- పేట్రేగిన వైసీపీ మూకలకు త్వరలోనే బుద్ధి చెప్తాం
- మాచర్ల ప్రజల చేతిలోనే ఎమ్మెల్యేకి బడితపూజ
- దుర్మార్గుడిని మాచర్ల నుంచి బహిష్కరించాలి
- పుస్తకావిష్కరణలో టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు
అమరావతి (చైతన్యరథం): జగన్ అండ చూసుకునే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి పైశాచికత్వం తారాస్థాయికి చేరిందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు, దోపిడీ విధానాలపై తెలుగుదేశం పార్టీ ‘పిన్నెల్లి పైశాచికత్వం’ పుస్తకాన్ని ఆవిష్కరించింది. టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, పిల్లి మాణిక్యరావు, మరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ధారూనాయక్, హైకోర్టు న్యాయవాది పారాకిషోర్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
సర్కారు అండతోనే అరాచకాలు: బుద్దా వెంకన్న
రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో మాచర్ల నియోజకవర్గంలోని దేవాలయాల్లో విగ్రహాలు చోరీచేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే సీటిచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన దగ్గర్నుంచీ సోదరుడితో కలిసి పిన్నెల్లి చేసే అరాచకాలకు అడ్డులేకుండా పోయింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పిన్నెల్లి 2వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డాడు. పిన్నెల్లి పాలనలో 8 హత్యలు, 79 దాడులు జరిగాయి. ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీలపై దాదాపు 51 దాడులు జరిగాయి. ఎన్నికల రోజున మేము మాచర్లకు వెళితే మా తరపు లాయర్ కిశోర్‌పై దాడిచేసి తల పగులగొట్టారు. పిన్నెల్లి పైశాచికత్వంపై నేడు పుస్తకాన్ని విడుదల చేశాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బతుకంతా నేర చరిత్రే. జగన్ అతిగా ప్రేమించే పిన్నెల్లిది నేర మనస్తత్వం. 2004నుంచి 2012 వరకు పిన్నెల్లికి ఎదురులేకుండా పోయింది. సెగ్మెంటులో పిన్నెల్లి తనకంటూ ఓ చట్టాన్ని రూపొందించుకున్నారు. విగ్రహాల దొంగను కాదని మాచర్ల సెంటర్‌లో భార్యా పిల్లలతో వచ్చి ప్రమాణం చేయగలవా అని పిన్నెల్లికి ఛాలెంజ్ విసురుతున్నాను.
1996 నుంచి ఉమ్మడి రాష్ట్రంలోను, రాష్ట్రంలో ఫ్యాక్షనిజం లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు. గతంలో ఎన్నికలప్పుడు అనేకచోట్ల రీపోలింగ్ జరిగేది. ఇటీవలి కాలంలో రీపోలింగ్ అన్నదే లేదు, ఒక్క మాచర్లలో తప్ప. వైసీపీ ఓటమి జీర్ణించుకోలేకే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశాడు. పిన్నెల్లిపై ప్రజలకున్న వ్యతిరేకత బయటపడిన ఓట్లే స్పష్టం చేస్తున్నాయి. నియోజకవర్గం మొత్తం ఎన్నికలు ఆపేయాలన్నది పిన్నెల్లి పన్నాగం. ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి మాచర్ల మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే గ్రానైట్‌పై ట్యాక్స్ వేసి దాదాపు 12 వందల కోట్లు దోచుకున్నాడు. కొందరికి అన్నం, కూర అంటే ఇష్టమైతే, పిన్నెల్లికి గ్రానైట్ రాళ్లంటే ఇష్టం. ఎవరిమీదైనా కోపమొస్తే ఆ రాళ్లతోనే కొట్టి ఆ ముచ్చట తీర్చుకుంటాడు. ఆత్మకూరు, రాయవరం, అలుగురాజుపల్లి, అడిగొప్పల, అమ్మవారిగుడి పరిసర ప్రాంతాల్లో గ్రానైట్ తవ్వకాల్లో దాదాపు 70 కోట్లు కొట్టేశారు. కన్నగుంట్ల, వేల్పూరు మండలంలో కంకరతవ్వి 40 కోట్లు దోచుకున్నాడు. మాచర్లలో సీసీ రోడ్లు వేసినా, ఎక్కడైన కాలువ మరమ్మత్తులు చేసినా ఏ చిన్న నిర్మాణం చేపట్టినా పిన్నెల్లికి 5 శాతం వాటా కావాలి. రైతులు తమ పొలాల పాస్ పుస్తకాలకు అప్లై చేస్తే 15 వేలు పిన్నెల్లికి చెల్లించాల్సి ఉంటుంది. పిన్నెల్లి అరాచకాలు, ఆగడాలను ఛానెళ్లే ప్రసారం చేశాయి. పిన్నెల్లి అరాచకాలతో ప్రజలు విసిగిపోయారు.
