అనంతపురం జిల్లాలో వర్షపాతం దేశంలోనే అతి తక్కువ. కరవునేలలో తాగునీటికీ ఇబ్బందులే. దీన్ని దృష్టిలో ఉంచుకునే వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం ఉరవకొండ నియోజకవర్గంలో పచ్చని పంట పొలాలను చూపిస్తూ లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. టిడిపి హయాంలో పంటకుంటలు తవ్వించి, చెక్ డ్యాములు నిర్మించి దేశంలోనే అనంతపురానికి మొదటిస్థానంలో నిలిపామన్నారు.
భూగర్భజలాలు పెరిగాయి. డ్రిప్ పరికరాలు సబ్సిడీపై అందించునట్టు చెప్పారు. నీటిని పొదుపుగా వాడుకుని రైతులు బంగారు పంటలు పండించారంటూ అభినందించారు. అనంతపురం జిల్లాలో యువగళం పాదయాత్ర సాగుతుండగా, కూడేరు వద్ద మండువేసవిలో కనిపించిన ఈ పచ్చని పంటలు టిడిపి ప్రభుత్వం రైతులకు చేసిన మేలుకు పచ్చని సాక్ష్యం అని పేర్కొన్నారు. ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలో రూ.890 కోట్లతో మంజూరు చేసిన మెగా డ్రిప్ పథకంతో 50 వేల ఎకరాలు సాగవుతున్నాయన్నారు. ఇదీ తెలుగుదేశం ముందుచూపు. ఇదీ వ్యవసాయాన్ని పండగ చేసిన చంద్రబాబు పాలన అని లోకేష్ పేర్కొన్నారు .
వ్యవసాయానికి సాయం అయ్యే ఒక్క మంచి పనీ చేయని జగన్ రెడ్డి, రైతుల మోటార్లకి మీటర్లు మాత్రం ఉరితాళ్లలా బిగిస్తున్నారని విమర్శించారు. రైతు రాజ్యం తెస్తానని, రైతుల్లేని రాజ్యం చేస్తున్నారు వైసీపీ పాలకులు అంటూ ధ్వజమెత్తారు.