుంగనూరు మున్సిపల్ కార్యాలయంపై టీడీపీ జెండా రెపరెపలాడేందుకు చల్లా రామచంద్రారెడ్డి వ్యూహం విజయవంతమైంది. మొత్తం 31 మంది సభ్యులు ఉన్న ఈ మున్సిపాలిటీలో మరో వారంలోపు మరి కొంత మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకుండా.. అసలు ఎన్నికల్లో నామినేషన్లే వెయ్యనివ్వకుండా చేసి, పుంగనూరు మున్సిపాలిటీలోని 31 వార్డులను అప్పటి పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా వున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏకగ్రీవంగా ప్రకటింపజేశాడు. తాజాగా.. ఛైర్మన్ తో పాటు 11 మంది కౌన్సిలర్లు వైకాపాను వీడి టీడీపీ లో చేరారు. కాగా ఈ పరిణామాలపై చల్లా బాబు మాట్లాడుతూ జిల్లా మొత్తాన్ని పెద్దిరెడ్డి కుటుంబం తమ గుప్పెట్లో పెట్టుకుని నియంతలా వ్యవహరించారన్నారు. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ హలీం భాషాతో పాటు కౌన్సిలర్లు అభివృద్ధి కోసం పోరాటం చేసినా పెద్దిరెడ్డి నియంత పోకడల ముందు ఏమీ చేయలేకపోయారన్నారు.