- జగన్ రెడ్డి పాలనలో రాష్ట్ర దుస్థితి .టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి: వైసీపీ జగన్రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిపోయిందని, అప్పుల్లో మాత్రం ముందుందని రాష్ట్ర దుస్థితిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం మూడేళ్లలో ఒక్క కొత్త రోడ్డు కూడా వెయ్యలేదన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు. నాడు-నేడు అంటూ పాఠశాలల అభివృద్ధి పేరుతో సొంతపార్టీ వాళ్ళను మేపడానికే నిధులు ఎక్కువగా వాడారన్నారు. ఇప్పుడు తరగతి గదుల్లో పెచ్చులు ఊడి పడుతున్న వార్తలు రోజూ చూస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వంలో వేసింది సున్నా అన్నారు. గత ప్రభుత్వంలో 13 లక్షల పక్కా ఇళ్ళ నిర్మాణం చేపట్టి దాదాపు 8 లక్షల ఇళ్లు పూర్తి చేసినట్లు వివరించారు. ఈ ప్రభుత్వంలో ఇళ్ళ నిర్మాణం లేదు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన లేదన్నారు. కొత్త ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లు, పంచాయితీ భవనాలు గత ప్రభుత్వంలో కట్టించినవేనని చెప్పారు. ఈ ప్రభుత్వంలో వీళ్ళు తెరిచిన సచివాలయా లకు అద్దెలు కూడా చెల్లించకపోవడంతో ఆ భవనాల యజమానులు తాళాలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. గత మూడేళ్లుగా అభివృద్ధిలో వెనక్కి, అప్పుల్లో ముందుకి వెళ్తున్నామని చెప్పారు. గత 72 సంవత్సరాల్లో మూడు రెట్లు అధికంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, ప్రజల నెత్తిన, పుట్టబోయే బిడ్డల నెత్తిన కూడా అప్పుల భారాన్ని వేశారని మండిపడ్డారు. ఈ ముఖ్య మంత్రి అసమర్థ,ప్రణాళికలేని పరిపాలన వల్లనే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందని చెప్పారు.
మా ప్రభుత్వం తెచ్చిన కంపెనీలకు జగన్రెడ్డి రిబ్బన్కటింగ్
కియా మోటార్స్, హీరో మోటార్స్, అశోక్ లే ల్యాం డ్, ఇసుజు, అపోలో టైర్స్, టీసీఎల్, యో కొహమా.. ఇలా గత ప్రభుత్వం తెచ్చిన కంపెనీలు అన్నింటికీ రిబ్బన్ కటింగ్ చేయడం తప్ప జగన్రెడ్డి ప్రభుత్వం తెచ్చిన కం పెనీ ఒక్కటైనా ఉందా అని కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఎవరికో పుట్టిన బిడ్డకు తానే తండ్రి అని ప్రచారం చేసుకోవడం అంటే ఇదేనని పేర్కొన్నారు.