- బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలి
- ఒంగోలులో ఇద్దరు సీఐలను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి
- సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి
- పులివెందులలో బీటెక్ రవికి భద్రత కల్పించాలి
- కోడ్ వచ్చినా జగన్ బొమ్మతో ఇళ్లపట్టాలా?
- పింఛన్ల కోసం వచ్చిన వృద్ధుల మరణాలకు సీఎస్, సెర్ప్ సీఈఓలదే బాధ్యత
- ఎన్నికల సంఘానికి టీడీపీ నేతల ఫిర్యాదు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చాలా తీవ్రమైన నేరమన్నారు. ఒంగోలులో టీడీపీ నాయకులపై దాడి జరిగితే తిరిగి టీడీపీ కార్యకర్తలపైనే కేసు నమోదు చేసి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తొత్తులుగా పనిచేస్తున్న సీఐలు లక్ష్మణ్, భక్తవత్సల రెడ్డిలపైనా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)కి ఫిర్యాదు చేశారు.
వైసీపీ సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు వ్యాప్తి చేస్తూ మైనారిటీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తప్పుడు సమాచారం, వార్తలు సృష్టించి దుష్ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎన్నికల కోడ్ వచ్చినా కూడా ఇంకా జగన్ బొమ్మ ఉన్న ఇళ్ళపట్టాలను, కుల ధృవీకరణ పత్రాలను కొంతమంది అధికారులు పంపిణీ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. జనాన్ని ప్రభావితం చేసే ఉన్న ఇళ్లపట్టాల పంపిణీని నిలువరించాలని సీఈఓను కోరారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య, దేవినేని ఉమా మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలి: వర్ల రామయ్య
రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఫోన్‌లు ట్యాపింగ్ చేస్తున్నారని మొదటి నుంచి మేము హెచ్చరిస్తునే ఉన్నామని వర్ల రామయ్య అన్నారు. ఈ విషయంపై విచారణ జరపాలని ఎన్నికల కమిషన్‌కు కూడా మేము గతంలోనే ఫిర్యాదు చేశాం. మా నాయకుల ఫోన్‌లకు ఆపిల్ సంస్థ ఎన్నో సార్లు సెక్యూరిటీ నోటిఫికేషన్ పంపించింది. తాజాగా యువనేత నారా లోకేష్ బాబు ఫోన్ కూడా ట్యాపింగ్‌కి గురవుతోందని ఆపిల్ సంస్థ సెక్యూరిటీ అలెర్ట్ నోటిఫికేషన్ పంపింది. పెగాసిస్ సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రతిపక్ష నాయకుల ఫోన్లను వైసీపీ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని గతంలోనే ఫిర్యాదు చేశాం. తిరిగి ఫిర్యాదు చేస్తున్నాం. ఐఫోన్ వినియోగదారులకు సెక్యూరిటీ నోటిఫికేషన్ వస్తుండటంతో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ మిగిలినవారి ఫోన్‌లు ట్యాపింగ్ చేసి వారి కదలికలను అధికార పార్టీ గమనిస్తోందని, దానిని కట్టడి చేయాలని సీఈఓను కోరామని వర్ల రామయ్య తెలిపారు.
ఈ సీఐలను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి…
రాష్ట్రంలో చాలామంది పోలీసు అధికారులు ఇప్పటికీ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. జగన్ రెడ్డి చెప్పినట్లు నడుచుకుంటే ఇబ్బందులకు గురవుతారని ఎన్ని సార్లు ఎంతమంది అధికారులకు చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లవుతోంది. ప్రకాశం జిల్లాలోని సీఐలు లక్ష్మణ్, భక్తవత్సల రెడ్డి.. అధికార పార్టీ నాయకులకు కొమ్మకాస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకు సీఐ సెల్యూట్ చేస్తారు.. కానీ ఎమ్మెల్యే కొడుకుకి, కుటుంబసభ్యులకు సీఐ సెల్యూట్ చేయడం ఇప్పుడే చూస్తున్నాం. ఇటువంటి అధికారులు నిష్పక్షపాతంగా ఉంటారనే నమ్మకం ప్రజలకు లేదు. బాలినేని మాటే వేదంలా సీఐ లక్ష్మణ్ పని చేస్తాడని ఒంగోలు నగరం మొత్తం కోడై కూస్తోంది. ఇక ఎమ్మెల్యే చెప్పాడని జైలులో ఉన్న వ్యక్తులపై కూడా కేసు పెట్టిన ఘనుడు సీఐ భక్తవత్సల రెడ్డి. ఈ ఇద్దరు పోలీసు అధికారులు వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. వీరు ఒక్క క్షణం కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వీలు లేదని వర్ల అన్నారు.
