అమరావతి (చైతన్య రథం): పాక్ ఉగ్రవాదుల భరతం పట్టేలా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్‌పై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేయడంపై హర్షం వ్యక్తంచేశారు. ‘‘మన నేలపై మొలిచిన మొక్క కూడా పీకలేరు! వంద పాకిస్థాన్లకు సమాధానం చెప్పే మిసైల్ పేరు మోదీ’’ అని పేర్కొంటూ ప్రత్యేక వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునఃప్రారంభోత్సవ వేడుకలకు విచ్చేసిన సందర్భంలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని పాయింట్లు, పాక్ ఉగ్రవాద స్థావరాలపై సైన్యం జరిపిన దాడుల దృశ్యాలు, ప్రధాని మోదీ ప్రసంగంలోని కొన్ని మాటలతో కలిపి 54 సెకన్ల నిడివి కలిగిన వీడియోను లోకేష్ పంచుకున్నారు. అంతకుముందు ఈ అంశంపై ట్వీట్ చేసిన లోకేశ్ ‘‘భారతదేశ సార్వభౌమత్వాన్ని పరీక్షించేందుకు దైర్యం చేసేవారికి ఇదో గట్టి సందేశం. ప్రధాని నరేంద్ర మోదీ దృఢమైన నాయకత్వంలో భారత్ అచంచలమైన దృఢ సంకల్పంతో కచ్చితంగా ప్రతిదాడి చేస్తుంది. ప్రధాని మోదీకి హృదయపూర్వక అభినందనలు. ఆయన ధైర్యం, దేశ భద్రతపట్ల అంకితభావం.. పాక్‌ను భయభ్రాంతులకు గురిచేశాయి. భారతీయులందరూ గర్వపడేలా చేశాయి. భారత్ ఐక్యంగా ఉంది. ఈ భూమిపై ఏ శక్తి మన స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేదు’’ అని పేర్కొన్నారు.