- వచ్చే వారం నుంచి మొదలు
- రెండేళ్లలో అమ్ముకునే హక్కు
- రూ.300 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం
- 2019లో అనేక రకాలుగా అవమానించారు, మంగళగిరి ప్రజలు నా గౌరవం నిలబెట్టారు
- మంగళగిరిలో మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్
- నాలుగో రోజు మధ్యాహ్నం తాడేపల్లి మహానాడుకు చెందిన 430 మందికి ఇంటి పట్టాలు అందజేత
- మొత్తం 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు అందించిన లోకేష్
మంగళగిరి (చైతన్యరథం): మంగళగిరి నియోజకవర్గంలోని పేదలకు ఇప్పుడు ఇస్తున్న ఇంటి పట్టాలను వచ్చే వారం నుంచి రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని విద్య. ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రెండేళ్లలో ఇంటి పట్టా అమ్ముకునే హక్కు కూడా వస్తుందన్నారు. మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరి డాన్‌బాస్కో స్కూల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సభలో తాడేపల్లి మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. శుక్రవారం మొత్తం 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ..2019 నుంచి 2024 వరకు తనను అనేక రకాలుగా అవమానించారన్నారు.
మంగళగిరిలో గెలవలేదని హేళన చేశారు. సొంత కొడుకుని గెలిపించుకోలేకపోయారని అధినేత చంద్రబాబుని కూడా అన్నారు. అప్పుడు 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఓటమి నాలో కసి పెంచింది. ఓడినా మంగళగిరిని వీడలేదు. సొంత నిధులతో 26 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి ప్రజలను ఒకటే కోరా. 2019 ఎన్నికల్లో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిరచారో.. ఆ సంఖ్య పక్కన సున్నా పెట్టి 53,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరాను. అయితే అందరికీ దిమ్మతిరిగి విధంగా 91వేల ఓట్ల మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించారు. ఈ రోజు ఇన్ని మంచి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం చేస్తున్నానంటే దానికి కారణం మీరు ఇచ్చిన మెజార్టీయే. మంగళగిరి ప్రజల దశాబ్దాల కల వంద పడకల ఆసుపత్రి. రెండో కేబినెట్ మీటింగ్‌లోనే దానికి ఆమోదం పొందాం. ఈ నెల 13వ తేదీన ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం. ఏడాదిలోగా పూర్తిచేస్తాం. భూగర్భ డ్రైనేజీ, భూగర్భ వాటర్ పైప్ లైన్, భూగర్భ గ్యాస్, భూగర్భ కరెంట్ అందిస్తాం. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. పార్క్‌లు, చెరువులు అభివృద్ధి చేస్తాం. పిల్లలు ఆడుకునేందుకు క్రికెట్ టర్ఫ్ లు, బాస్కెట్ బాల్ కోర్టులు ఏర్పాటుచేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.
రూ.300 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మిస్తాం
తాడేపల్లిలో హెల్త్ క్లినిక్ ఏర్పాటుచేశాం, ఆరోగ్యంగా ఉండాలంటే అందరం నడవాలి. గంట సేపు వ్యాయామం చేయాలి. నడవాలంటే పార్క్‌లు కావాలని ఆనాడు అడిగారు. కొన్ని వార్డుల్లో పార్క్‌లు నిర్మిస్తున్నాం. ఇటీవల మంగళగిరిలో ఎస్‌ఎల్‌ఎన్ పార్క్ ను ప్రారంభించాం. మరో 6 పార్క్ లు సిద్ధమవుతున్నాయి. 31 కమ్యూనిటీ భవనాలు నిర్మించాలని ఆనాడు కోరారు. అందులో 17 భవనాలకు భూములను కూడా గుర్తించాం. రెండు భవనాల పనులు కూడా పూర్తికాబోతున్నాయి. వాటిని త్వరలోనే ప్రారంభించబోతున్నాం. మిగతా భవనాలు కూడా యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాం. రూ.300 కోట్ల వ్యయంతో కృష్ణానదిలో రిటైయినింగ్ వాల్ నిర్మించబోతున్నాం. దానిని పూర్తి చేసే బాధ్యత మేం తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
గతంలో చెప్పులరిగేలా తిరిగినా పట్టించుకోలేదు
2019లో ఓడిపోయినప్పడు అందరూ ఎగతాళి చేశారు. బాధ కలిగింది. ఈ సారి ఇంత మెజార్టీ గెలిపించడంతో నా పరువును కాపాడారు. శాసనసభలో నా గౌరవం పెంచారు. కేబినెట్‌లో మంగళగిరి ప్రజలకు ఏదైనా చేయాలంటే చర్చ అవసరం లేకుండానే మంజూరు చేస్తున్నారు. మా పైన బాధ్యత పెరిగింది. దశాబ్దాల కల అయిన శాశ్వత ఇంటి పట్టాలు అందించాలని కోరారు. మూడు, నాలుగు దశల్లో ఇంటి పట్టాలు అందిస్తామని ఆనాడు చెప్పా. ఏడాదిలోగా బట్టలు పెట్టి మొదటి దశ ఇంటి పట్టాలు ఇస్తానని చెప్పా. 11 నెలల్లో హామీని నిలబెట్టుకునేందుకే మీ ముందుకు వచ్చా. పద్ధతి ప్రకారం హామీలు నిలబెట్టుకుంటున్నాం. అవినీతిరహితంగా చేస్తున్నాం. గతంలో ఇంటి పట్టాల కోసం చెప్పులరిగేలా తిరిగారు. జిరాక్స్‌లకు, అర్జీలకే వేలరూపాయలు ఖర్చు చేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వంలో యుద్ధప్రాతిపదికన కొలతలు తీశాం. ఆ వివరాలన్నీ వచ్చిన వెంటనే కేబినెట్‌లో చర్చించి పాలసీ తీసుకువచ్చాం. ఈ నిర్ణయం వల్ల మంగళగిరి ప్రజలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి లబ్ధి చేకూరుతుందని మంత్రి లోకేష్ తెలిపారు.
రెండేళ్లలో ఇంటి పట్టా అమ్ముకునే హక్కు
వచ్చే వారం నుంచి ఇంటి పట్టాను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రెండేళ్లలో పట్టా అమ్ముకునే హక్కు కూడా మీకు వస్తుంది. దయచేసి ఎవరూ అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మన ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. మంగళగిరిని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దుతున్నాం. అన్ని రంగాల్లో మంగళగిరిని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దుతాం. ఇందుకు మీ అందరి సహకారం కావాలి. స్వచ్ఛతలో మీ సహకారం కావాలి. మీరు నన్ను పెద్దఎత్తున గౌరవించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 91వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. మీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని మంత్రి లోకేష్ చెప్పారు.