బీటెక్ రవికి భద్రత కల్పించాలి
మొదటి నుంచి దురుద్దేశంతోనే జగన్ రెడ్డి వాలంటీరు వ్యవస్థను పెట్టుకున్నాడు. ఇప్పుడు వాలంటీర్లుగా రాజీనామా చేసి ఏజెంట్లుగా మారాలంటూ వాలంటీర్లపై అధికార పార్టీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న వాలంటీర్లను ఏజెంట్లుగా వినియోగించకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరాం. కీలకమైన విషయాల గురించి మాట్లాడాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అపాయింట్మెంట్ కోరాం. కానీ ఆయన మాకు అవకాశం ఇవ్వలేదు. చేసేది లేక ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాము. చిన్న గొడవ అయినా మేము ఈసీకి ఫిర్యాదు చేయాల్సి వస్తోంది. ముఖ్యమంత్రిపై పులివెందుల నుంచి మా పార్టీ తరఫున బీటెక్ రవి పోటీ చేస్తున్నాడు. ఆయనకు భద్రత కల్పించాలి. బీటెక్ రవికి ప్రాణానికి హాని ఉంది.. గన్‌మ్యాన్లు ఇవ్వాలని డీజీపీని కోరాం. అతనికి ప్రాణహాని లేదని కడప ఎస్పీ బదులిచ్చాడు. పులివెందులలో గన్‌మ్యాన్‌లు లేకుండా స్వేచ్ఛగా ఏ వ్యక్తైనా ఎన్నికల ప్రచారం చేశారంటే ఇక రాష్ట్రంలో ఏ అభ్యర్థికి గన్ మ్యాన్‌ల అవసరం లేనట్లే.. రాష్ట్రమంతటా ప్రశాంతంగా ఉన్నట్లేనని వర్ల వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సీఎస్, సెర్ప్ సీఈవో నిర్ణయాలకు 33 మంది బలి: దేవినేని ఉమా
ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత మచిలీపట్నంలో పోలీసు స్టేషన్‌పై పేర్ని నాని దాడి, ఒంగోలులో బాలినేని అరాచకాలు వంటి ప్రధానంగా 35 సంఘటనలపై ఈసీకి ఫిర్యాదు చేశాం. కానీ ఇప్పటివరకు న్యాయం జరగ లేదు, నిందితులపై చర్యలు లేవు. బందర్‌లో జరిగిన ఘటనపై పేర్ని నాని, ఆయన తనయుడు కిట్టూలపై కేసు పెట్టుంటే ఒంగోలులో బాలినేని అరాచకాలు జరిగేవి కాదు. పింఛన్ల పంపిణీ వ్యవహారంలో సీఎస్ జవహార్ రెడ్డి, సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల 33మంది వృద్ధులు మరణించారు. భవిష్యత్తులో పింఛన్ల పంపిణీ సజావుగా సాగాలంటే సెర్ప్ సీఈవోగా మురళీధర్ రెడ్డి ఉండకూడదని ఈసీకి తెలిపామని దేవినేని చెప్పారు. సీఈఓను కలిసిన వారిలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీి, గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్, హెచ్‌ఆర్డీ మెంబర్ ఎస్పీ సాహెబ్, తదితరులు ఉన్నారు.
పోలీసులు దాడి చేశారు: డూండి రాకేష్
విజయవాడలో ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచరులు తనతో అనుచితంగా, దురుసుగా ప్రవర్తించారని, అదే సమయంలో వైసీపీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు తనపై దాడి చేసి, అక్రమంగా నిర్బంధించారని సీఈఓకు టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్ ఫిర్యాదు చేశారు. మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘర్షణలో పటమట పోలీసులకు సంబంధం లేకపోయినా అత్యుత్సాహం చూపించారన్నారు. గొడవపడిరది వైకాపా మూకలైతే సీఐ మోహన్ రెడ్డి నా చొక్కా పట్టుకొని రొడ్డు మీదకు లాక్కొచ్చారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్నారు. ఇటువంటి అధికారులు ఎన్నికల విధుల్లో ఉంటే ఎన్నికలు సజావుగా జరగవు. తనపై జరిగిన అరాచక దాడిపై సమగ్ర విచారణ జరిపి, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీఈవోకు డూండి రాకేష్ ఫిర్యాదు చేశారు.