- గత ప్రభుత్వ కేటాయింపుల కన్నా 30 శాతం అధికం
- రూ.250 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు
- 69 లక్షల మంది విద్యార్ధులకు హెల్త్ రికార్డుల రూపకల్పన
- ఆశా వర్కర్లకు అన్ని రాష్ట్రాలకన్నా అత్యధిక వేతనం, గ్రాట్యుటీ
- అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి (చైతన్యరథం): గిరిజన ప్రాంతాల్లో ఒక్కొక్కటీ రూ. 50 కోట్ల వ్యయంతో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్ని నిర్మిస్తున్నామని వైద్య, రోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శాసనసభలో తెలిపారు. బడ్టెట్ కేటాయింపులపై జరుగుతున్న చర్చలో శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ గ్రాంట్లు, డిమాండ్లపై మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ తమ శాఖకు రూ.19,264 కోట్ల మేర బడ్జెట్ కేటాయింపులు చేసినందుకు శాసనసభకు, ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నానన్నారు. గత ప్రభుత్వం ఆఖరు సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కన్నా 30 శాతం మేర ఇది అధికమన్నారు. ఆరోగ్య, సంపన్న, ఆనందమయ (హెల్తీ, వెల్తీ, హ్యాపీ) ఆంధ్రప్రదేశ్ రూపకల్పనకుగాను ఆరోగ్యశాఖకు పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లో వైద్య, ఆరోగ్యశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు కంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం కావాలంటే రానున్న రోజుల్లో వైద్య, ఆరోగ్యశాఖ బడ్జెట్‌ను మరింత పెంచాలని తాను కోరుతున్నానన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా అంగన్ వాడీ నుండి ఇంటర్ వరకూ చదువుతున్న దాదాపు 69 మంది లక్షల మంది విద్యార్థులకు హెల్త్ రికార్డుల్ని రూపొందించామని మంత్రి వివరించారు. దీనిలో 43 లక్షల మందికి ఇప్పటికే స్క్రీనింగ్ నిర్వహించామని చెప్పారు.
ఎన్సీడి స్క్రీనింగ్లో భాగంగా కోటీ 40 లక్షల మందికి వివిధ రోగాలకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టుల్ని నిర్వహించామన్నారు. కేవలం హైపర్ టెన్షన్, డయాబెటిస్ వ్యాధులకు మాత్రమే కాక మన రాష్ట్రంలో క్యాన్సర్‌కు సంబంధించి కూడా స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకూ ఓరల్ క్యాన్సర్ కు సంబంధించి 31 వేల మందికి, బ్రెస్ట్ క్యాన్సర్లో 30 వేల మందికి, సర్వికల్ క్యాన్సర్ కు సంబంధించి 27 వేల మంది అనుమానిత రోగులకు స్క్రీనింగ్ నిర్వహించామని చెప్పారు. సర్వికల్ క్యాన్సర్ అనుమానితులకు వైద్యాధికారులు మరోసారి పరీక్షలు నిర్వహించినపుడు 324 మందికి క్యాన్సర్ ఉన్నట్లు తేలిందన్నారు. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా 19 ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన అంకాలజీ యూనిట్లకు రిఫర్ చేసి ప్రివెంటివ్ క్యాన్సర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. స్టెమీ కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్కటీ రూ.45 వేల ఖరీదు చేసే ఇంజక్షన్లు ఉచితంగా ఇచ్చి 2,140 మంది ప్రాణాల్ని కాపాడామన్నారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలల్లో చదివే పిల్లలకు ఐ- స్క్రీనింగ్ కూడా చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకూ 19.80 లక్షల మంది పిల్లలకు ఈ స్క్రీనింగ్ నిర్వహించామని చెప్పారు. ఇందులో 90 వేల మంది పిల్లలకు ఉచితంగా కళ్లజోళ్ళు అందచేశామని వివరించారు.
