- ఓటమి భయంతో వైసీపీ నేతల అవాకులు చవాకులు
- ప్రభుత్వ ఉద్యోగులకు పేర్ని బెదిరింపులు
- దౌర్జన్యాలకు దిగేవారే కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్లాలని సజ్జల సిగ్గులేని మాటలు
- సజ్జల డైరెక్షన్‌లోనే ఆరా మస్తాన్ సర్వే
- ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ భూపాల్ రెడ్డి
అమరావతి(చైతన్యరథం): ఓటమి భయంతో వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని, ప్రభుత్వ ఉద్యోగులను కూడా బెదిరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీమంత్రి పేర్ని నాని ఉద్యోగులను బెదిరిస్తున్నారన్నారు. మరోపక్క ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ కేంద్రాల్లో అల్లర్లను ప్రేరేపించేలా దౌర్జన్యాలకు దిగేవారే కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్లాలని చెప్పటం సిగ్గుచేటన్నారు. సజ్జల, పేర్నిలాంటి వ్యక్తులు బయట ఉంటే ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉంది. కావున కౌంటింగ్ ముగిసే వరకు వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకోవాలని రామ్ భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేర్ని నాని బెదిరిస్తే భయపడే స్థితిలో ఉద్యోగులు, టీడీపీ కార్యకర్తలు లేరని స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా వైసీపీ పాలకులు ఎంత అణిచివేతకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో టీడీపీ నేతలు నిలబడ్డారు. వైసీపీని ఛీత్కరించిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆ పార్టీకి బుద్ధి చెప్పారు. వైసీపీ బెదిరింపులకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు భయపడరు. టీడీపీ ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉంటుంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ జరిగేలా ఉద్యోగులు చూడాలని రామ్ భూపాల్ రెడ్డి కోరారు.
సజ్జల మాటలు సిగ్గుచేటు
దాడులు దౌర్జన్యాలకు దిగేవారే కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్లాలని సజ్జల చెప్పడం సిగ్గుచేటు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా సజ్జలను అరెస్ట్ చేయకపోవడం దారుణం. ఎన్నికల కౌంటింగ్‌లో గందరగోళాన్ని సృష్టించేందుకు వైసీపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 2019లో అధికారం కోల్పోయినప్పుడు టీడీపీ హుందాగా ఓటమిని అంగీకరించింది. ప్రజలు ఇచ్చిన తీర్పును హుందాగా తీసుకోకుండా అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ నేతలు కుట్రపన్నుతున్నారు. ప్రజలను, ఉద్యోగులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్న పేర్ని, సజ్జలను పోలీసులు అదుపులోకి తీసుకొని కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం కలగకుండా చూడాలని రామ్ భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.
సజ్జల సూచనల మేరకే ఆరా మస్తాన్ సర్వే
ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించబోతుంది. వైసీపీ అరాచక పాలన నుండి ఏపీ ప్రజానికానికి విముక్తి కలుగుతుంది. ఆ మేరకు ప్రజలు తీర్పు ఇచ్చారు. సర్వే సంస్థలు మెజార్టీ భాగం కూటమి గెలుస్తుందని చెప్పాయి. ఆరా మస్తాన్ మాత్రమే వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. సజ్జల, ఆయన తనయుడు భార్గవ్‌రెడ్డి ఇచ్చిన మార్గదర్శకాల మేరకే ఆరా మస్తాన్ సర్వే ఫలితాలు వెల్లడిరచారని విమర్శించారు. ఈ నెల 1వ తేదీన ఆరా మస్తాన్ ఎక్కడ ఉన్నాడో చెప్పాలి. 1వ తేదీ మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 వరకు ఎక్కడ ఉన్నారో చెప్పగలరా ? ఆ రోజు ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఆయన కుమారుడితో దాదాపు 4 గంటలు భేటీ అయ్యి వారు ఇచ్చిన సలహాలు, సూచనలు అనుగుణంగా ప్రెస్‌మీట్ పెట్టి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆరా మస్తాన్ సర్వే ఫలితాలను వెల్లడిరచారు. సజ్జల ఇచ్చిన ఫలితాలనే ఆరా మస్తాన్ ప్రకటించాడు. ఆరా సంస్థ చేసిన సర్వే అంతా తప్పే, ఉద్యోగులు, బయట నుండి వచ్చిన ఓటర్లంతా టీడీపీ కూటమికే ఓటు వేశారు. ఆరా మస్తాన్ ఆ సర్వే ఫలితాలు ఇవ్వకుంటే వైసీపీ తరఫున కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్లేందుకు కూడా ఎవరూ దొరకని పరిస్థితి ఉంది. కౌంటింగ్ కేంద్రాలకు ఏజెంట్లను తీసుకెళ్ల్లేెందుకు ఆరా మాస్తాన్‌ను పావుగా సజ్జల ఉపయోగించుకున్నారు అంతే. గెలుపు కూటమిదే. ఎన్నికల పలితాలను చూసి రేపు ఆరా మస్తాన్ కు, వైసీపీ నేతలకు కళ్లు బైర్లు కమ్మడం ఖాయమని రామ్ భూపాల్ రెడ్డి ఉద్ఘాటించారు.