- ఆయన చెప్పే మాటలకు.. వాస్తవానికి చాలా తేడా ఉంది
- అన్ని లెక్కలు బయటకు తీస్తాం.. పేదలకు న్యాయం చేస్తాం
- గృహ నిర్మాణ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమీక్ష
రాఫ్తాడు (చైతన్యరథం): గత ఐదేళ్లలో పేదల ఇళ్ల మాటున కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేసిన ఈ అవినీతి లెక్కలను బయటకు తీస్తామని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం రోజున ఆమె అనంతపురం క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉదయం పంచాయతీ రాజ్ అధికారులతో సమావేశమై.. నియోజకవర్గంలో నిధులు ఉండి పనులు చేయని రోడ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ, జిల్లాపరిషత్, నాబార్డ్ నిధులతో మంజూరైన రోడ్ల వివరాల గురించి ఆరా తీశారు. పంచాయతీ రాజ్ శాఖ నుంచి డైరెక్టు గా మంజూరైన రోడ్లు ఎన్ని నిధులు ఎంత వరకు ఉన్నాయన్నది తెలుసుకున్నారు. మార్కెట్ యార్డ్ సెస్ నిధుల గురించి కూడా ఆరా తీశారు. పెండిరగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయన్నది తెలుసుకున్న తర్వాత నిధులు ఉన్న చోట నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. వర్షాకాలంలో రోడ్లు దెబ్బతినే అవకాశం ఉందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
గృహ నిర్మాణలపై సీరియస్ ఫోకస్
రాప్తాడు నియోజకవర్గంలో గత ఐదేళ్లలో మంజూరైన ఇళ్ల గురించి పరిటాల సునీత ప్రత్యేకంగా దృష్టి సారించారు. పేదలకు చిరకాల స్వప్నంగా ఉన్న ఇళ్ల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యం, అవినీతి మీద ఆమె సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం గృహ నిర్మాణశాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. అసలు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి.. వాటి నిర్మాణ పరిస్థితి ఏంటి.. అలాగే ఇళ్ల నిర్మాణం కోసం జరిగిన భూసేకరణ గురించి తెలుసుకున్నారు. ఇన్ని రోజులు నియోజకవర్గంలో పాతిక వేలకు పైగా ఇళ్లు నిర్మించారని గొప్పలు చెప్పుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత అన్నారు.
వాస్తవంగా నియోజకవర్గానికి గత ఐదేళ్లలో మంజూరైన ఇళ్లు 15445 కాగా.. ఇందులో పూర్తైన ఇళ్లు కేవలం 6169 మాత్రమే ఉన్నాయన్నారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్లు 4186 ఉంటే.. అసలు ఇంకా పునాది కూడా పడని ఇళ్లు 5090 ఉన్నాయన్నారు. కానీ ప్రకాష్ రెడ్డి తన రాక్రీట్ సంస్థ ద్వారా వందల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారన్నారు. పేదల ఇళ్ల మాటున ఆయన చేసిన అవినీతి ఇప్పటి వరకు బయటకు రాకుండా చూశారని.. కానీ వాటి లెక్కలన్నీ మేము తేలుస్తామన్నారు. హౌసింగ్ శాఖ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తే… ఒక మహిళా అధికారిని విచారణ అధికారిగా నియమించారన్నారు. ఆమె ఇచ్చిన రిపోర్ట్ ఏమైందంటే.. ఇప్పటి వరకు సమాధానం చెప్పే వారు కూడా లేరన్నారు. నియోజకవర్గంలో ఇళ్లు పూర్తి కాకుండానే కోట్లలో బిల్లులు మంజూరు చేసిన విషయం బయటపడుతోందన్నారు. సిమెంట్ టన్నులకొద్ది వైసీపీ నేతల స్వప్రయోజనాలకు చేరిందని.. త్వరలోనే వీటి గురించి అన్ని వివరాలు బయటకు తీస్తామన్నారు.