టిడిపి అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ లకు సంబంధించి వైసీపీ రద్దు చేసిన పథకాలు అన్నింటినీ పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం అనంతపురం అంబేడ్కర్ సర్కిల్ లో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గీయులు లోకేష్ ను కలిసి సమస్యలపై విన్నవించారు. టిడిపి అధికారంలోకి రాగానే అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం, స్టడీ సర్కిల్ లను పునః ప్రారంభిస్తామని లోకేష్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ లలో చిన్న పరిశ్రమల దారులకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ లపై తీవ్రమైన అణచివేత కు పాల్పడుతున్నారు అని ఆరోపించారు. ఎస్సీల కోసం నిర్దేశించిన 27 పథకాలను రద్దు చేశాడన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించే దళితులు, గిరిజనుల పై దాడులకు తెగబడుతున్నారు అని ధ్వజమెత్తారు. గత 4 ఏళ్లలో రూ. 28 వేల కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్, రూ. 5,400 కోట్లు ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారిమల్లించి తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసి, ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి లేకుండా చేసిందన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ లను బలోపేతం చేసి విరివిగా నిధులు కేటాయిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.