2022 డిసెంబర్ 16న మాచర్లలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం తెలపెట్టగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పిన్నెల్లి అనుచరులు విరుచుకుపడి, బీభత్సం సృష్టించారు. మాచర్లను రణరంగం చేశారు. బ్రహ్మారెడ్డి ఇల్లు, పార్టీ కార్యాలయం, టీడీపీ నాయకుల ఇళ్లకు నిప్పుపెట్టారు. అంత జరిగినా అప్పటి ఎస్పీ రవిశంకర్‌రెడ్డి దాన్ని టీడీపీ నాయకుల తప్పుగానే చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ప్రజల్లో చైతన్యం రావడంతో.. ఏ గ్రానైట్‌తో సంపాదించారో ఆ గ్రానైట్ రాళ్లతోనే ప్రజలు చంపేస్తారని గ్రహించి పిన్నెల్లి, అతని సోదరుడు ఊరొదలి పారిపోయే పరిస్థితి వచ్చింది. భయపడి కోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. జగన్‌ని మించిన సైకో పిన్నెల్లి. 2024 తరువాత ప్రజల చేత సమాధానముంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల్లో తిరగగలవా? మాచర్ల ప్రజలే నీకు గ్రానైట్‌తో బుద్ధి చెబుతారు’ అని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.
అల్లర్లకు కారణమైనవారిని వదిలేది లేదు: అడ్వకేట్ కిషోర్
గత మార్చి 11న స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాచర్లలో జరిగిన హింసలో గాయ పడ్డాను. మాచర్లలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండదు. కొందరు పోలీసులు యూనిఫామ్ వేసుకోకుండా పిన్నెల్లి పాలేరుల్లా వ్యవహరిస్తారు. వారిలో భక్తవత్సల రెడ్డి ప్రధానం. బదిలీపై ఒంగోలు వెళ్లినా పిన్నెల్లి సేవలోనే తరిస్తున్నాడు. మామీద జరిగిన దాడిలో పోలీసులు సక్రమంగా వ్యవహరించేలేదనే ఉద్దేశంతో హైకోర్టులో పిటిషన్ వేశాం. వేసవి తరువాత విచారణ జరుగుతుంది. ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ తెచ్చుకున్నాడు. పిన్నెల్లిపై ఇంకా 307, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. వాటిపైనా బెయిల్ తెచ్చుకున్నాడు. మాపై దాడి చేయడానికి ప్రయత్నించినవారిని పట్టుకోవడా నికి కనీస ప్రయత్నం చేయలేదు. పోలీసు గన్‌మెన్ ఎక్కడుంటాడో వారికి తెలుసు, అతనే కథంతా నడిపాడు. కారంపూడిలో హింస ప్రేరేపించారు. పోలీసులకు బాస్‌లా వ్యవహరిస్తున్న పిన్నెల్లి వ్యవహారం ఎక్కవ రోజులు సాగదు. ప్రజాస్వామ్యబద్దంగా వారికి సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది అన్నారు.
ప్రజల చేతిలోనే బడితపూజ: పిల్లి మాణిక్యరావు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైశాచికత్వంతో విర్రవీగాడు. అతని నేరచరిత్ర వివరాలతోనే పుస్తకాన్ని విడుదల చేశాం. ఐదేళ్లలో పిన్నెల్లి పాల్పడిన అరాచకాలు, దారుణాలు అనంతం. 2 వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేశాడు. పిన్నెల్లి రోడ్డుపైకి వస్తే బందిపోటు దొంగలను కొట్టినట్లుగా కొడతారని మాణిక్యరావు వ్యాఖ్యానించారు.
