- కూటమి ప్రభుత్వం వచ్చాక జూనియర్ కాలేజీల్లో పెరిగిన విద్యార్థులు
- గత ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు కూడా ఇవ్వలేదు
- ఇండస్ట్రీ అవసరాలకు మేరకు డిగ్రీ కాలేజీలను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు
- శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటర్మీడియట్ విద్యలో పలు సంస్కరణలు తెస్తున్నాం.. గత ప్రభుత్వంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కూడా ఇవ్వలేదు.. నేను మంత్రి అయ్యాక తొలిసారి పాఠ్యపుస్తకాలు ఇచ్చామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. శాసనసభలో శుక్రవారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… గత ప్రభుత్వ హయాంలో ఇంటర్మీడియట్‌కు హైస్కూలు ప్లస్ కాలేజీలు తెచ్చారన్నారు. ఇంటర్మీడియట్, స్కూలు ఎడ్యుకేషన్‌కు చాలా తేడా ఉంటుంది. సరైన అధ్యాపక సిబ్బంది లేకుండా కాలేజీలు ప్రారంభించటం వల్ల విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 15 వేల అడ్మిషన్లు పెరిగాయి, ఇది శుభ పరిణామం. విద్యార్థులను ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించి వెనుకబడిన విద్యార్థుల కోసం బ్రిడ్జి కోర్సులు ఏర్పాటు చేస్తున్నాం. నారాయణ సంస్థలతో పోటీపడేలా ప్రభుత్వ కళాశాలలను తీర్చిదిద్దాలని కృషిచేస్తున్నాం. ఇందుకోసం మంత్రి నారాయణను ఇన్‌పుట్స్ అడిగాం. గురువారం జరిగిన ఒక వర్క్ షాపునకు ఆయన ముఖ్యఅతిధిగా వచ్చి సలహాలు, సూచనలు ఇచ్చారు. స్కూలు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులతో భవనాలు, ఫ్యాకల్టీ, మెటీరియల్‌పై సమీక్షించాం.
రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లకు ర్యాంకింగ్ మెకానిజం తెచ్చి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తాం. ఫలితాలపై ఎప్పటికప్పుడు సమీక్షించి, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించాం. డిసెంబర్ మొదటివారంలో రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం) నిర్వహిస్తాం. ఆ సమావేశాల్లో శాసనసభ్యులంతా పాల్గొనాలని కోరుతున్నాం. ప్రతి ఎమ్మెల్యే ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ఫీడ్‌బ్యాక్ రిపోర్టు ఇవ్వాలని కోరుతున్నా. ఏం చేస్తే బాగుంటుందో ఎమ్మెల్యేలు ఇచ్చే సలహాల మేరకు చర్యలు తీసుకుంటాం. తగరపువలస డిగ్రీ కాలేజీ కెేజీబీవీ స్కూలులో నడుస్తోంది. త్వరలో ప్రత్యామ్నాయం చూపిస్తాం, అప్పటివరకు అక్కడే కొనసాగిస్తాం. సింహచలం స్కూలు భవనాల నిర్మాణాన్ని ఆరునెలల్లో పూర్తిచేస్తాం.
రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 169 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, 49 నియోజకవర్గాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు లేవు, 91 నియోజకవర్గాల్లో ఒకటి, 27 చోట్ల రెండు, 8చోట్ల 3 డిగ్రీ కాలేజిలు ఉన్నాయి. భీమిలి నియోజకవర్గంలో రెండు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి, భీమిలిలో అడ్మిషన్ రేటు 73శాతం ఉండగా, తగరపువలసలో 36 శాతం మాత్రమే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజిల్లో అడ్మిషన్లు 50 శాతం దాటడం లేదు, ఐటిఐకి మాత్రం డిమాండ్ ఉంది. ఫ్యాకల్టీ, భవనాలు, మీడియం కరెక్టుగా లేకపోవడమే అడ్మిషన్ల తగ్గుదలకు కారణం. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా డిగ్రీ కాలేజీలను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.