- త్వరలో నామినేటేడ్ పోస్టులు
- కార్యకర్తలు బలంగా ఉంటేనే…పార్టీ బలంగా ఉంటుంది
- కార్యకర్తలను వేధించిన వారికి, అక్రమార్కులకు టీడీపీలోకి నో ఎంట్రీ
- బీసీ నేతలనే పార్టీ అధ్యక్షులుగా, స్పీకర్ గా ఎన్నుకున్నాం
- పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి :- సార్వత్రిక ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలను ప్రతి ఒక్కరూ సవాల్ గా తీసుకుని పోరాడటం వల్లే ఘన విజయం సాధ్యమైందన్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొని పోరాడిన వారికి తప్పకుండా నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు…కష్టపడ్డ వారి వివరాలను సేకరిస్తున్నామని అన్నారు. పార్టీ నేతలు ఇచ్చే రిపోర్టులతో పాటు…ఇతర మార్గాల్లో కూడా రిపోర్టులు తెప్పించుకుని కష్టపడిన వారికే పదువులు వచ్చేలా చేస్తామని అన్నారు. పార్టీ కోసం శ్రమించిన వారిని ఆదుకుంటేనే పార్టీ కూడా బలంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ లు, పార్లమెంట్ అధ్యక్షులతో చంద్రబాబు సోమవారం టెలీకాన్ఫ రెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….‘‘ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్ల పాటు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, యువగళం,రా…కదలిరా, ప్రజాగళం వంటి వివిధ కార్యక్రమాలతో ప్రజలతోనే ఉన్నాం. సాగునీటి ప్రాజెక్టులను కూడా సందర్శించి గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాం. గత ఐదేళ్ల పాటు కార్యకర్తలు, నాయకులపై వైసీపీ ప్రభుత్వం ఎన్నో అక్రమ కేసులు పెట్టింది. వీటన్నింటిని తట్టుకుని నిలబడ్డారు. ఎన్నికల్లో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసి పని చేయడం వల్ల 57 శాతం ఓట్లు సాధించి, 93 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
పార్టీకి నష్టం చేసిన వారికి పార్టీలోకి ప్రవేశం లేదు
‘‘అధికారాన్ని అడ్డం పెట్టుకుని పార్టీకి, కార్యకర్తలకు నష్టం చేసి, వేధించిన వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ లేదు. పార్టీకి అన్యాయం చేసిన వారిని ఉపేక్షించేది లేదు. అధికారం వచ్చిందని స్వలాభం కోసం వచ్చే వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రజలు నమ్మకం పెట్టుకుని కూటమిని గెలిపించారు..వారి నమ్మకాన్ని నిలబెడదాం. పొత్తులో భాగంగా 31 మంది పార్టీ ఇంఛార్జ్ లకు సీట్లు రాలేదు…అయినా వెనకడుగు వేయకుండా కూటమి గెలుపే లక్ష్యంగా పని చేశారు. అందువల్లే చరిత్రలో లేని విధంగా ఫలితాలు వచ్చాయి. నేను కూడా ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్నా. రైట్ మ్యాన్…రైట్ పొజిషన్ అనే విధంగా భవిష్యత్తులో నిర్ణయాలు ఉంటాయి. 2029 ఎన్నికల్లో విజయానికి కూడా ఇప్పటి నుండే ప్రణాళిక ఉండాలి.’’ అని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో పండుగ వాతావరణం రాబోతోంది
‘‘ప్రజలకు మంచి చేస్తే మనకు అనుకూల ఫలితాలే వస్తాయి. ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చుతున్నాం. మెగా డీఎస్సీకి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను గత ప్రభుత్వం స్వార్ధం కోసం ప్రవేశపెట్టింది. దాని రద్దుకు కూడా నిర్ణయం తీసుకున్నాం. పెన్షన్లు రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచాం. మూడు నెలల బకాయిలు వెయ్యి చొప్పున కలిపి వచ్చే నెలలో రూ.7 వేలు ఇవ్వబోతున్నాం. బకాయిలతో కలిపి రూ.7 వేలు ఇవ్వడం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. వికలాంగులకు రూ.3 వేల నుండి రూ.6 వేలకు పెంచాం. వచ్చే నెల పెన్షన్ల పంపిణీ సచివాలయ సిబ్బందితో ఉంటుంది. గత ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇవ్వడం అసాధ్యం అని చెప్పింది…సాధ్యం అవుతుందని చెప్పడానికే సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ చేపట్టబోతున్నాం. రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం రాబోతోంది. ప్రజల సాధికారత కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఫేజ్ -1 లో 183 అన్న క్యాంటీన్లను రాష్ట్రంలో పున:ప్రారంభించబోతున్నాం. ప్రజల భాగస్వామ్యంతో అన్న క్యాంటీన్ల నిర్వహణ ఉంటుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాడు చేసిన 5 సంతకాలకు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపాం.’’ అని సీఎం చంద్రబాబు వివరించారు.
బీసీలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది
‘‘పల్లా శ్రీనివాసరావు గాజువాకలో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారు. రాష్ట్ర చరిత్రలో ఇంత మెజారిటీ ఎప్పుడూ రాలేదు. బీసీ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావును టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించాం. గతంలోనూ బీసీలకే పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చాం…ఈ దఫా కూడా బీసీలకే ఇచ్చాం. వెనకబడిన వర్గాలకు టీడీపీ ప్రాధాన్యం ఇచ్చింది…ఇస్తుంది కూడా. స్పీకర్ పదవి కూడా బీసీ వర్గానికి చెందిన అయ్యన్న పాత్రుడుకు ఇచ్చాం.క్యాబినెట్ కూర్పులో కూడా సామాజిక సమతూకం పాటించాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.