గతంలో పేదలకు అందుబాటులో లేని ఎంఆర్‌ఐ స్కాన్‌లను కూడా చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. 3 ఫుడ్ సేఫ్టీ ల్యాబులను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. దీనితో పాటు సేఫ్టీ ఆన్ వీల్స్ పేరుతో 19 మొబైల్ వ్యాన్‌లను కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. అదే విధంగా 24 జిల్లాలలో క్రిటికల్ కేర్ బ్లాక్ లను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇటీవలి బడ్జెట్లో కేంద్రం డే కేర్ యూనిట్లను కూడా మంజూరు చేసిందని, వాటి ఏర్పాటుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. గిరిజన ప్రాంతాలయిన బుట్టాయగూడెం, రంపచోడవరం, పార్వతీపురం, డోర్నాల ప్రాంతాలలో ఒక్కో ఆస్పత్రి రు.50 కోట్ల ఖర్చుతో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిరాలుగా మారిన విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు సొంత భవనాలు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రానికి కర్నూలులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్‌ను మంజూరు చేస్తే గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు దానిని గాలికొదిలేసిందని విమర్శించారు. ఇప్పుడు ఈ కేంద్రాన్ని పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, మరో నెల రోజుల వ్యవధిలో ఈ కేంద్రంలో క్యాన్సర్ వ్యాధికి అధునాతనమైన చికిత్సలు పేదలకు అందుబాటులోకి వస్తాయని మంత్రి చెప్పారు. అదే విధంగా ఆయుష్ విభాగాన్ని పటిష్ట పరిచేందుకు కూడా తమ ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఆయన వివరించారు.
వేతనాలు పెంచాలని ఆశా వర్కర్లు కొందరు ధర్నాలు చేస్తున్నారనీ, దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఏపీలో ఆశాల వర్కర్లకు రూ.10 వేల జీతాన్ని ఇస్తున్నామనీ, ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచి, రూ.1.50 లక్షలు గ్రాట్యుటీని మంజూరు చేస్తూ ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారని మంత్రి వివరించారు. ఈ నిర్ణయాలతో 64,500 మంది ఆశా వర్కర్లకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అదే విధంగా వారికి ప్రసవం సమయంలో గతంలో లేని మెటర్నిటీ లీవ్ లను కూడా ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు మందులు, 108 ఎమెర్జెన్సీ సేవలకు సంబంధించి గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందన్నారు. మొత్తం రూ.6,500 కోట్ల మేర బకాయిలు పెట్టి కూటమి ప్రభుత్వంపై భారాన్ని మోపారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా రూ. 2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ వైద్య సేవలందించేలా హైబ్రీడ్ విధానంలో బీమాను అందుబాటులోకి తెస్తున్నామన్నారు.
కేవలం పేదలకు మాత్రమే కాక మధ్యతరగతి వర్గాల వారికి కూడా ఎన్టీఆర్ వైద్యసేవ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఈ మేరకు నిర్ణయం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను ధన్యవాదాలు తెలియచేస్తున్నానన్నారు. ఆరోగ్యశాఖలోని ఖాళీలను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ ద్వారా మాత్రమే కాక స్థానిక అవసరాలకు అనుగుణంగా డీఎస్సీల ద్వారా భర్తీ చేసుకునేందుకు రీజినల్ డైరెక్టర్లకు ఆదేశాలిచ్చామని చెప్పారు. పేదలకు మందులను అందుబాటు ధరల్లో లభ్యమయ్యేందుకు వీలుగా మండలానికి ఒకటి వంతున జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 108 సేవల కోసం కొత్తగా 190 అంబులెన్స్‌లను, అలాగే 53 మహాప్రస్థానం అంబులెన్సులను కొనుగోలు చేస్తున్నట్టు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ఈ సేవల విషయంలో గత ప్రభుత్వం అస్మదీయులకు ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టిందని, వారు నిర్వహించిన సేవల్లో 70 శాతం మేర ప్రజలకు అందుబాటులోకి రాలేదన్న విషయం ప్రభుత్వ ఆడిట్‌లో బయటపడిరదని వివరించారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఈ అత్యవసర సేవల విభాగాన్ని గణనీయంగా మెరుగుపర్చి ప్రజలకు అందుబాటులలోకి తెచ్చిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన 17 వైద్య కళాశాలల ఏర్పాటు ప్రక్రియ కేవలం 14 శాతం మాత్రమే జరిగిందని, తమ ప్రభుత్వం దీనిని వేగవంతం చేసిందని చెప్పారు. అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం వైద్యసేవలను మెరుగుపర్చే ప్రయత్నం చేస్తోందని చెప్పారు.