మాచర్ల నుండి బహిష్కరించాలి: ధారూ నాయక్
రాష్ట్రవ్యాప్తంగా మాచర్ల నియోజకవర్గం గురించి చర్చ నడుస్తోంది. మాచర్ల పవిత్రమైన నియజకవర్గం. ఇలాంటి నియోజకవర్గానికి మచ్చ తెచ్చిన దుర్మార్గులు పిన్నెల్లి సోదరులు. మాచర్ల నియోజకవర్గాన్ని యావత్ రాష్ట్రమంతా అసహ్యించుకునే స్థాయికి పిన్నెల్లి పరువు తీశాడు. 20ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి మాచర్ల లో అభివృద్ధిని ప్రజలకు దూరం చేశాడు. మాచర్ల నియోజకవర్గంలో వందలాది కుటుంబాలు సర్వ నాశనం అయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను తన రాజకీయ లబ్ధి కోసం అణగదొక్కుతూ.. వాళ్లపై లెక్కలేనన్ని దాడులకు పాల్పడ్డాడు. తాగడానికి మంచి నీళ్లు అడిగితే గిరిజన మహిళ సామూబాయిని ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేశారు. టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య, జాలయ్యలను దారుణంగా పిన్నెల్లి అనుచరులు హత్య చేశారు. మరికొంత మందిని పిన్నెల్లి హత్య చేయించాడు, మరికొంత మందిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. కులాన్ని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యేగా ఎదిగి, నియోజకవర్గాన్ని దోచుకోవడం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అలవాటుగా మారింది. నాగార్జునసాగర్ రోడ్డులో 30ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఎత్తిపోతలవద్ద కొంత భూమి, విమానాశ్రయం వద్ద 200 ఎకరాల భూమి కబ్జాకు గురయ్యాయి. మాచర్ల లో ఎక్కడ చూసినా కబ్జాలే. పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. పిన్నెల్లిని మాచర్ల నుండి బహిష్కరించాలి. పిన్నెల్లి పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
జగన్‌రెడ్డిని చూసుకునే..: దేవినేని ఉమ
వైసీపీ పాలనలో పల్నాడు వల్లకాడైంది. ‘పిన్నెల్లి పైశాచికం’ పుస్తకం.. రూ.2లక్షల ఆదాయం నుంచి రూ.2వేల కోట్ల స్థాయికి ఎలా ఎదిగాడో జగన్ నేర సామ్రాజ్యానికి సంబంధించిన ఓ కేస్ స్టడీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు పిన్నెల్లి ఏవిధంగా నామినేషన్లు లేకుండా చేశాడో, అదే విధానాన్ని ప్రతిఒక్కరూ అవలంభించాలంటూ పిన్నెల్లిని ఆదర్శంగా తన ఎమ్మెల్యేలకు చూపించాడు. మాచర్లలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో పిన్నెల్లిని ఉద్దేశించి జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. నా స్నేహితుడు,మంచివాడు,సౌమ్యుడు, మీరు గెలిపిస్తే మరింత పైకి తీసుకెళ్తా నని ప్రజలతో చెప్పాడు. అందుకే పిన్నెల్లి ఈవీఎంలను ధ్వంసం చేసేందు కు సాహసించాడు. ఈవీఎంలను బద్దలు కొట్టినవాడిపై చర్యలుతీసుకోవా లని పోలీసులను కోరాల్సింది పోయి.. పిన్నెల్లి వీడియో బయటకు ఎలా వచ్చిందో విచారణచేయాలని అడగటం పార్టీకి సిగ్గులేని తనమే అన్నారు. చేరెడ్డి మంజుల అనే టీడీపీ పోలింగ్ ఏజెంట్‌పై పిన్నెల్లి అనుచరులు గొడ్డలి తో దాడి చేసినా మంజుల ఎక్కడా వెనక్కి తగ్గకుండా పోలింగ్ ప్రక్రియలో పాల్గొంది. పల్నాటి పౌరుషాన్ని తెలియజేసింది.సరస్వతిపవర్ భూముల కుంభకోణంలో పిన్నెల్లి సోదరులు రైతులపై దాడులుచేశారు. అప్పట్నుంచి పిన్నెల్లి అరాచకాలు మొదలయ్యాయి. సీఐపై పిన్నెల్లి దాడులు చేసినా వైసీపీ పాలనలో పట్టించుకో లేదు. ఇలాంటి పిన్నెల్లికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్తున్నారు.రానున్న కాలంలో పిన్నెల్లి తగిన మూల్యం చెల్లించుకుంటాడని, పిన్నెల్లిపై ఉన్న కేసులన్నింటినీ కోర్టులో నిరూపించి తగిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.